ఇలా చేస్తే పిల్లలకు అన్ని పోషకాలూ అందుతాయి!

పిల్లలకు చిరుతిండ్లు, జంక్‌ఫుడ్‌ రుచించినంతగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు రుచించవు. అందుకే అసలు ఆహారాన్ని పక్కన పెట్టి అనవసరమైన పదార్థాలతోనే కడుపు నింపుకొంటారు. ఇదిగో ఇలాంటి అనారోగ్యపూరిత ఆహారపుటలవాట్లే వారిలో పోషకాహార లోపానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు.

Updated : 09 Sep 2022 14:16 IST

పిల్లలకు చిరుతిండ్లు, జంక్‌ఫుడ్‌ రుచించినంతగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు రుచించవు. అందుకే అసలు ఆహారాన్ని పక్కన పెట్టి అనవసరమైన పదార్థాలతోనే కడుపు నింపుకొంటారు. ఇదిగో ఇలాంటి అనారోగ్యపూరిత ఆహారపుటలవాట్లే వారిలో పోషకాహార లోపానికి కారణమవుతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా వారి రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడి.. త్వరగా ఇన్ఫెక్షన్లకు గురవుతుంటారు. అందుకే ఇదే విషయంపై అవగాహన కల్పించేందుకు సన్నద్ధమైంది ‘జాతీయ పోషకాహార వారం’. ఈ నేపథ్యంలో ‘Feeding smart right from start’ అనే థీమ్‌ను మన ముందుకు తీసుకొచ్చింది. పిల్లల్లో పోషకాహార లోపం తలెత్తకూడదంటే చిన్నతనం నుంచే వారికి ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు అలవర్చడం అత్యంత ఆవశ్యకం అని చెప్పడం దీని ముఖ్యోద్దేశం!

చిన్నారులు తీసుకునే ఆహారంలో ఐరన్‌, అయొడిన్‌, ఫోలేట్‌, విటమిన్‌ ‘ఎ’, జింక్‌.. వంటి సూక్ష్మ పోషకాలు లోపించడం వల్ల వారిలో ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, తక్కువ తెలివితేటలు కలిగి ఉండడంతో పాటు వివిధ రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలూ ఎక్కువేనంటున్నారు నిపుణులు. అందుకే ఈ సమస్యను ఎదుర్కోవాలంటే వారి ఆహారపుటలవాట్లలో మార్పులు చేర్పులు చేయడం అత్యవసరం అంటున్నారు.

ప్రొటీన్‌తో ప్రారంభం!

పిల్లలకైనా, పెద్దలకైనా.. రోజులో తీసుకునే తొలి ఆహారమే ముఖ్యం. ఎందుకంటే ఇదే మనల్ని రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి పిల్లలకు ఉదయాన్నే అందించే అల్పాహారంలో భాగంగా ప్రొటీన్‌ అధికంగా ఉండే పదార్థాలకే ప్రాధాన్యమివ్వమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఎగ్‌ శాండ్‌విచ్‌, హోల్‌గ్రెయిన్‌ బ్రెడ్‌పై పీనట్‌ బటర్‌ అప్లై చేసివ్వడం, యాపిల్‌, ఇతర సీజనల్‌ పండ్లు.. వంటివి అందించాలి. తద్వారా ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉండి ఇతర చిరుతిండ్ల పైకి మనసు మళ్లకుండా చేయచ్చు. ఇక స్థూలకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడుతోన్న చిన్నారులకు బరువు తగ్గడంలో ఈ తరహా అల్పాహారం సహకరిస్తుంది.

వాటికి ప్రత్యామ్నాయంగా ఇవి!

పిల్లలు కొన్ని పదార్థాలు ఇష్టంగా తింటుంటారు. ఉదాహరణకు.. వైట్‌ బ్రెడ్‌, ఐస్‌క్రీమ్‌, బంగాళాదుంప చిప్స్‌, శీతల పానీయాలు.. వంటివి. కానీ ఇవి వారి ఆరోగ్యానికి అంత మంచివి కావు. అలాగని తినొద్దని చెబితే ఊరుకోరు. చాటుగానైనా కొనుక్కొని తినేస్తుంటారు. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా అలాంటి రుచిని అందించే పదార్థాలను వారి మెనూలో భాగం చేయడం వల్ల ఇటు వారు రుచినీ ఆస్వాదిస్తారు.. అటు పోషకాలు కూడా వారి శరీరానికి అందుతాయి. ఇంతకీ అవేంటంటే..!

* వైట్‌ బ్రెడ్‌కు బదులుగా హోల్‌వీట్‌/హోల్‌గ్రెయిన్‌ బ్రెడ్‌ అందించచ్చు.

* ఐస్‌క్రీమ్‌ తింటామని మారాం చేస్తే పండ్లతో అచ్చం ఐస్‌క్రీమ్‌ అంత మృదువుగా ఉండేలా స్మూతీ చేసిస్తే సరి!

* బంగాళా దుంప చిప్స్‌ కావాలని అడుగుతున్నారా? అయితే వాటిని నూనెలో వేయించడం కాకుండా బేక్‌ చేసి ఇవ్వచ్చు.. లేదంటే నట్స్‌ని నూనె లేకుండా వేయించి అందించచ్చు.

* శీతల పానీయాలు కోరుకుంటే.. వాటికి బదులుగా ఫ్లేవర్డ్‌ వాటర్‌ ఇవ్వచ్చు..

ఇలా ఆలోచిస్తే అనారోగ్యకరమైన ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయాలెన్నో దొరుకుతాయి.

