కృత్రిమ కాలితో స్టెప్పులేస్తూ.. 80 ఏళ్ల వయసులో తమ్ముడి కోసం..!
సామాజిక మాధ్యమాల వినియోగం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో చాలామంది తమకు సంబంధించిన ప్రతి అంశాన్ని వీటి ద్వారానే పంచుకుంటున్నారు.
(Photos: Screengrab)
సామాజిక మాధ్యమాల వినియోగం రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ క్రమంలో చాలామంది తమకు సంబంధించిన ప్రతి అంశాన్ని వీటి ద్వారానే పంచుకుంటున్నారు. ఇందులో కొన్ని వినూత్నంగా ఉంటే మరికొన్ని ఇతరుల్లో స్ఫూర్తి నింపుతున్నాయి. వాటిలో కొన్నిటికి నెటిజన్ల నుంచి కూడా మంచి ఆదరణ లభించడంతో వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది మహిళలకు సంబంధించి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరలైన కొన్ని ఆసక్తికర వీడియోలు చూద్దాం రండి..
క్యూఆర్ కోడ్ అడిగితే..!
నోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా డబ్బులు చెల్లించడానికి క్యూఆర్ కోడ్‌లు దర్శనమిస్తున్నాయి. దాంతో కిరాణా షాపుల దగ్గర్నుంచి తోపుడు బండ్ల వరకు ప్రతి ఒక్కరూ చెల్లింపులకు క్యూఆర్ కోడ్ ఉపయోగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట వైరలైంది. ఓ మహిళ కూరగాయలు అమ్ముతూ బిజీగా ఉంది. అదే సమయంలో ఆమె దగ్గర కూరగాయలు తీసుకున్న వ్యక్తి ఆన్‌లైన్ పేమెంట్ ఉందా? అని అడిగాడు. దాంతో ఆమె కూరగాయలు తూకం వేసే త్రాసుకి వెనక అంటించి ఉన్న క్యూఆర్ కోడ్‌ని చూపించింది. UPI ద్వారా జరిగే లావాదేవీల సంఖ్య 10 బిలియన్ మార్క్ దాటిందని చెబుతూ ఈ వీడియోని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఆ మహిళ ఆలోచన ‘అదుర్స్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోని ఇప్పటివరకు దాదాపు 6 లక్షల మంది వీక్షించారు.
8 కి.మీ. నడిచి.. రాఖీ కట్టిన 80 ఏళ్ల బామ్మ!
అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక ‘రాఖీ పౌర్ణమి’. ఈ పర్వదినాన తమ అనుబంధానికి గుర్తుగా మహిళలు తమ సోదరుడికి రాఖీ కడతారు. ‘నీ కష్టసుఖాల్లో మేం అండగా ఉంటామం’టూ భరోసా ఇస్తారు తోబుట్టువులు. ఈ క్రమంలో- తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఓ 80 ఏళ్ల బామ్మ చేసిన ప్రయత్నం స్ఫూర్తి నింపుతోంది. ‘తెలంగాణాకు చెందిన 80 ఏళ్ల బక్కవ్వ అనే మహిళ తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు మండుటెండలో 8 కిలోమీటర్లు చెప్పులు లేకుండా కాలి నడకన వెళ్లింది’ అని చెబుతూ ఇందుకు సంబంధించిన వీడియోని ఓ వ్యక్తి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేయగా.. నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది. 80 ఏళ్ల వయసులో చెప్పులు కూడా లేకుండా 8 కిలోమీటర్లు నడిచి మరీ తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఈ బామ్మ చేసిన ప్రయత్నాన్ని పలువురు కొనియాడుతున్నారు.
కృత్రిమ కాలితో.. ‘జవాన్’ పాటకు స్టెప్పులేస్తూ..!
ఈ రోజుల్లో చాలామంది తమ ప్రతిభను చాటుకోవడానికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది డ్యాన్స్ వీడియోలు చేస్తూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుస్మిత చక్రవర్తి గాథ మాత్రం ఇందుకు భిన్నం. ఆమెకు పుట్టుకతోనే కుడి కాలు చిన్నగా ఉంది. అయినా చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పై మక్కువ పెంచుకుంది. ఆ తర్వాత కృత్రిమ కాలితో తన కలను సాకారం చేసుకుంది. ఇప్పుడు డ్యాన్స్ వీడియోలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. ఇందులో భాగంగానే షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రంలోని ‘చలేయా’ పాటకు స్టెప్పులేస్తూ ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అది నెట్టింట వైరల్‌గా మారింది. ‘నీ ప్రతిభ అమోఘం’, ‘సూపర్బ్’, ‘అమేజింగ్’ అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.