Prathyusha Suicide: అలా అనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగి.. ఆలోచించండి!

సమస్యలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. అయితే కొంతమంది వీటి గురించి మరీ లోతుగా ఆలోచించి మానసిక ఒత్తిడి, ఆందోళనల్లోకి కూరుకుపోతుంటారు. ‘ఇక నా జీవితం వ్యర్థం!’ అన్న వైరాగ్య భావనలోకి వెళ్లిపోతారు. ఇలాంటి ఆలోచనలు ఒక్కోసారి ఆత్మహత్య ప్రయత్నానికి కూడా....

Published : 14 Jun 2022 15:26 IST

సమస్యలనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సహజం. అయితే కొంతమంది వీటి గురించి మరీ లోతుగా ఆలోచించి మానసిక ఒత్తిడి, ఆందోళనల్లోకి కూరుకుపోతుంటారు. ‘ఇక నా జీవితం వ్యర్థం!’ అన్న వైరాగ్య భావనలోకి వెళ్లిపోతారు. ఇలాంటి ఆలోచనలు ఒక్కోసారి ఆత్మహత్య ప్రయత్నానికి కూడా దారితీయచ్చు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష గరిమెళ్ల కూడా ఇలాంటి ప్రతికూల ఆలోచనలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒంటరితనం, ఒత్తిడే తన ఆత్మహత్యకు కారణమంటూ ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ ద్వారా తెలుస్తోంది. దీంతో మానసిక సంఘర్షణలు మనసుపై ఎంతటి ప్రతికూల ప్రభావం చూపుతాయన్న విషయం మరోసారి తెరమీదకొచ్చింది. అయితే ప్రతి సమస్యకు చావే పరిష్కారం కాదని, బాధితులు సంబంధిత నిపుణుల్ని సంప్రదించి సరైన చికిత్సలు, కౌన్సెలింగ్‌.. వంటివి తీసుకుంటే భవిష్యత్తుపై తిరిగి భరోసాను పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆత్మహత్యకు ప్రేరేపించే ఆలోచనలేంటి? వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం రండి..

ఎవరీ ప్రత్యూష?!

ప్రత్యూష గరిమెళ్ల.. ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్‌ డిజైనర్‌ అయి ఉండి.. మానసిక ఒత్తిళ్లతో ఆత్మహత్య చేసుకోవడం అటు సెలబ్రిటీలతో పాటు ఇటు సామాన్యుల్నీ విస్మయానికి గురి చేసింది. ‘ప్రత్యూష గరిమెళ్ల లేబుల్‌’ పేరుతో హైదరాబాద్‌, ముంబయిలలో ఫ్యాషన్‌ స్టోర్లు నడిపేవారామె. వార్‌విక్‌ యూనివర్సిటీలో ‘ఫ్యాషన్ డిజైనింగ్‌’లో డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. స్వీయ నైపుణ్యాలతో ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఎదిగింది. సీక్విన్‌, జర్దోసీ, గోటా పట్టీ.. వంటి సమకాలీన డిజైన్లతో ఫ్లోర్లెంత్‌ అనార్కలీలు, లెహెంగాలు, కుర్తా సెట్స్‌, జాకెట్‌ సెట్స్‌, కఫ్తాన్స్‌.. వంటి ఫ్యాషన్స్‌ని రూపొందించడంలో దిట్టగా ఆమె పేరు పొందారు. మరోవైపు.. పురుషుల ఫ్యాషన్స్‌నీ డిజైన్‌ చేశారు ప్రత్యూష. ఉపాసన, కృతీ శెట్టి, సానియా మీర్జా, నిహారిక, మిహీకా బజాజ్‌.. వంటి తెలుగు ప్రముఖులతో పాటు.. హీనా ఖాన్‌, పరిణీతి చోప్రా, కాజోల్‌, నుస్రత్‌ బరూచా.. తదితర బాలీవుడ్‌ నటీమణులకూ దుస్తులు డిజైన్‌ చేశారామె. అయితే తనదైన ఫ్యాషన్‌ నైపుణ్యాలతో ఇంత పేరు మోసిన ఆమె.. మానసిక ఒత్తిళ్ల కారణంగా ఆత్మహత్య చేసుకోవడం ఎంతోమందిని కలచివేసింది. ఈ క్రమంలోనే రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన స్పందిస్తూ.. ‘నా బెస్టీ, ప్రాణ స్నేహితురాలి మరణం నన్నెంతో కలచివేసింది. ప్రతి విషయంలో తానెంతో ఉన్నతంగా ఆలోచించేది. అలాంటిది తను ఇంత త్వరగా వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది.. #RIP P’ అని ట్వీట్‌ చేసింది.

ఇలాంటివి గుర్తించారా?

ఎవరికైనా ఒత్తిడి, ఆందోళనలు కొత్త కాదు. అయితే ఆయా సమస్యల్ని బట్టి వాటి తీవ్రతలో హెచ్చుతగ్గులుంటాయి. కొంతమంది వీటిని తట్టుకోలేక జీవితంపై విరక్తి చెందుతారు.. ఈ క్రమంలో ఆత్మహత్య ప్రయత్నానికి సంబంధించిన ఆలోచనలు చేస్తుంటారు. దీన్నే ‘Suicidal Depression’గా పేర్కొంటున్నారు నిపుణులు. మనలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా దీన్ని గుర్తిస్తే ప్రాణాల మీదకు తెచ్చుకొనే అవసరం రాదంటున్నారు. అవేంటంటే..!

