Published : 06/02/2022 11:52 IST

పిల్లలకు పీడకలలా??

భువన వాళ్ల పాప భావన ఓ రోజు రాత్రి ఉలిక్కిపడుతూ అకస్మాత్తుగా నిద్రలో నుంచి లేచింది. దీంతో పక్కనే ఉన్న వాళ్లమ్మ భువన 'ఏంట్రా.. అంత సడెన్‌గా లేచావేంటి? ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి.. ఎందుకలా వణుకుతున్నావ్?' అని అడిగింది. వెంటనే భావన తల్లి కళ్లలోకి చూస్తూ.. 'అమ్మా.. నాకేదో పీడకల వచ్చింది.. ఆ కలలో ఎవరో నన్ను వేగంగా తరుముకొచ్చి గట్టిగా పట్టుకున్నారు.. అంతే.. మెలకువ వచ్చింది.. నాకు చాలా భయమేస్తోందమ్మా..' అంటూ తల్లిని గట్టిగా పట్టుకుంది.

పీడకలలొచ్చినప్పుడు కొన్నిసార్లు పెద్దవాళ్లే భయపడిపోతుంటారు. ఇక చిన్నపిల్లల సంగతి చెప్పాలా? పడుకునేటప్పుడు ఏదైనా భయంకరమైన సంఘటనల గురించి ఆలోచిస్తూ పడుకోవడం వల్ల ఇలాంటి కలలు వచ్చి నిద్రలో భయభ్రాంతులకు గురిచేస్తాయి. అయితే ఇలాంటి సమయంలో పెద్దవాళ్త్లెతే ఎలాగోలా తిరిగి నిద్రలోకి జారుకుంటారు. పిల్లలు మాత్రం పదే పదే వాటిని తలచుకుంటూ వాళ్లు నిద్రపోకపోవడంతో పాటు పక్కనుండే వాళ్లకు కూడా నిద్ర లేకుండా చేస్తారు. వారిలో ఆ భయాన్ని పోగొట్టి తిరిగి నిద్రపుచ్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. మరి అందుకు కొన్ని మార్గాలున్నాయి. అవేంటో మీరూ తెలుసుకోండి..

గదిని పరిశీలించాలి..

పిల్లలు ఎంతో ఇష్టంగా ఆడుకునే బొమ్మలు కూడా ఒక్కోసారి చీకట్లో వారికి భయాన్ని కలిగిస్తుంటాయి. ఉదాహరణకు.. సినిమాల్లో కొన్ని బొమ్మలకు ప్రాణం వచ్చి, అవి అందరినీ ఇబ్బంది పెట్టడం చూస్తుంటాం. పిల్లలు ఇలాంటి సినిమాలు చూడడం, వారి గదిలో ఉండే బొమ్మలను ఆ స్థానంలో వూహించుకోవడం.. అలాగే నిద్రపోవడం వల్ల కూడా దానికి సంబంధించిన పీడకలలు వారిని వెంటాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి బొమ్మలు, పోస్టర్లు.. వంటివి పిల్లల గదిలో ఉండకుండా చూసుకోవాలి. పగలంతా వారి గదిలో ఆడుకున్నా.. పడుకునే ముందు మాత్రం ఆ బొమ్మలను బయట హాల్లోనో లేదంటే ఇతర గదుల్లోనో పెట్టుకోమనడం, లేదా వారి కంటికి కనిపించకుండా కప్‌బోర్డ్స్‌లో దాచేయడం మంచిది. అలాగే పిల్లల గదిలో వారికి భయం కలిగించే ఏ వస్తువు కూడా ఉండకుండా ఆ గదిని తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. వీలైనంత వరకూ పిల్లలు హారర్ సినిమాలు, సీరియళ్లు చూడకుండా జాగ్రత్తపడండి.

అప్పుడే అడగొద్దు..

