బనారసీ దుస్తుల్ని భద్రపరచడమెలా..?

పెళ్లైనా, పండగైనా.. కొంతమంది బనారసీ చీరల్నే ఎంచుకుంటారు. అటు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఇటు రాయల్‌ లుక్‌ని అందించడమే దీనికి ప్రధాన కారణమని చెప్పచ్చు. ఈ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన లెహెంగాలు, కుర్తీలు, అనార్కలీలు.. ఇలా చాలా ఫ్యాషన్లే మార్కెట్లో సందడి చేస్తున్నాయి.

Published : 05 Aug 2023 18:32 IST

పెళ్లైనా, పండగైనా.. కొంతమంది బనారసీ చీరల్నే ఎంచుకుంటారు. అటు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఇటు రాయల్‌ లుక్‌ని అందించడమే దీనికి ప్రధాన కారణమని చెప్పచ్చు. ఈ ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన లెహెంగాలు, కుర్తీలు, అనార్కలీలు.. ఇలా చాలా ఫ్యాషన్లే మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మరి, వాటిని ధరిస్తేనే సరిపోదు.. భద్రపరిచే విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి..

పదే పదే వద్దు!

కొన్ని ఖరీదైన చీరలు/దుస్తుల్ని సాధారణ వాటిలా ఉతకలేం. అందుకే వాటిని డ్రై క్లీనింగ్‌కి ఇస్తుంటాం. బనారసీ దుస్తులు కూడా అంతే! అయితే కొంతమంది వేసుకున్న ప్రతిసారీ అవసరం ఉన్నా, లేకపోయినా డ్రైవాష్‌ చేయిస్తుంటారు. నిజానికి ఇలా చేస్తే ఈ ప్రక్రియలోని రసాయనాల వల్ల వాటి మెరుపు తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ! పైగా వాటిపై ఉన్న జరీ కూడా దెబ్బతింటుంది. కాబట్టి అత్యవసరమైతే తప్ప ఇలాంటి దుస్తుల్ని డ్రై క్లీనింగ్‌కి ఇవ్వకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. అది కూడా బాగా చెమట పట్టినప్పుడు, వాటిపై ఏవైనా మరకలు పడినప్పుడు, ఎక్కువసార్లు ధరించాక.. ఇలాంటప్పుడు మాత్రమే బనారసీ దుస్తుల్ని డ్రైవాష్‌ చేయించడం వల్ల అవి ఎప్పుడూ కొత్తవాటిలా మెరుస్తాయి.

ఎలా ఆరేస్తున్నారు?

సాధారణంగా పట్టు వంటి ఖరీదైన దుస్తుల్ని పదే పదే ఉతకం కాబట్టి.. వేసుకున్న ప్రతిసారీ, భద్రపరిచే ముందు కొన్ని గంటల పాటు గాలికి ఆరేస్తుంటాం. బనారసీ దుస్తులకు కూడా ఇదే నియమం వర్తిస్తుంది. అయితే కొంతమంది త్వరగా ఆరిపోవాలని, చెమట వాసన తొలగిపోవాలని ఆరుబయట ఎండలో ఆరేస్తుంటారు. దీనివల్ల రంగు వెలిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీడలో గాలి బాగా ప్రసరించే చోట ఆరేస్తే సరిపోతుంది. అలాగే వాటిని అల్మరాలో పెట్టే ముందు చెమ్మ లేకుండా మరోసారి పరిశీలించడమూ ముఖ్యమే. అంతేకాదు.. వాటిని నెలల తరబడి అలాగే ఉంచేయకుండా.. మధ్యమధ్యలో తీసి మడతలు మార్చి పెట్టడం మర్చిపోవద్దు.

ఇస్త్రీ చేసేటప్పుడు..!

బనారసీ దుస్తుల్ని ఎండకు దూరంగా ఉంచడమే కాదు.. వేడి తగలకుండా చూసుకోవడమూ ముఖ్యమే! ఈ క్రమంలో ఇస్త్రీ చేసేటప్పుడు.. పెట్టెను నేరుగా దుస్తులపై పెట్టడం వల్ల వేడికి సిల్క్‌ పాడయ్యే ప్రమాదం ఎక్కువ. కాబట్టి బనారసీ దుస్తులపై ఒక సన్నటి కాటన్‌ క్లాత్‌ లేదంటే పేపర్‌ వేసి.. దానిపై నుంచి ఐరన్‌ చేయడం వల్ల ఫ్యాబ్రిక్‌కు ఎలాంటి నష్టమూ జరగదు.. పైగా ముడతలు కూడా తొలగిపోతాయి.

నాఫ్తలీన్‌ బాల్స్‌ వేయద్దు!

అల్మరాలో దుస్తుల మధ్య చెమ్మ చేరకుండా.. క్రిమికీటకాలు, చిన్న చిన్న పురుగుల బారి నుంచి వాటిని కాపాడుకోవడానికి మధ్యమధ్యలో నాఫ్తలీన్‌ బాల్స్‌/మోత్‌బాల్స్‌ వేయడం మనకు అలవాటే! అయితే బనారసీ దుస్తుల మధ్య ఇలాంటివి వేయద్దంటున్నారు నిపుణులు. అలాగే వాటిని కాటన్‌/మస్లిన్‌ క్లాత్‌లో చుట్టి.. అన్ని బట్టలతో కాకుండా విడిగా భద్రపరచాల్సి ఉంటుంది. లేదంటే దాని జరీ, సిల్క్‌ దెబ్బతినే అవకాశం ఎక్కువట! ఇక కొంతమంది చీరలు, దుస్తుల్ని అల్మరాలోని హ్యాంగర్లకు వేలాడదీస్తుంటారు. ఇలాంటప్పుడు మెటల్‌ హ్యాంగర్లు కాకుండా ప్లాస్టిక్‌/అల్యూమినియంతో తయారుచేసిన హ్యాంగర్లను ఎంచుకోవడం వల్ల.. బనారసీ దుస్తుల్ని తుప్పు బెడద నుంచి రక్షించుకోవచ్చు.

వీటికి దూరంగా..!

ఏదైనా సందర్భంలో ప్రత్యేకంగా ముస్తాబవుతున్నామంటే- ఖరీదైన దుస్తులే కాదు.. మేకప్‌, పెర్‌ఫ్యూమ్‌, హెయిర్‌ స్ప్రేలు.. ఇలా చాలానే ఉంటాయి. పెర్‌ఫ్యూమ్‌ వంటివైతే మనం పూర్తిగా రడీ అయ్యాక స్ప్రే చేసుకుంటాం. అయితే బనారసీ దుస్తులపై ఇలాంటి రసాయనాలు నేరుగా పడకుండా జాగ్రత్తపడమంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటి కారణంగా సిల్కు, జరీ దెబ్బతింటుంది. ఆ ప్రదేశంలో మరక కూడా పడుతుంది. కాబట్టి ముందుగా ఒక కాటన్‌పై పెర్‌ఫ్యూమ్‌ స్ప్రే చేసుకొని.. దాంతో ఒంటిపై అద్దుకోవడం మంచిది. ఇక మేకప్‌ లిక్విడ్స్‌, పౌడర్లు, హెయిర్‌ స్ప్రేలు.. వంటివి కూడా బనారసీ దుస్తులపై పడకుండా చూసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్