Adipurush: కృతి శాలువాపై రామాయణం.. శృతి కళాద్భుతం!

వంద మాటల్లో చెప్పలేని భావాల్ని ఒక చిత్రంతో చెప్పచ్చంటారు. అలాంటి చిత్రాలకు తన ఫ్యాషన్‌ నైపుణ్యాలను జోడించి సమకాలీన హంగులద్దుతున్నారు దిల్లీ ఫ్యాషనర్‌ శృతి గుప్తా. పష్మీనా, కశ్మీర్‌ ఉన్ని.. వంటి ఫ్యాబ్రిక్స్‌తో ప్రత్యేకమైన లగ్జరీ శాలువాలు....

Updated : 16 Jun 2023 12:57 IST

(Photos: Instagram)

వంద మాటల్లో చెప్పలేని భావాల్ని ఒక చిత్రంతో చెప్పచ్చంటారు. అలాంటి చిత్రాలకు తన ఫ్యాషన్‌ నైపుణ్యాలను జోడించి సమకాలీన హంగులద్దుతున్నారు దిల్లీ ఫ్యాషనర్‌ శృతి గుప్తా. పష్మీనా, కశ్మీర్‌ ఉన్ని.. వంటి ఫ్యాబ్రిక్స్‌తో ప్రత్యేకమైన లగ్జరీ శాలువాలు రూపొందించడం ఆమె ప్రత్యేకత! అలాంటి ఓ సంప్రదాయబద్ధమైన, అందమైన శాలువానే బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కృతీ సనన్‌ కోసం ఇటీవలే రూపొందించారామె. ‘ఆదిపురుష్‌’ ప్రమోషనల్‌ ఈవెంట్‌ కోసం కృతి ఎంచుకున్న ఈ ప్రత్యేకమైన శాలువా గురించే ఇప్పుడంతా చర్చ జరుగుతోంది. సినిమాకు తగ్గట్లే రామాయణ కథ నేపథ్యంలో కలర్‌ఫుల్‌గా డిజైన్‌ చేసిన ఈ మాస్టర్‌ పీస్‌ తయారీకి ఏకంగా ఆరు వేల గంటల సమయం పట్టిందట! మరి, ఇలాంటి ఎన్నో ప్రత్యేకమైన ఫ్యాషనబుల్‌ శాలువాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోన్న శృతి ఫ్యాషన్‌ జర్నీ ఇది!

సినిమా ప్రమోషన్లు, ప్రి-రిలీజ్‌ ఈవెంట్లు.. వంటి కార్యక్రమాల్లో భాగంగా ఆయా సినిమా కథలు/పాత్రల్ని ప్రతిబింబించేలా ఫ్యాషన్లను ఎంచుకోవడం మన తారలకు అలవాటే! బాలీవుడ్‌ బ్యూటీ కృతీ సనన్‌ కూడా ఇదే ట్రెండ్‌ ఫాలో అయింది. ‘ఆదిపురుష్‌’లో సీతగా నటించిన ఈ చక్కనమ్మ.. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం భారీగా ఎంబ్రాయిడరీ చేసిన అనార్కలీ సెట్‌లో ముస్తాబైంది. ముంబయి డిజైనర్‌ ద్వయం సుకృతి-ఆకృతి రూపొందించిన ఈ ట్రెడిషనల్‌ అవుట్‌ఫిట్‌కు అంతే సంప్రదాయబద్ధమైన శాలువాను జతచేసి మెరిసిపోయింది కృతి.

ఆ నాలుగు ఘట్టాల ఆధారంగా..!

ఈ శాలువాను దిల్లీకి చెందిన ఫ్యాషన్‌ డిజైనర్‌ శృతి గుప్తా రూపొందించారు. రామాయణ కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడంతో.. ఇదే నేపథ్యంలో ఈ శాలువాను డిజైన్‌ చేశారామె. ‘అయోధ్య కథల పష్మీనా శాలువా’గా దీనికి నామకరణం చేశారు. ఇందుకోసం పష్మీనా ఫ్యాబ్రిక్‌ను ఎంచుకున్న ఆమె.. రామాయణంలోని సీతా స్వయంవరం, పంచవటి, అశోక వాటిక, రామ దర్బార్‌.. వంటి నాలుగు ఘట్టాలను దీనిపై రూపొందించారు. బొమ్మల రూపంలో వీటిని ప్రతిబింబిస్తూ.. కలంకారీ, ఎంబ్రాయిడరీ హంగులద్దారు శృతి. రామాయణ పుస్తకాలను ఆధారంగా చేసుకొని తొలుత కచ్చితమైన చిత్రాల్ని గీసిన ఆమె.. అందులోని రాజ భవనాలు, వృక్షాలు, పక్షులు, జంతువులకు తన డిజైన్‌తో ప్రాణం పోశారు. నాటి రామాయణ కథకు అద్దం పడుతోన్న ఈ శాలువాను 10 మంది అనుభవజ్ఞులైన కళాకారులు సుమారు 6 వేల గంటలు కష్టపడి రూపొందించారట! ఈ కలర్‌ఫుల్‌ పీస్‌ కృతికి అందాన్ని తీసుకురావడమే కాదు.. ప్రస్తుతం ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గానూ మారింది.

