జీవితంలో మళ్లీ ఆశలు చిగురించాలంటే..!

జీవితంలో మార్పులు సహజం. అలాగని అన్ని దశల్లో అవి సానుకూలంగా ఉండకపోవచ్చు. ఓ దశలో ఏ పని చేసినా ఓటమే ఎదురవ్వచ్చు.. కొన్నాళ్ల పాటు అనిశ్చితే కొనసాగచ్చు.. ఇలాంటి సందర్భాల్లో నైరాశ్య భావన ఆవహించడం సహజం.

Published : 18 Nov 2023 20:26 IST

జీవితంలో మార్పులు సహజం. అలాగని అన్ని దశల్లో అవి సానుకూలంగా ఉండకపోవచ్చు. ఓ దశలో ఏ పని చేసినా ఓటమే ఎదురవ్వచ్చు.. కొన్నాళ్ల పాటు అనిశ్చితే కొనసాగచ్చు.. ఇలాంటి సందర్భాల్లో నైరాశ్య భావన ఆవహించడం సహజం. అయితే ఈ సమయంలోనూ సానుకూలంగా ఆలోచించి.. జీవితాన్ని పాజిటివ్‌గా మలచుకోవాలన్న ఆలోచన చేసిన వారే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సక్సెసవుతారంటున్నారు మానసిక నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

ఆ ‘థెరపీ’తో మేలు!

ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. కానీ దాన్ని సాధించే క్రమంలో అవాంతరాలు, సవాళ్లు ఎదురవుతుంటాయి. ఇవే మనల్ని లక్ష్యానికి దూరం చేస్తాయి. తద్వారా చేయాలనుకున్న పనిపై ఆసక్తి కూడా తగ్గిపోతుంటుంది. దీన్నుంచి బయటపడి తిరిగి జీవితాన్ని గాడిలో పెట్టుకోవాలంటే.. ‘సైకో డైనమిక్‌ థెరపీ’ చక్కటి మార్గం అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కళ్లు మూసుకొని మన మనసులో దాగున్న ఆలోచనల్ని, మనం చేరాలనుకుంటోన్న లక్ష్యాల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. వాటికి అడ్డుపడుతోన్న సవాళ్లను పసిగట్టి.. అధిగమించే మార్గాల్ని అన్వేషించాలి. ఈ క్రమంలో సాధ్యాసాధ్యాల్ని పరిశీలించుకొని సానుకూల దృక్పథంతో ముందుకెళ్తే.. కాస్త ఆలస్యంగానైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చంటున్నారు నిపుణులు.

తప్పు రిపీట్‌ చేయద్దు!

కొన్నిసార్లు మనకు తెలిసో, తెలియకో చేసిన పొరపాట్ల వల్ల కూడా జీవితం గాడి తప్పుతుంటుంది. ఈ క్రమంలో మనం తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు మనల్ని కోలుకోనివ్వకుండా దెబ్బతీస్తాయి. ఇలాంటప్పుడు ఆయా పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకున్నప్పుడే జీవితాన్ని పునర్నిర్మించుకోవచ్చంటున్నారు నిపుణులు. అలా కాకుండా కొంతమంది మూర్ఖత్వంతో.. చేసిన పొరపాట్లే మళ్లీ మళ్లీ చేస్తుంటారు.

ఉదాహరణకు.. కొంతమంది ప్రణాళిక లేకుండా పనులు మొదలుపెడుతుంటారు. ఒక్కసారి ప్రారంభిస్తే ఎలాగోలా పూర్తిచేయచ్చన్న అతి విశ్వాసం ప్రదర్శిస్తుంటారు. కానీ మధ్యలో ఆగిపోయాక గానీ అర్థం కాదు.. ఇది మన వల్ల కాని పని అని! కాబట్టి ఇకనైనా ఇలాంటి పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకొని, సాధ్యాసాధ్యాల్ని పరిశీలించుకుంటే.. మధ్యలో ఆగిపోవడం, ఓడిపోవడం.. వంటివేవీ ఎదురవ్వవు. ఇలా ప్రతి పనిలోనూ విజయం సాధిస్తుంటే ఏదో తెలియని ఉత్సాహం మనల్ని ముందుకు నడిపిస్తుంది.

వాళ్లను నమ్మకండి!

మన జీవితంలో ఎదురయ్యే ప్రతికూలతలకు ప్రత్యక్షంగా మనం కారణమైతే.. కొన్నిసార్లు పరోక్షంగా మన చుట్టూ ఉండే వారు కూడా కారణమవుతుంటారు. అందుకే మనమంటే గిట్టని వారితో, మనకు చెడు జరగాలని కోరుకొనే వారికి దూరంగా ఉండడం మంచిది. అదే సమయంలో సానుకూల దృక్పథం నింపే వ్యక్తులతో చెలిమి పెంచుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. దీనివల్ల వారి నుంచి మీకు పాజిటివ్‌ సలహాలు అందడంతో పాటు, మీ సమస్యలకు పరిష్కారాలూ దొరుకుతాయి. కాబట్టి జీవితాన్ని హ్యాపీగా, సంతృప్తిగా ఎంజాయ్‌ చేయచ్చు.

ధైర్యం చేయాల్సిందే!

వ్యక్తిగతంగానైనా, వృత్తిపరంగానైనా ఉన్నతి సాధించాలంటే.. సవాళ్లను ఎదిరించే ధైర్యం కూడా ఉండాలి. కానీ అనిశ్చితి, ఓటమి ఎదురైనప్పుడు కొంతమంది ధైర్యాన్ని కోల్పోతుంటారు. నిజానికి ఇలాంటి ప్రతికూల ఆలోచనలతో నిండిపోయిన మనసు మన శక్తిసామర్థ్యాలపై మనకే సందేహం కలిగేలా చేస్తుంది. కాబట్టి ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేయడం వల్ల మన బలాబలాలేంటో మనకు అవగతమవుతాయి. ఇవే మనల్ని సానుకూల దృక్పథంవైపు నడిపిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్