Published : 12/12/2021 14:38 IST

అందుకే వీళ్లు ‘పవర్‌ఫుల్‌ కపుల్‌’!

భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయతలే కాదు.. సానుకూల దృక్పథం, సృజనాత్మకత, గౌరవమర్యాదలు, ప్రశంసలు..మొదలైనవెన్నో ఉండాలంటోంది ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బ్రాండ్స్‌ (IIHB) సంస్థ. ఆలుమగల మధ్య ఉండే ఇలాంటి లక్షణాల్ని పరిగణనలోకి తీసుకొని ఏటా ‘Annual Power Couple Survey’ నిర్వహిస్తుంటుంది. అలా ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో బిజినెస్‌ కపుల్‌ ముకేశ్‌ అంబానీ - నీతా అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. దీప్‌వీర్‌, విరుష్క జంటలు రెండు, మూడు స్థానాల్ని ఆక్రమించుకున్నారు. మరి, ఈ సర్వే ద్వారా మన సెలబ్రిటీ జంటలు మనకు నేర్పుతోన్న రిలేషన్‌షిప్‌ పాఠాలేంటో తెలుసుకుందాం రండి..

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్స్‌ బ్రాండ్స్‌ (IIHB) ‘Annual Power Couple Survey’ పేరుతో దేశంలోని సెలబ్రిటీ జంటలపై ఓ సర్వే నిర్వహిస్తుంటుంది. సినిమాలు, వినోదం, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఇందుకు ప్రాతిపదికగా తీసుకుంటుంది. అయితే ఈసారి వ్యాపార రంగానికి చెందిన జంటల్నీ ఇందులో భాగం చేసింది. ఈ క్రమంలో 25-40 మధ్య వయసున్న స్త్రీపురుషుల దగ్గర్నుంచి అభిప్రాయాల్ని సేకరించిన ఈ సంస్థ.. బిజినెస్‌ కపుల్‌ నీతా-ముకేశ్‌కి 94 శాతం మార్కులతో అగ్రస్థానాన్ని అందించింది. గతేడాది కరోనా కారణంగా సర్వే నిర్వహించలేదు. ఇక 2019 సర్వేలో దీప్‌వీర్‌, విరుష్క జంట టాప్‌ స్థానాన్ని దక్కించుకున్నాయి.

నీతా-ముకేశ్‌ # 1

భార్యాభర్తలిద్దరూ అన్ని విషయాల్లో సమానమేనని తమ అనుబంధంతోనే నిరూపిస్తుంటారీ బిజినెస్ కపుల్‌. ఇంటి విషయాల్లోనే కాదు.. వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఒకరికొకరు సమప్రాధాన్యమిచ్చుకుంటారు. ఈ విషయం వారు ఆయా కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. సానుకూల దృక్పథంతో ఉండడం, సృజనాత్మకంగా ఆలోచించడం, గౌరవమర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రశంసించుకోవడం, లక్ష్యాలను అందుకోవడం.. ఇలా వీళ్లలో ఉన్న ఈ బహుళ లక్షణాలే వీళ్లకు అగ్రస్థానం దక్కేలా చేసిందంటోందీ సర్వే.

దీప్‌వీర్‌ # 2

భార్యాభర్తల్ని చూస్తే ఒకరి కోసం మరొకరు పుట్టారేమో అనిపించాలి.. అలాగే కనిపించాలి కూడా! ఇలాంటి ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ జంటే బాలీవుడ్‌ లవ్‌ కపుల్‌ దీపికా పదుకొణే - రణ్‌వీర్‌ సింగ్‌. ఎంతో సరదాగా, చూడముచ్చటగా, విలక్షణంగా, నలుగురిలో ‘ఒక్క’రిగా కనిపించడమే వీరి ప్రత్యేకతలు. ఈ లక్షణాలన్నీ వారు పోస్ట్‌ చేసే ఫొటోల్లో, బయట కనిపించినప్పుడు కూడా కనిపిస్తుంటాయి! నిజానికి ఇవే వీరికి ఈ సర్వేలో 86 శాతం మార్కులతో రెండో స్థానాన్ని కట్టబెట్టాయంటోందీ సంస్థ.

విరుష్క # 3

సెలబ్రిటీ విహార యాత్రలంటే ముందుగా గుర్తొచ్చే జంట విరాట్‌ కోహ్లీ - అనుష్కా శర్మ. ఎప్పుడూ బిజీగా ఉండే వీళ్లిద్దరూ కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ఈ ప్రపంచంలో ఏదో ఒక ప్రదేశానికి చెక్కేస్తుంటారు. అంతెందుకు.. క్రికెట్‌ మ్యాచ్‌లకు వెళ్లినా ప్రాక్టీస్‌ లేని సమయంలోనూ అక్కడి అందమైన ప్రదేశాల్ని చుడుతుంటుందీ జంట. ఇలా ఇద్దరికీ వెకేషన్‌పై ఉన్న మక్కువే ఈసారి పవర్‌ కపుల్‌ సర్వేలో ఈ జంటకు మూడో స్థానాన్ని అందించింది. అంతేకాదు.. బ్రాండ్‌ విలువ, విలాసవంతమైన జీవనశైలి, ఏ విషయాన్నైనా నిజాయతీగా పంచుకోవడం.. ఇలా వీళ్లిద్దరిలో ఉన్న కామన్‌ లక్షణాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ లవ్లీ కపుల్‌కు 79 శాతం ఓట్లు వేశారు సర్వేలో పాల్గొన్న పార్టిసిపెంట్లు.

వీరితో పాటు..

4. రణ్‌బీర్‌-అలియా (72 శాతం)

5. అక్షయ్ కుమార్‌ - ట్వింకిల్‌ ఖన్నా (68 శాతం)

6. షారుఖ్‌ - గౌరీ ఖాన్‌ (61 శాతం)

7. సైఫీనా (56 శాతం)

8. అమితాబ్‌ - జయా బచ్చన్‌ (52 శాతం)

9. విక్కీ - కత్రినా (48 శాతం)

10. నారాయణ మూర్తి - సుధా మూర్తి (46 శాతం)

11. నటాషా - అదార్‌ పూనావాలా (42 శాతం)

12. ఆదిత్య చోప్రా - రాణీ ముఖర్జీ (41 శాతం)

13. అజయ్‌ దేవ్‌గణ్‌ - కాజోల్‌ (39 శాతం)

14. ప్రియాంక చోప్రా - నిక్‌ జొనాస్‌ (38 శాతం)

15. అభిషేక్‌ బచ్చన్‌ - ఐశ్వర్యారాయ్‌ (35 శాతం)

16. అజీమ్‌ ప్రేమ్‌జీ - నసీమ్‌ ప్రేమ్‌జీ (32 శాతం)

17. సచిన్‌ - అంజలీ తెందూల్కర్‌ (31 శాతం)

18. ధోనీ - సాక్షీ సింగ్‌ (30 శాతం)

19. ఆనంద్‌ - అనురాధా మహీంద్రా (24 శాతం)

20. కుమార మంగళం బిర్లా - నీర్జా బిర్లా (22 శాతం).. ఓట్లతో వరుస స్థానాల్లో నిలిచారు.

మరి, భార్యాభర్తలంటే అన్నింట్లోనూ సమానమేనని చాటుతోన్న ఈ సర్వేలో మీరే గనుక ఉంటే.. మీ అనుబంధానికి ఎన్ని మార్కులిచ్చుకుంటారు? నలుగురికీ మీరు చెప్పే రిలేషన్‌షిప్‌ పాఠాలేంటి? మాతో పంచుకోండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని