సాహస యాత్రలతో మరింత దగ్గరైపోండి!

పెళ్లితో ఒకటైన జంటలు తమ దాంపత్య బంధం మరింత బలపడాలని కోరుకోవడం సహజం. మీరూ అంతేనా?? అయితే మీకు దగ్గర్లో ఉన్న ఏదో ఒక ప్రదేశానికి సరదాగా టూర్‌కి వెళ్లి రండి..! ఏంటీ?? టూర్ అనగానే 'ఇప్పటికే వెళ్లొచ్చాం కదా!' అని ఆలోచిస్తున్నారా?? అదే మరి..!

Published : 29 Oct 2021 21:26 IST

పెళ్లితో ఒకటైన జంటలు తమ దాంపత్య బంధం మరింత బలపడాలని కోరుకోవడం సహజం. మీరూ అంతేనా?? అయితే మీకు దగ్గర్లో ఉన్న ఏదో ఒక ప్రదేశానికి సరదాగా టూర్‌కి వెళ్లి రండి..! ఏంటీ?? టూర్ అనగానే 'ఇప్పటికే వెళ్లొచ్చాం కదా!' అని ఆలోచిస్తున్నారా?? అదే మరి..! మేం చెప్పింది విహారయాత్రకి వెళ్లమని కాదండోయ్.. మీకు దగ్గర్లో ఉన్న పర్యటక ప్రాంతాల్లో క్యాంపింగ్‌కు అనువుగా ఉన్న ప్రదేశం ఎంచుకొని అక్కడకి వెళ్లమంటున్నాం. ఇలా దంపతులిద్దరూ క్యాంపింగ్‌కు వెళ్లి చిన్న చిన్న సాహసయాత్రలు చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు. మరి, ఆ ప్రయోజనాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

భార్యాభర్తలన్న తర్వాత విహారయాత్రలు, మధురయాత్రలు.. చేయడం సహజమే. అయితే దంపతులిద్దరూ ఒకరి గురించి మరొకరు ప్రత్యక్షంగా, మరింత క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మాత్రం అందుకు సాహసంతో కూడుకున్న చిన్న చిన్న ట్రిప్స్‌కు వెళ్లడం కూడా ముఖ్యమే అంటున్నారు రిలేషన్‌షిప్ నిపుణులు.

బలాలు.. బలహీనతలు..

దంపతులిద్దరూ కలిసి దగ్గర్లో ఉన్న పర్యటక ప్రదేశాల్లో సాహసాలకు అనువుగా ఉన్న ప్రాంతం ఎంచుకోవాలి. అక్కడకు చేరుకున్న తర్వాత ట్రెక్కింగ్, గమ్యస్థానం నిర్ణయించుకొని కొండలు, కోనల్లో మ్యాప్ ద్వారా చేరుకోవడానికి ప్రయత్నించడం.. వంటివి చేయాలి. ఇలా ఇద్దరూ కలిసి సాహసోపేతమైన పనులకు పూనుకోవడం వల్ల ఇరువురి బలాలు, బలహీనతలు తెలుసుకోవచ్చు. అంతేకాదు.. ఒకరికొకరు సాయం చేసుకుంటూ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించే క్రమంలో దంపతుల మధ్య ఉన్న అవగాహన పెరగడంతోపాటు, బంధం కూడా మరింత బలపడుతుంది.

కొత్త కోణం..

ఇంట్లో ఇద్దరూ కలిసి గడపడం లేదా విహారయాత్రలకు వెళ్లినప్పుడు సరదాగా గడిపిన క్షణాలు.. దాంపత్య బంధం బలపడడానికి ఇవన్నీ ఒక ఎత్త్తెతే.. సాహసోపేతమైన యాత్రలు మరొక ఎత్తు. వీటి ద్వారా భార్యాభర్తలు ఒకరికొకరు కొత్త కోణాల్లో కనిపించే అవకాశం ఉంటుంది. యాత్రలో మార్గమధ్యంలో భాగస్వామి ప్రదర్శించే తెలివితేటలు, ప్రతిభ, సమయస్ఫూర్తి.. మొదలైనవాటిని ఎప్పటికప్పుడు గుర్తించడం, ప్రశంసించడం.. వంటివి చేయడం వల్ల పరస్పరం కొత్త కోణాల్లో కనిపించడం ద్వారా దంపతులు మానసికంగా మరింత చేరువ కావడానికి అవకాశం ఉంటుంది.