కొవ్వులూ అవసరమే!

కొవ్వులు అనగానే మన మదిలో ఏదో ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి.. ఇవి శరీరానికి మంచివి కావని.. వీటిని తీసుకుంటే లావైపోతామని! కానీ మన శరీరానికి కొవ్వుల అవసరం కూడా ఉందంటున్నారు నిపుణులు. అది కూడా మంచి కొవ్వులే తీసుకోవాల్సి ఉంటుంది. అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులుగా పిలిచే ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో, మనసును ప్రశాంతపరచడంలో సహకరిస్తాయట. కాబట్టి ఆలివ్‌ ఆయిల్‌, అవకాడో, నట్స్‌, గింజలు.. వంటి మోనో అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు; అవిసె గింజలు, వాల్‌నట్స్‌, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. వంటి పాలీ అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వుల్ని పిల్లల రోజువారీ ఆహారంలో భాగం చేయడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఇక ఫ్రైడ్‌ ఫుడ్స్‌, ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలు, ప్యాక్‌ చేసిన వాటిలో అనారోగ్యకరమైన ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉంటాయి. కాబట్టి పిల్లల్ని వీటికి దూరంగా ఉంచాలి.

లేబుల్‌ చదివించండి!

మనం చెప్పిన మాటల కంటే కంటితో చూసిన వాటినే పిల్లలు ఎక్కువగా నమ్ముతుంటారు. కాబట్టి పోషకాహారం, దాని ప్రాధాన్యం గురించి తల్లిదండ్రులు వారికి వివరించడంతో పాటు నిత్యావసరాల షాపింగ్‌, కాయగూరల్ని కొనుగోలు చేయడం.. వంటి పనుల్లో వారినీ భాగం చేయమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వారికి నచ్చిన పండ్లు, కాయగూరల్నే ఎంచుకోమని చెప్పండి. అలాగే వాటిలో ఉండే పోషకాల గురించి అంతర్జాలాన్ని ఉపయోగించి తెలుసుకునే ప్రయత్నం చేయమనండి.

ఇక నిత్యావసర సరుకుల విషయానికొస్తే.. వారు ఎంచుకునే పదార్థాల్లో ఏ మేర పోషకాలున్నాయి? ఎలాంటి అనారోగ్యకరమైన పదార్థాలున్నాయి? అనే విషయాలు లేబుల్‌ చూసి చదవమనండి. దాంతో పోషకాహారం, అది తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. పోషకాలు లేని పదార్థాలు తీసుకుంటే ఏమవుతుంది? వంటి విషయాలన్నీ వాళ్లకు వాళ్లే నేరుగా తెలుసుకోగలుగుతారు. తద్వారా పోషకాహారంపై వారికి ఒక అవగాహన ఏర్పడుతుంది.

ఇవి గుర్తుంచుకోండి!

పిల్లలకు ఆహారపుటలవాట్లు నేర్పించడమే కాదు.. వాటిని తల్లిదండ్రులే ఆచరించి చూపించాలంటున్నారు నిపుణులు. అప్పుడే వారిలో మార్పొస్తుందంటున్నారు. ఈ క్రమంలో పేరెంట్స్‌ కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు.

* ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు తల్లిదండ్రుల దగ్గర్నుంచే మొదలవ్వాలి.. అప్పుడే మిమ్మల్ని చూసి వారు నేర్చుకునే అవకాశం ఉంటుంది.

* పెద్దయ్యే క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటే చిన్నతనం నుంచే వారికి సంపూర్ణ పోషకాహారం, ఎలాంటి ఆహార నిబంధనలు పెట్టకుండా అన్ని రకాల పదార్థాల్ని వారికి అందించాలి. అప్పుడే చక్కటి ఫలితం ఉంటుంది.

* పిల్లలు తీసుకునే ఆహారంపై నిఘా ఉంచడం తప్పనిసరి! లేదంటే వారు ఏది పడితే అది, ఎంత పడితే అంత తినడానికి అలవాటు పడతారు. అది అస్సలు మంచిది కాదు. ఏదైనా మోతాదులో ఉంటేనే మంచిది.

* కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు మరింత ఆరోగ్యంగా ఉండాలి, బొద్దుగా ఉండాలన్న ఆలోచనతో అమితంగా తినమని బలవంత పెడుతుంటారు. వారి చిన్ని పొట్టకు అది అస్సలు మంచిది కాదు. కడుపు నిండుగా తిని ఆయాసపడడం బదులు ఓ ముద్ద తక్కువగా తిని యాక్టివ్‌గా ఉండడమే ఉత్తమం.

* ఈ పండు పూర్తిగా తింటే బహుమతిస్తా, కానుకలిస్తా.. అంటూ పిల్లల్ని మభ్యపెట్టడం అస్సలు మంచిది కాదు.. ఎందుకంటే దీనివల్ల వారు ఇష్టం లేకున్నా ఆ పదార్థం బలవంతంగా తిని లేనిపోని జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడతారు. కాబట్టి ఇలాంటి రివార్డులు వద్దే వద్దు!

* టీవీ చూస్తూ, కంప్యూటర్‌లో గేమ్స్‌ ఆడుతూ తినడం అస్సలు ఆరోగ్యకరం కాదు. పైగా ఇలా తినడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకొని లావయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ తిన్న కొంచెమైనా ఆస్వాదిస్తూ తినమని వారికి చెప్పడం, మీరు పాటిస్తూ వారికి అలవాటు చేయడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్