Presenteeism : మనిషిక్కడ.. మనసెక్కడో!

ఆఫీస్‌లో మన మూడ్ రోజూ ఒకేలా ఉండదు. ఓరోజు ఉత్సాహంగా పనిచేస్తే.. మరో రోజు మానసికంగా డిస్టర్బ్‌ అవుతుంటాం.. ఇంకోరోజు ఏదో ఒక ఆరోగ్య సమస్య వేధించచ్చు.

Published : 28 Sep 2023 20:30 IST

ఆఫీస్‌లో మన మూడ్ రోజూ ఒకేలా ఉండదు. ఓరోజు ఉత్సాహంగా పనిచేస్తే.. మరో రోజు మానసికంగా డిస్టర్బ్‌ అవుతుంటాం.. ఇంకోరోజు ఏదో ఒక ఆరోగ్య సమస్య వేధించచ్చు. అయితే యాక్టివ్‌గా ఉన్న రోజు ఏకాగ్రతతో పని పూర్తిచేసినా.. మానసిక, ఆరోగ్య సమస్యలున్నప్పుడు పనిపై పూర్తి దృష్టి పెట్టలేం. ఈ విషయం తెలిసినా.. ఓరోజు సెలవు పెట్టుకొని విశ్రాంతి తీసుకోకుండా.. ఎలాగోలా ఆఫీస్‌కి రావడానికే ప్రయత్నిస్తుంటారు కొందరు. ఇలా వచ్చినా సరిగ్గా పని చేయలేరు. మనిషిక్కడున్నా.. మనసెక్కడో ఉండే ఈ పరిస్థితినే ‘ప్రజెంటీయిజం’ అంటారు. ఇది వ్యక్తిగతంగానే కాదు.. కెరీర్‌పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. అందుకే ఆదిలోనే దీని లక్షణాలేంటో పసిగట్టి, ఈ పరిస్థితిని దూరం చేసుకోమంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం రండి..

ఈ లక్షణాలు కనిపిస్తే..!

అనవసరంగా సెలవు పెట్టడం ఎందుకనో, బాస్‌ సెలవు ఇవ్వకపోవడం వల్లో, ఆఫీస్‌లో మ్యాన్‌పవర్‌ తక్కువగా ఉందనో, ఇతర వ్యక్తిగత కారణాల వల్లో.. కొంతమంది మనసు బాగోకపోయినా, ఏవైనా ఆరోగ్య సమస్యలున్నా ఆఫీస్‌కు వెళ్తుంటారు. ‘ప్రజెంటీయిజం’గా పిలిచే ఇలాంటి స్థితిలో పని చేయడం వల్ల సరైన ఉత్పాదకతను అందించలేం. తద్వారా మన కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే ఈ స్థితిని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించచ్చంటున్నారు నిపుణులు.

ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆఫీస్‌కు హాజరైతే.. రోజూలా ఉత్సాహంగా పనిచేయలేం. చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టకపోవడం వల్ల పొరపాట్లు దొర్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఈ ఏకాగ్రత లోపంతోనే పనిలో నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ తేడా మనకు తెలిసిపోతుంది.

ఆసక్తి లేనప్పుడు ఆఫీస్‌కు రావాలంటే ఏదోలా అనిపిస్తుంది.. ఎవరో బలవంతంగా లాక్కొచ్చినట్లు ఫీలవుతుంటాం. దీంతో ఆఫీస్‌కి రావడానికి ఆలస్యమవుతుంటుంది.. త్వరగా ఇంటికి వెళ్లాలనిపిస్తుంది.. ఇక మధ్యాహ్నం భోంచేయడానికీ నిరాసక్తత చూపుతుంటాం.. కొన్ని సందర్భాల్లో పని పూర్తి కాక అదనపు గంటలు ఆఫీస్‌నే ఉండాల్సి రావచ్చు.

మనసు, ఆరోగ్యం బాగోలేక పోయినప్పుడు ఆఫీస్‌కొస్తే ఒక రకమైన ఒత్తిడితో మనసంతా సతమతమవుతుంటుంది. ఇలాంటి సమయంలో అదనపు పని భారం పడినా, ఎవరైనా మనల్ని కదిపినా వారిపై చికాకు పడుతుంటాం. దీనివల్ల కూడా ఇటు వ్యక్తిగతంగా, అటు కెరీర్‌పైనా ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు.