నాన్న స్ఫూర్తితో మనసు మార్చుకొని..!

దిల్లీ డిజైనర్‌ శృతి ఎమ్మెస్సీ పూర్తిచేసింది. నిత్య విద్యార్థిగా ఉండడానికి ఇష్టపడే ఆమె.. ఏదైనా సరే మక్కువతో నేర్చుకుంటుంది. తనలాంటి వ్యక్తుల్ని కలవడానికి, వారితో మాట్లాడడానికి ఆసక్తి చూపుతుంటుంది. తద్వారా తన నైపుణ్యాల పరిధిని విస్తరించుకోవచ్చన్నది ఆమె నమ్మకం. నిజానికి శృతి జంతు ప్రేమికురాలు.. ఈ ఇష్టంతోనే వన్యప్రాణి సంరక్షణను తన కెరీర్‌ ఆప్షన్‌గా ఎంచుకోవాలనుకుంది. కానీ అదే సమయంలో దుస్తుల వ్యాపారం చేస్తోన్న తన తండ్రికి వ్యాపారంలో సహకరించేదామె. ఈ క్రమంలో ట్రేడింగ్‌, ఎగుమతికి సంబంధించిన విభాగాల్ని చూసుకునేది శృతి. ఇలా తన తండ్రి వ్యాపారమే తన మనసు మార్చిందంటోందీ దిల్లీ డిజైనర్.

‘వన్యప్రాణి సంరక్షణను నా కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నా. అంతకంటే ముందు కొన్నాళ్ల పాటు నాన్న చేస్తోన్న దుస్తుల వ్యాపారంలో తనకు సహకరించాలనుకున్నా. ఈ క్రమంలోనే విభిన్న డిజైనర్‌ దుస్తులు, వాటి రంగులు, హంగులు.. నన్నెంతో ఆకర్షించాయి. నా మనసులో దాగున్న ఆసక్తి, సృజనాత్మకతను తట్టిలేపాయి. ఇదే 2019లో ‘షాజా’ పేరుతో ఫ్యాషన్‌ వ్యాపారం ప్రారంభించేలా చేశాయి..’ అంటోంది శృతి.

అదే శృతి ప్రత్యేకత!

మన ప్రాచీన సంస్కృతీ సంప్రదాయాలు/ఆచార వ్యవహారాల్ని.. ఈ కాలానికి తగ్గట్లుగా బొమ్మలు/ఆకులు/పువ్వులు.. ఇలా విభిన్న డిజైన్లుగా మలుస్తూ శాలువాలకు ఆధునిక హంగులద్దడం శృతి ప్రత్యేకత! పష్మీనా, కశ్మీరీ ఉన్ని.. వంటి ఫ్యాబ్రిక్స్‌తో కలర్‌ఫుల్‌గా, సృజనాత్మకంగా ఆమె రూపొందించే శాలువాలు మనసులోని భావాలకు అద్దం పడతాయి. జామెట్రిక్‌ ప్రింట్స్‌, కలంకారీ, ఆర్ట్‌వర్క్‌.. వంటి విభిన్న డిజైన్లలో శాలువాలు, స్టోల్స్‌ రూపొందించే ఆమె.. ఆయా కాలాలకు అనుగుణంగా, సౌకర్యవంతంగా ఉండేవీ తయారుచేస్తుంటారు. అంతేకాదు.. ఆయా శాలువాలు, స్టోల్స్‌పై ఎంబ్రాయిడరీతోనూ హంగులద్దుతారు. ఇక తమకు నచ్చినట్లుగా కావాలనుకునే వారికి కస్టమైజ్‌డ్‌ శాలువాలు కూడా రూపొందించి ఇస్తారు శృతి. ఇలా తన ఫ్యాషన్‌ నైపుణ్యాలతో మనసులోని భావాల్ని పలికించగలిగేలా శాలువాలు తయారుచేసే ఆమె.. వీటి తయారీలో ‘జీరో వేస్ట్‌’ పద్ధతిని పాటిస్తుంటారు. అంతేకాదు.. దుస్తుల్ని రీసైక్లింగ్‌ చేస్తూ విభిన్న శాలువాలు రూపొందించడంలోనూ శృతి దిట్ట.

‘మా వద్దకొచ్చే కస్టమర్లలో చాలామంది కస్టమైజ్‌డ్‌ శాలువాలు తయారుచేయించుకోవడానికే ఇష్టపడతారు. అలాంటి వారి కోసం వారు ఎంచుకున్న డిజైన్‌ను బట్టి శాలువా తయారుచేయడానికి 2-5 నెలలు పడుతుంది. మా డిజైన్లే కాదు.. ప్యాకింగ్‌ కూడా ప్రత్యేకంగానే ఉంటుంది. కస్టమైజ్‌డ్‌ శాలువాను అదే రీతిలో ప్యాక్‌ చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నాం..’ అంటారు శృతి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్