పని ప్రదేశంలో వారికే వేధింపులెక్కువట!

ఆఫీస్‌లో మన పని మనం చేసుకుపోతాం. చక్కటి పనితనాన్ని కనబరుస్తూ సంస్థకు మంచి ఉత్పాదకతనూ అందిస్తాం.. ఇది పరోక్షంగా మన కెరీర్‌ అభివృద్ధికీ దోహదం చేస్తుంది. అయితే ఇలా పని ప్రదేశంలో కెరీర్‌లో ఉన్నతి సాధిస్తూనే.. వృత్తిపరంగా ఎదిగే వారే ఎక్కువ వేధింపులకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు.

Published : 21 Sep 2023 20:33 IST

ఆఫీస్‌లో మన పని మనం చేసుకుపోతాం. చక్కటి పనితనాన్ని కనబరుస్తూ సంస్థకు మంచి ఉత్పాదకతనూ అందిస్తాం.. ఇది పరోక్షంగా మన కెరీర్‌ అభివృద్ధికీ దోహదం చేస్తుంది. అయితే ఇలా పని ప్రదేశంలో కెరీర్‌లో ఉన్నతి సాధిస్తూనే.. వృత్తిపరంగా ఎదిగే వారే ఎక్కువ వేధింపులకు గురవుతారని నిపుణులు చెబుతున్నారు. వారి ఎదుగుదలను చూసి ఓర్వలేని సహోద్యోగులే ఈ తరహా వేధింపులకు పాల్పడతారని అంటున్నారు. అయితే వీరి చేష్టలు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ప్రతికూల ప్రభావం చూపకముందే జాగ్రత్తపడమని సూచిస్తున్నారు. మరి, ఆఫీస్‌లో ఉత్తమ ఉద్యోగులు ఎలాంటి వేధింపులకు గురవుతారు? వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం రండి..

ఆ రూమర్లను పట్టించుకోకండి!

మన పనితనం, కనబరిచే నైపుణ్యాలే మనల్ని అందలమెక్కిస్తుంటాయి. అయితే ఇలా సంస్థ అభివృద్ధి, కెరీర్‌లో ఎదుగుదల గురించి అనుక్షణం ఆలోచిస్తూ.. ఒక్కో లక్ష్యాన్ని చేరుకుంటుంటే అది చూసి కొంతమంది సహోద్యోగులు ఈర్ష్య పడుతుంటారు. ఈ అసూయ ద్వేషాలతోనే వారి గురించి చెడుగా ప్రచారం చేయాలనుకుంటారు. ఈ క్రమంలో ఎక్కడా ఏ పొరపాటు దొరక్కపోతే.. వారిలో చిన్న చిన్న లోపాలు, అలవాట్లనే ఆసరాగా చేసుకొని.. వాటి గురించి అందరితో నెగెటివ్‌గా చెబుతుంటారు. దీనివల్ల వారు అభద్రతా భావానికి లోనై.. పనిపై దృష్టి పెట్టకుండా, కెరీర్‌లో ఎదగకుండా చేయాలన్న ఆలోచనతోనే ఇలాంటి రూమర్లు ప్రచారం చేస్తుంటారు. అయితే వీటిని పట్టించుకోవద్దంటున్నారు నిపుణులు. ప్రతి ఒక్కరిలోనూ బలహీనతలు, లోపాలు సహజమని.. వాటిని భూతద్దంలో పెట్టి చూడడం, తమ గురించి ఇతరులు ఏమనుకుంటారోనన్న భయాందోళనలు నిజంగానే మీ పనితనాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. కాబట్టి మీపై చెడుగా ప్రచారం చేసిన వారికి బుద్ధి చెప్పాలంటే.. మరింత యాక్టివ్‌గా పనిచేయడం, కెరీర్‌లో ఉన్నతి సాధించేలా కృషి చేయడమే సరైన మార్గం అంటున్నారు.

సంయమనం పాటించండి!

పనిలో చక్కటి ప్రదర్శన కనబరిచే వారికే ఉద్యోగ భద్రత ఎక్కువ! అయితే మాంద్యం, ఆర్థిక సంక్షోభం.. వంటి పరిస్థితులు తలెత్తినప్పుడూ ఇలాంటి వారే ఉద్యోగాల్ని సంరక్షించుకోగలుగుతారు. ఇక మిగతా వారి ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే అవకాశాలే ఎక్కువ! అయితే ఇలా ఉద్యోగ రక్షణ లేని వారే ఉత్తమ ప్రతిభ కనబరిచే వారిని పరోక్షంగా వేధించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వీరికి పనితనం లేకపోయినా.. ఆఫీస్‌లో నెట్‌వర్క్‌ను పెంచుకోవడం, ఉన్నతోద్యోగుల దృష్టిలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం, ఆపై వారితోనే పనితనం కనబరిచే ఉద్యోగులపై అదనపు పనిభారం పడేలా చేయడం.. ఇలా పరోక్షంగా వారిని దెబ్బతీయడమే పనిగా పెట్టుకుంటుంటారు. అయితే ఇలాంటప్పుడు ఓపికను కోల్పోకుండా.. సంయమనంతో వ్యవహరించాలంటున్నారు నిపుణులు. పనిభారం ఎక్కువైనా సానుకూలంగా స్వీకరించడం, మీ గురించి/మీ పనితనం గురించి అధికారులకు నెగెటివ్‌గా తెలిసినా.. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని రుజువు చేయడం.. ఇలా ఏదైనా ఓపికతో, పాజిటివ్‌గా తీసుకొని ముందుకు సాగితే.. ఇటు మీ పెర్ఫార్మెన్స్‌ దెబ్బతినకుండా, అటు పైఅధికారులకు మీపై దురభిప్రాయం ఏర్పడకుండా జాగ్రత్తపడచ్చు.