పనివేళలే కారణమా?

ప్రజెంటీయిజంకు పని వేళలు కూడా ఓ కారణమని ఇటీవలే ఓ నివేదిక వెల్లడించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 73 శాతం మంది మిలీనియల్స్‌ (జెనరేషన్‌ Y – 1980-90 మధ్య పుట్టిన వారు) వారానికి 40 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేస్తున్నారని ఇందులో తేలింది. ఇక భారత్‌లోని మిలీనియల్స్‌ వారానికి సగటున 52 గంటలు పనిచేస్తున్నారట. ఇలా అధిక పని వేళల వల్ల కూడా వారు శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నట్లు.. ఆఫీస్‌కు రావడానికి నిరాసక్తత చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇలా మ్యాన్‌పవర్‌ తగ్గిపోవడం వల్ల ఈ అదనపు పనిభారం ఇతరులపై పడుతుందని, ఇదే ప్రజెంటీయిజంకు దారితీస్తుందంటున్నారు. ఇదనే కాదు.. కొన్ని సంస్థల్లో ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు ఉండకపోవడం వల్ల మహిళలు వీలు కుదరనప్పుడు కూడా తప్పనిసరిగా ఆఫీస్‌కు రావాల్సి వస్తోంది. ఒక రకంగా ఇది కూడా ప్రజెంటీయిజం అనే అంటున్నారు.

కాస్త వెసులుబాటు!

అయితే ఇలా ప్రజెంటీయిజంలో బలవంతంగా పనిచేస్తూ.. ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిపరంగా ఇబ్బంది పడే బదులు.. ఈ సమయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ పరిస్థితి నుంచి బయటపడచ్చంటున్నారు నిపుణులు.

మానసికంగా, శారీరకంగా పని చేయడానికి సన్నద్ధంగా లేనప్పుడు బలవంతంగా ఆఫీస్‌కు రావడం కంటే సెలవు పెట్టుకోవడానికే మొగ్గుచూపాలి. పైఅధికారులకు, మానవ వనరుల విభాగం వారికి మీ సమస్యను వివరించి సెలవు అడిగితే వాళ్లు తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.

ఆఫీస్‌ యాజమాన్యం కూడా ఉద్యోగి సమస్యల్ని అర్థం చేసుకొని.. వారికి పని, సెలవుల విషయాల్లో పలు వెసులుబాట్లు కల్పించడం; ఆ రోజు వాళ్లు పూర్తి చేయాల్సిన పనుల్ని వేరే ఉద్యోగికి అప్పగించడం వల్ల.. వాళ్లు ఒత్తిడిగా ఫీలయ్యే అవకాశం ఉండదు. తద్వారా సెలవు తీసుకున్నా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోగలుగుతారు.

ఆఫీస్‌ యాజమాన్యం కూడా ఉద్యోగులు తమ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేలా ప్రత్యేకమైన తరగతులు నిర్వహించడం, నిపుణులతో సంబంధిత చిట్కాలు, అవసరమైన వారికి కౌన్సెలింగ్‌ ఇప్పించడం.. వంటివి చేస్తే ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఇది వారి పనితనంపైనా సానుకూల ప్రభావం చూపుతుంది.

కొంతమంది ఆఫీస్‌ పనిని ఇంటి దాకా తీసుకొస్తుంటారు. శారీరక, మానసిక అనారోగ్యానికి, ఇంట్లో సమస్యలకు ఇది ఓ కారణమే అంటున్నారు నిపుణులు. ఇలా జరగకుండా ఉండాలంటే.. ఆఫీస్‌లో వేళకు పని పూర్తిచేసుకొని.. ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.. తద్వారా ఆరోగ్య సమస్యలూ దరిచేరవు.

ఎప్పుడూ పని పని అని కాకుండా.. కొన్నిసార్లు పనిని దూరం పెట్టి.. నచ్చిన అంశాలపై దృష్టి పెట్టడం, కుటుంబంతో కలిసి వెకేషన్లకు వెళ్లడం వల్ల కూడా మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవచ్చు. ఇది కూడా ప్రజెంటీయిజంను దూరం చేసుకోవడానికి ఓ మార్గం అంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్