నమ్మకం పెరుగుతుంది..

ఏ బంధమైనా కలకాలం సాగాలంటే అందుకు నమ్మకమే పునాది. భార్యాభర్తల మధ్య ఒకరిపై మరొకరికి నమ్మకం కలిగేందుకు కూడా ఇలాంటి సాహస యాత్రలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇలాంటి యాత్రల్లో దంపతులిద్దరిలో ఒకరు ముందుండి మార్గం చూపిస్తే, మరొకరు అనుసరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. ఫలితంగా సాహస యాత్రలో ఇద్దరూ ఒకరికొకరు తోడుగా గమ్యాన్ని చేరుకోవడమే కాదు.. భార్యభర్తల బంధాన్ని కలకాలం కలిపి ఉంచే నమ్మకం కూడా మరింత పెరుగుతుంది.

కలిసి ముచ్చటించుకోవచ్చు..

మీ ఇంట్లో ఇద్దరూ కలిసి ఎలాంటి అంతరాయం లేకుండా ఎప్పుడు మాట్లాడుకున్నారు చెప్పండి?? ఆలోచిస్తున్నారా?? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కాస్త కష్టమేలెండి.. ఎందుకంటే ప్రస్తుతం కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌ల పుణ్యమా అని ప్రపంచమే మన చేతుల్లో ఉంటోంది. ఇక అంతరాయం లేని ప్రశాంతత ఎక్కడిది?? కాసేపు మాట్లాడుకుందామని కూర్చుంటే చాలు.. ఫోన్, మెసేజ్, మెయిల్, ఆఫీసు పని.. ఇలా ఏదో ఒకటి వస్తుంది. ఇంకేముంది మాటలకు ఫుల్‌స్టాప్ పెట్టి పనిపై దృష్టి పెట్టడమే! అయితే క్యాంపింగ్ చేసేటప్పుడు ఈ ఇబ్బంది ఉండదు. దంపతులిద్దరూ కలిసి కావాల్సినంత సేపు ముచ్చటించుకోవచ్చు. అది కూడా ఎలాంటి అంతరాయం లేకుండా! ఇందుకోసం మీరు మీ ఫోన్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. వీలుంటే డిజిటల్ డీటాక్సిఫికేషన్‌ను అనుసరించండి. ఫలితంగా ఇద్దరూ మాట్లాడుకోవడానికి బోలెడంత సమయం దొరుకుతుంది.

ప్రయోజనాలెన్నో..

* జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆనందాలను కలిసి సొంతం చేసుకోవచ్చు.

* మార్గమధ్యంలో పెట్టుకునే చిన్న చిన్న సరదా పోటీలు ఇద్దరిలోనూ పోటీతత్వాన్ని పెంచుతాయి.

* ఇద్దరూ కలిసి ఒక్కటిగా ఆలోచిస్తూ ముందుకెళ్లడం వల్ల ఇద్దరి మధ్యా సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది.

* ఇరువురూ కలిసి ప్రయాణించే క్రమంలో మీలో ఉన్న చిలిపితనం, అల్లరి.. ప్రదర్శించడానికి చక్కటి అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా భాగస్వామికి మరింత చేరువయ్యే అవకాశం ఉంది.

* అన్నింటికీ మించి ఒత్తిళ్లకు మూలమైన రోజువారీ పనుల నుంచి విముక్తి లభిస్తుంది. ఇవన్నీ భార్యాభర్తల మధ్య బంధాన్ని బలపరచడానికి ఉపకరించేవే!

మరి, మీరు కూడా చిన్న చిన్న సాహసయాత్రలతో మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు కదూ! ఈ తరహా ప్రయాణాలు కేవలం భార్యాభర్తలకే కాదు.. పిల్లలు లేదా స్నేహితులతో కలిసి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే వెళ్లే ప్రదేశాలు మాత్రం ఎవరితో వెళ్తున్నాం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయించుకోవాలి. అనేక ట్రావెల్ ఏజెన్సీలు ఇప్పుడు ఇలాంటి సాహసయాత్రలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అలాంటి వాటిని సంప్రదిస్తే మన యాత్రకు అవసరమైన ఏర్పాట్లు వాళ్లే చేసే అవకాశం ఉంటుంది. అయితే ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా- కరోనా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మర్చిపోకండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్