పిల్లలకు పీడకలలు వచ్చినప్పుడు వారు నిద్రలోంచి అకస్మాత్తుగా లేచి భయపడిపోతుంటారు. అలాంటి సమయంలో కొంతమంది తల్లులు వారికి వచ్చిన కల గురించి తెలుసుకుంటుంటారు. దీనివల్ల వారు అది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ మరింత భయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వారికి ఏదో ఒక విధంగా నచ్చచెప్పి వారిని నిద్రపుచ్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ అంతగా అడిగి తెలుసుకోవాలనిపిస్తే, మరుసటి రోజు ఉదయమో లేదంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడో అడగడం మంచిది. ఇలాంటి పీడకలల గురించి చెప్పినప్పుడు ముందు వారు చెప్పేది పూర్తిగా వినాలి. ఆ తర్వాత వారిలోని భయం పోయేలా 'అసలు అలాంటివేవీ ఉండవు.. అవన్నీ నిజం కాదు.. నువ్వు ఆరోజు రాత్రి హారర్ సినిమా చూశావు కదా! అందులోని సన్నివేశాలు పడుకునేటప్పుడు గుర్తుచేసుకుని ఉంటావు.. అందుకనే నీకలా అనిపించింది.. కాబట్టి అలాంటి సినిమాలు చూసినా, వేరే ఇతర భయం గొలిపే సంఘటనలేవైనా నీ ముందు జరిగినా.. వాటిని ఎప్పటికప్పుడే మర్చిపోవాలి.. అసలవన్నీ ఏం ఉండవు.. అదంతా కేవలం సినిమా మాత్రమే.. అని నీ మనసుకు నువ్వే చెప్పుకోవాలి..' అంటూ పిల్లలకు వివరించాలి. దీంతో వారిలో భయాన్ని క్రమంగా దూరం చేయచ్చు.

దగ్గరికి తీసుకోవాలి..

పీడకలలతో భయపడిపోతున్న చిన్నారుల్ని వెంటనే గుండెలకు హత్తుకోవాలి. ఆ తర్వాత వారి వీపును నిమురుతూ.. 'ఏం పర్లేదు కన్నా.. నువ్వేం భయపడకు.. నేను నీ పక్కనే ఉన్నాను కదా! హాయిగా పడుకో..' అంటూ ధైర్యం చెబుతూ నిద్రపుచ్చాలి. దీంతో పిల్లలు ఆ భయాన్ని వీడి తిరిగి నిద్రలోకి జారుకునే అవకాశం ఉంటుంది.

వెలుతురు ఉండేలా..

కొంతమంది పిల్లలకు చీకటంటే భయం.. దీనికి తోడు వారికి పీడకలు వచ్చాయనుకోండి.. పిల్లలు మరింత భయపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఉండే గదిలో రాత్రిపూట ఓ బెడ్‌లైట్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. దీంతో ఆ గదంతా వెలుతురుగా ఉండి పిల్లలు భయపడకుండా నిద్రపోతారు.

జోల పాడండి..

కొంతమంది పిల్లలు ఎన్ని చెప్పినా నిద్రపోకుండా భయపడుతూ అలాగే ఏడుస్తుంటారు. అయితే ఇలాంటి సమయంలో తల్లులు కాస్త ఓపికతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల్ని సముదాయిస్తూ.. వారిని భుజాన వేసుకొనో లేదంటే ఒళ్లో పడుకోబెట్టుకొనో నెమ్మదిగా జోకొడుతూ నిద్రపుచ్చాలి. అవసరమైతే 'లాలీ లాలీ లాలీ లాలి..' అంటూ ఓ జోల పాట అందుకోండి. దీంతో పిల్లలు మీరు పాడే పాటను వింటూ వారి మనసులోని కల్పనలన్నీ క్రమంగా మర్చిపోయి నిద్రపోతారు.

భయాన్ని పోగొట్టాలి..

పిల్లల్లో పీడకలల భయం లేకుండా ఉండాలంటే రోజూ పడుకునే ముందు వారికి మంచి మంచి కథలు చెప్పడం, అందులోని నీతి బోధించడం, మంచి విషయాలు వివరించడం.. వంటివి చేయాలి. దీంతో వారికి పీడకలల భయం లేకుండా ఉండడంతోపాటు మంచి అలవాట్లు అలవడే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల వారిలో భయాన్ని క్రమంగా తొలగించవచ్చు.

సమస్య తగ్గకపోతే..

ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కొంతమంది పిల్లల్లో ఇలాంటి భయంకరమైన పీడకలలు వస్తూనే ఉంటాయి. ఇవి మాటిమాటికీ వస్తే వారి మానసిక ఆరోగ్యం క్రమంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ వాటి గురించే ఆలోచించడం, భయపడడం, చదువుపై శ్రద్ధ పెట్టలేకపోవడం, ముభావంగా ఉండడం.. వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడుతున్న పిల్లలను వెంటనే సైకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లడం మంచిది.

చూశారుగా.. పీడకలల వల్ల భయాందోళనలకు గురవుతున్న పిల్లల్లో ఆ భయాన్ని ఎలా తొలగించాలో! మరి మీ పిల్లల విషయంలో కూడా ఇవన్నీ పాటించి వారిలో బెరుకును పూర్తిగా పోగొట్టండి. తద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని