నిద్ర మధ్యలో మెలకువ వస్తోందా?

కొంతమందికి ఇలా పడుకోగానే అలా నిద్ర పడుతుంటుంది. కానీ మధ్య రాత్రి మెలకువ వచ్చేస్తుంది. ఇక అంతే సంగతులు.. ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్ర పట్టదు. గడియారం వైపు చూస్తూ ఉదయం ఎప్పుడవుతుందా అని గంటలూ, నిమిషాలు లెక్క పెడుతుంటారు.

Published : 05 Aug 2023 12:20 IST

కొంతమందికి ఇలా పడుకోగానే అలా నిద్ర పడుతుంటుంది. కానీ మధ్య రాత్రి మెలకువ వచ్చేస్తుంది. ఇక అంతే సంగతులు.. ఎంత ప్రయత్నించినా అస్సలు నిద్ర పట్టదు. గడియారం వైపు చూస్తూ ఉదయం ఎప్పుడవుతుందా అని గంటలూ, నిమిషాలు లెక్క పెడుతుంటారు. దీనివల్ల అటు ప్రశాంతంగా నిద్రపోయినట్లూ ఉండదు.. ఇటు మెలకువతో ఉన్నట్లూ ఉండదు.. సరిగ్గా నిద్ర లేక చిరాకు ఆవహిస్తుంది. ఫలితంగా తెల్లారాక ఏ పనీ సరిగా చేయలేం. మరి ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలో చూద్దాం...

తక్కువ లైటింగ్..

కొంతమందికి లైట్లన్నీ ఆర్పేస్తేనే నిద్ర పడుతుంది. మీక్కూడా అదే అలవాటైతే బెడ్‌రూమ్‌లో సాధ్యమైనంత తక్కువ లైటింగ్ ఉండేలా చూసుకోండి. సులభంగా నిద్ర పడుతుంది. అప్పుడు మధ్యలో మెలకువ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

లెక్కపెట్టకండి..

మధ్య రాత్రి మెలకువ వచ్చినప్పుడు పదే పదే గడియారంలో సమయం చూసుకోకుండా అలాగే నిద్రపోండి.. ఇలా అస్తమానం టైం చూసుకుంటూ ఉంటే ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో వచ్చే నిద్ర కూడా రాకుండా పోతుంది. కాబట్టి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కళ్లు మూసుకుని నిద్ర పోవడానికి ప్రయత్నించండి.

కాసేపు వేరే ప్రదేశంలో..

కొంతమందికి నిద్రపోయే ముందు సంగీతం వినడం, పుస్తకాలు చదవడం.. మొదలైన అలవాట్లుంటాయి. ఒకవేళ మీకు మధ్య రాత్రి మెలకువ వచ్చి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోతే.. వేరే రూమ్‌లోకి వెళ్లి మనసుకు ఆహ్లాదం కలిగించే మ్యూజిక్ వినడమో లేదా పుస్తకం చదవడమో చేయాలి. దీంతో నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది.

మెడిటేషన్..

కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా తిరిగి నిద్ర పట్టేందుకు తోడ్పడతాయి. ఉదాహరణకి గాఢంగా శ్వాస పీల్చడం, విజువలైజేషన్, మెడిటేషన్.. వంటి రకరకాల ప్రక్రియలు మానసిక ప్రశాంతత కలిగించి నిద్రలోకి జారుకునేందుకు సహకరిస్తాయి. అలాగే ప్రతి రోజూ ఓ అరగంట వ్యాయామం చేయాలి.

మంచి ఆహారం..

పడుకునే ముందే తేలిగ్గా ఉండే మంచి ఆహారం తీసుకుని పడుకుంటే అసలు మధ్య రాత్రి మెలకువే రాదు.. అలాకాకుండా కొంతమంది డైటింగ్ అనీ.. అదనీ.. ఇదనీ.. సరిగ్గా తినకుండా లేదా లైట్ ఫుడ్ తీసుకుని పడుకుంటారు. ఇలాంటి వాళ్లకు నిద్ర సరిగ్గా పట్టదు సరి కదా.. మధ్య రాత్రి ఆకలేస్తుంటుంది. దీనివల్ల మరుసటి రోజంతా చిరాగ్గా ఉంటుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు మంచి పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం.

పగటి నిద్ర వద్దు..

కొంతమంది ఇంట్లో ఉండే వారు మధ్యాహ్న భోజనం తర్వాత రెండుమూడు గంటలు హాయిగా నిద్రపోతారు. పగలంతా ఇలా హాయిగా నిద్రపోతే ఇంక రాత్రి నిద్ర ఎలా పడుతుంది? కాబట్టి పగటి నిద్రకు స్వస్తి చెప్పండి..

నో ప్రాబ్లమ్స్ ప్లీజ్..!

కొందరు వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటి వారికి చాలా రకాల ఒత్తిళ్లుంటాయి. మధ్య రాత్రి మెలకువ వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ గుర్తొచ్చి తిరిగి నిద్ర పట్టకపోవచ్చు. కాబట్టి పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ సమస్యల గురించి ఆలోచించకపోవడం, చర్చించకపోవడం మంచిది.

అలాంటి సినిమాలు వద్దు..

కొంతమందికి హారర్ సినిమాలంటే ఇష్టం. చూసేటప్పుడు బాగానే చూస్తారు.. కానీ మధ్య రాత్రి మెలకువ వచ్చినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. ఆ సినిమాలోని కొన్ని సీన్స్ మరీ భయంకరంగా ఉంటాయి.. మెలకువ రాగానే అవే గుర్తొస్తుంటాయి. ఇంకేముంది.. బిక్కుబిక్కుమంటూ తెల్లవారే వరకూ వేచి చూడాల్సిందే.. కాబట్టి సాధ్యమైనంత వరకు పడుకునే ముందు ఇలాంటి సినిమాలు చూడకపోవడం మంచిది. అంతగా చూడాలనిపిస్తే మనసుకు ప్రశాంతతను, ఆహ్లాదాన్ని కలిగించే సినిమాలు చూడడం మంచిది.

డాక్టర్‌ను సంప్రదించండి..

వారంలో కనీసం 3 రోజుల పాటు మీరు ఇలా నిద్ర పట్టని సమస్యతో బాధపడుతున్నారా? మెలకువ వచ్చిన తర్వాత అరగంటకు గానీ నిద్ర పట్టట్లేదా? నెల రోజులకు పైగానే ఈ సమస్యతో బాధపడుతున్నారా? అయితే వెంటనే మీరు వైద్యుని సంప్రదించాల్సిందే. ఒకవేళ నిద్ర పట్టేందుకు ఏవైనా ప్రత్యేక చికిత్సలు అవసరమైతే సూచిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్