అసలైన నాయకులుగా!

ఉత్తమ పనితనం కనబరిచే వారిలో నాయకత్వ లక్షణాలూ మెండుగానే ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ బృందానికి నాయకత్వం వహిస్తూ.. పనులు పూర్తిచేసే అవకాశం మిమ్మల్ని వరించచ్చు. అయితే ఇలా మీరు నాయకత్వం వహించే బృందంలో అందరి వ్యక్తిత్వం ఒకేలా ఉండచ్చు.. ఉండకపోవచ్చు. కొంతమంది మీరు చెప్పిన పనుల్ని సీరియస్‌గా పూర్తిచేసే వారై ఉండచ్చు.. మరికొందరు.. ‘నువ్వు చెప్తే నేనెందుకు చేయాలన్న’ పొగరుగానూ ప్రవర్తించచ్చు. ఇలాంటి వారు తమలోని చెడు ప్రవర్తనల్ని అంగీకరించడానికి ఇష్టపడరు. దీనికి బదులు.. తమ పైస్థానాల్లో ఉండే బృంద నాయకులే అహంకారులుగా, పొగరు గల వారిగా పరిగణిస్తుంటారు. అయితే ఇలాంటి వారితో కటువుగా ఉండడం కంటే.. సానుకూలంగా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు. బృంద నాయకులుగా మీరు వారికి పనుల్ని అప్పగించేటప్పుడు, పని విషయంలో వారిలో ఉన్న లోపాల్ని ఎత్తి చూపేటప్పుడు.. నెమ్మదిగానే వారితో వ్యవహరించాలని చెబుతున్నారు. ఇక వారి పనితనం, వారిచ్చే ఐడియాలు, పనులు పూర్తిచేసే క్రమంలో వారి నిర్ణయాలు.. వంటివన్నీ ఎప్పటికప్పుడు నోట్‌ చేస్తూ.. వాటిని పైఅధికారుల దృష్టికి తీసుకెళ్తే.. ఎవరి పనితనం ఎలా ఉందో వారికే అర్థమవుతుంది. ఇలా మీ ఓపికే మిమ్మల్ని మరోసారి అసలైన నాయకులుగా నిలబెడుతుంది.

వేరు చేసినా వెరవకండి!

ఆఫీస్‌లో ఒక్కో ఉద్యోగి పనితనం ఒక్కోలా ఉంటుంది. వీరిలో సీరియస్‌గా పనిచేసి.. పదోన్నతులు పొందే వారి సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. అయితే ఇలా కష్టపడి ఎదగాలన్న తత్వమే వీరిని పని ప్రదేశంలో ఇతరుల చేతిలో వేధింపులకు గురయ్యేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. మంచి పనితనం కనబరిచే వారి సంఖ్య తక్కువగా ఉండి.. సాధారణ పనితనం, అంతకంటే తక్కువగా పనితనాన్ని ప్రదర్శించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి వీళ్లంతా ఎదిగే వాళ్ల దగ్గర్నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కానీ చాలామంది అలా చేయరు.. వాళ్లపై అసూయ పెంచుకొని.. వాళ్లను వేరు చేసి మాటలు, చేతలతో వేధిస్తుంటారు. ఇది పరోక్షంగా వారి పనితనాన్ని దెబ్బతీస్తుందనుకుంటారు. నిజానికి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడూ ఉత్తమ ఉద్యోగులు సానుకూలంగా స్పందించడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే మీ గురించి నెగెటివ్‌గా ఆలోచించే వారితో ఎప్పటికైనా మీకు ముప్పే కాబట్టి వారితో వేరు కావడమే ఉత్తమం అంటున్నారు. ఈ క్రమంలో మీ పనులు మీరు చేసుకుపోవడంతో పాటు మరింత ఎదిగేందుకు వ్యూహాలు రచించడం, మీ సృజనాత్మకతను ప్రదర్శించడం వల్ల మీ కెరీర్‌కు ప్లస్‌ అవుతుందంటున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని