గుండె సమస్యలున్నా.. ‘ముద్దుల కన్నయ్య’ కోసం 88 వంటకాలు!

పండగల్లో, పర్వదినాల్లో భక్తి ప్రపత్తులతో, నైవేద్యాలతో ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలని ఆరాటపడతాం. ఇక కృష్ణాష్టమి రోజున ముద్దుల కన్నయ్యకు ప్రీతిపాత్రమైన వివిధ వంటకాలను నైవేద్యంగా పెట్టడం పరిపాటే! 3, 5, 9, 11.. ఇలా ఇంట్లో ఎవరికి వీలైనన్ని నైవేద్యాలు వారు తయారుచేసి సమర్పించినా.. కొన్ని ఆలయాల్లో మాత్రం తప్పనిసరిగా 56 వంటకాలతో ఆ దేవదేవుడిని కొలుస్తుంటారు.

Published : 09 Sep 2023 12:17 IST

(Photos: Twitter)

పండగల్లో, పర్వదినాల్లో భక్తి ప్రపత్తులతో, నైవేద్యాలతో ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలని ఆరాటపడతాం. ఇక కృష్ణాష్టమి రోజున ముద్దుల కన్నయ్యకు ప్రీతిపాత్రమైన వివిధ వంటకాలను నైవేద్యంగా పెట్టడం పరిపాటే! 3, 5, 9, 11.. ఇలా ఇంట్లో ఎవరికి వీలైనన్ని నైవేద్యాలు వారు తయారుచేసి సమర్పించినా.. కొన్ని ఆలయాల్లో మాత్రం తప్పనిసరిగా 56 వంటకాలతో ఆ దేవదేవుడిని కొలుస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో దీనినే ‘చప్పన్‌ భోగ్‌’గా పిలుస్తారు. ఇలా 56 కాదు.. ఏకంగా 88 వంటకాలతో కృష్ణయ్యను ప్రసన్నం చేసుకున్నారు మంగళూరుకు చెందిన ఓ మహిళ. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నా.. ఎవరి సహాయం తీసుకోకుండా.. రాత్రంతా కష్టపడి మరీ తయారుచేసిన వంటకాల్ని కన్నయ్యకు సమర్పించి తన దైవభక్తిని చాటుకున్నారామె. ఆమెకు చికిత్స చేసే డాక్టర్‌ ఆమె ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేయగా.. ప్రస్తుతం ఆమె స్టోరీ నెట్టింట్లో వైరల్‌గా మారింది.

కృష్ణాష్టమి రోజున ముద్దుల కన్నయ్యను అందంగా ముస్తాబు చేసి మురిసిపోతుంటాం. ఇంట్లో పిల్లలుంటే వాళ్ల నూ కృష్ణుడిగా, గోపికలా తయారుచేసి ముచ్చట తీర్చుకుంటాం. మంగళూరుకు చెందిన ఓ కృష్ణ భక్తురాలు కూడా ఈ జన్మాష్టమి సందర్భంగా ఇదేవిధంగా తన ముచ్చట తీర్చుకున్నారు. తన ఇంటి పూజ గదిలోని కన్నయ్యను పట్టుబట్టలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అక్కడితో ఆగిపోకుండా.. పదుల సంఖ్యలో నైవేద్యాల్ని తయారుచేసి వెన్నదొంగకు సమర్పించారు.

ఏమేం తయారుచేశారు?

సాధారణంగా కృష్ణుడికి పాలు, వెన్న, ఇతర పాల పదార్థాలంటే ఇష్టమన్న సంగతి తెలిసిందే. అందుకే తన నైవేద్యాల్లోనూ ఎక్కువగా పాలతో తయారుచేసిన స్వీట్లు, ఇతర వంటకాలకే ప్రాధాన్యమిచ్చారీ మహిళ. బర్ఫీ, పేడా, పాయసం, నువ్వుల లడ్డూ, అటుకుల లడ్డూ, జిలేబీ, సున్నుండలు, అటుకులు, మురుకులు, కజ్జికాయలు, కారప్పూస.. ఇలా స్వీటు, హాటు కలిపి మొత్తం 88 రకాల వంటకాలు తయారుచేశారావిడ. అయితే ప్రస్తుతం తాను గుండె సమస్యలతో బాధపడుతున్నా.. రాత్రింబవళ్లు కష్టపడి మరీ ఇన్ని వెరైటీలు తయారుచేయడం విశేషం! అందుకే తనకు చికిత్స చేస్తోన్న వైద్యులు డాక్టర్‌ పి కామత్‌.. ఈ మహిళ చేసిన ప్రయత్నం గురించి ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేస్తూ ప్రశంసించారు.

‘ఈ ఫొటోలో ఉన్న మహిళ నా పేషెంట్‌. కృష్ణుడి పట్ల ఆమెకున్న భక్తి చూస్తుంటే గర్వంగా ఉంది. ఇప్పుడే కాదు.. గతంలోనూ పదుల సంఖ్యలో వంటకాలు తయారుచేసి రికార్డు నెలకొల్పారావిడ. ఈసారి కృష్ణాష్టమి కోసం రాత్రంతా కష్టపడి 88 వంటకాలు తయారుచేసి తన రికార్డును తానే బద్దలుకొట్టారు..’ అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు.. ఆ మహిళ తయారుచేసిన నైవేద్యాలన్నీ కన్నయ్యకు సమర్పించి భక్తితో కొలుస్తున్న ఫొటోల్నీ పోస్ట్‌ చేశారాయన. దీంతో ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఆరోగ్య సమస్యను అధిగమించి దైవభక్తిని చాటుకున్న ఈ మహిళపై ప్రశంసల వర్షం కురుస్తోంది.. ‘దైవభక్తికి ఏదీ సాటి రాదు.. ఆమెకు పాదాభివందనం..’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

అందుకే ‘చప్పన్‌ భోగ్’!

కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి దేవాలయాల్లో ‘చప్పన్‌ భోగ్‌’ పేరుతో 56 రకాల నైవేద్యాల్ని కన్నయ్యకు సమర్పించడం ఆనవాయితీ! అయితే దీని వెనుక ఓ పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది! అదేంటంటే.. ఇంద్రపూజను నిర్లక్ష్యం చేయడంతో ఆగ్రహించిన ఇంద్రుడు గోకులాన్ని వర్షం, వరదలతో ముంచెత్తుతాడు. ఇదే సమయంలో తన చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి.. దాని కింద ప్రజలందరికీ రక్షణ కల్పిస్తాడు కృష్ణుడు. ఇలా ఏడు రోజుల పాటు ఏకధాటిగా పర్వతాన్ని ఎత్తి, తన ప్రజలకు రక్షణ కల్పించి ఇంద్రుడి గర్వాన్ని అణుస్తాడు. ఇలా ఈ ఏడు రోజుల పాటు కృష్ణుడు అన్నపానీయాలేవీ ముట్టుకోకుండా తమను కాపాడడంతో.. ఎనిమిదో రోజు వాళ్లంతా కన్నయ్యను దేవుడిగా భావించి.. 56 రకాల వంటకాలతో ఆయన కడుపు నింపారట! అలా కృష్ణాష్టమి సందర్భంగా ‘చప్పన్‌ భోగ్‌’ పద్ధతి పాటించడం అప్పట్నుంచీ ఆనవాయితీగా వస్తోందట! అయితే దీని కంటే ఎక్కువగా.. 88 వంటకాలతో ‘అటాసీ భోగ్‌’ సమర్పించి మరీ గోపీలోలుడిని ప్రసన్నం చేసుకున్నారీ మంగళూరు మహిళ!


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్