రోజువారీ పనులపై ఏకాగ్రత కోల్పోవడం.

నిరాశ నిస్పృహలు ఆవహించడం.

నిరంతరం బాధతోనే ఉండడం.

అవిశ్రాంతంగా ఫీలవడం.

నిర్ణయాలు తీసుకోవడం భారంగా మారడం.

వైరాగ్య భావనతో కూడిన మాటలు.

మరీ ఎక్కువగా/తక్కువగా నిద్ర పోవడం.. అంటే సరైన నిద్ర సమయాలు కొనసాగించకపోవడం.

ఎవరితో మాట్లాడినా చావుకు సంబంధించిన అంశాల పైనే దృష్టి పెట్టడం, వెతకడం, రాయడం.. వంటివి.

కుటుంబం సభ్యులు, స్నేహితులు, సామాజిక సంబంధాలను తెంచుకొని ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం.

నచ్చిన వారిని, వస్తువులను దూరం పెట్టడం.

వెనువెంటనే మూడ్‌ మారిపోవడం.

కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇష్టమైన వారికి ఎప్పుడూ లేనట్లుగా జాగ్రత్తలు చెప్పడం.. ఇక తమను ఎప్పుడూ కలవబోమని.. తమ మాటలతో చెప్పకనే చెప్పడం.

చికిత్స ఏంటి?

అయితే ఇలాంటి తీవ్ర ఆలోచనలతో పాటు.. దీర్ఘకాలిక వ్యాధులు, అనుకోకుండా ఇష్టమైన వారిని కోల్పోవడం, శారీరక-లైంగిక వేధింపులు, ఆర్థిక సమస్యలు.. వంటివి కూడా కొంతమంది విషయంలో ఆత్మహత్య ఆలోచనల్ని ప్రేరేపిస్తున్నాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆలోచనల తీవ్రతను బట్టి ‘Dialectic Behavioral Therapy’, ‘Cognitive Behavioral Therapy’.. వంటి థెరపీలు ఆత్మహత్య ఆలోచనల్ని చాలా వరకు తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే నిపుణుల సూచన మేరకు యాంటీ డిప్రెసెంట్స్‌ కూడా వాడాల్సి ఉంటుంది. మరోవైపు మన జీవనశైలిలోనూ పలు మార్పులు చేర్పులు చేసుకోవడం ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో..

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు వ్యాయామాలు, యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటివి మేలు చేస్తాయి.

రోజూ నిద్ర సమయాల్ని కూడా క్రమ పద్ధతిలో మెయింటెయిన్‌ చేయడం మంచిది. అలాగే ఏడెనిమిది గంటల నిద్ర తప్పనిసరి!

మానసిక ఆరోగ్యం కోసం ఆహారంలోనూ పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పండ్లు-కాయగూరలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే చేపలు, ఆకుకూరలు, నట్స్‌, గింజలు, కాయధాన్యాలు.. వంటివి అధికంగా తీసుకోవాలి. ఈ పదార్థాల్లో ఉండే పోషకాలన్నీ మెదడు ఆరోగ్యానికెంతో మంచివి.

ఆనందమైనా, బాధైనా పంచుకుంటేనే తగ్గుతుందంటారు. అందుకే ప్రతికూల ఆలోచనలొచ్చినప్పుడు వాటిని మీలోనే దాచుకోకుండా.. మీకిష్టమైన వారితో, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలి. తద్వారా వారు మీ సమస్యను దూరం చేసే మంచి సలహా ఏదైనా ఇచ్చే అవకాశం ఉంటుంది.

ఒంటరిగా ఉంటే ఇలాంటి తీవ్రమైన ఆలోచనలు ఎక్కువవుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి మీకిష్టమైన వారితోనే సమయం గడిపేలా, మనసుకు నచ్చిన పనులు చేసేలా.. ఇలా ఏదో ఒక పనితో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం మంచిది.

అలాగే అవతలి వ్యక్తులు కూడా బాధితుల బాధను పూర్తిగా విని అర్థం చేసుకోవాలి. వీలైతే వాళ్లకు మానసిక చికిత్స అందే వరకూ మీరు వారితోనే ఉండడం మంచిది. తద్వారా ఎలాంటి అనర్థం జరగకుండా ముందు జాగ్రత్తపడచ్చు.

‘జీవితం వెలుగులీనాలంటే.. మనసులోని చీకట్లను తొలగించాల’న్నాడో కవి. కాబట్టి మనసులోని ప్రతికూల ఆలోచనల్ని తొలగించుకొని.. సానుకూల దృక్పథాన్ని నింపుకుంటే వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా విజయం సాధించచ్చు. మరి, దీనిపై మీరేమంటారు? Contactus@vasundhara.net వేదికగా పంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్