Updated : 29/09/2021 19:16 IST

First Period: అదో భయంకరమైన అనుభవం!

‘పెద్ద మనిషివై పూసిన నుండే ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో.. చూసే దాన్ని చూడొద్దంటరు నవ్వే చోట నవ్వొద్దంటరు’ అంటూ రజస్వల అయిన అమ్మాయిలపై ఉండే ఆంక్షల గురించి వివరించాడో సినీ కవి. ఇలాంటివి తనకూ అనుభవమే అంటోంది పాతికేళ్ల పూర్ణ. హుజూరాబాద్‌లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిపెరిగిన ఆమె.. పెద్ద మనిషయ్యాక తానూ ఎన్నో కట్టుబాట్లు, ఆంక్షల్ని ఎదుర్కొన్నానని చెబుతోంది. అయితే తెలిసీ తెలియని వయసులో అవన్నీ నిజమేనని నమ్మినా.. పెద్దయ్యే క్రమంలో వాటిలోని నిజానిజాల్ని గ్రహించింది. ఎలాగైనా ఈ మూఢనమ్మకాల్ని, చాదస్తాల్ని ప్రజల మనసులో నుంచి కడిగేయాలనుకుంది. ఈ క్రమంలోనే నెలసరిపై ఉన్న అపోహల్ని తొలగించి.. మంచేదో, చెడేదో అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం తన జీవితంలో జరిగిన చేదు సంఘటనల్ని, అనుభవాల్ని ఉదహరిస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతోంది.

అప్పటిదాకా అక్కచెల్లెళ్లతో, అన్నదమ్ములతో, తోటి విద్యార్థులతో ఆడుతూ పాడుతూ సరదాగా గడిపిన అమ్మాయిలంతా.. పెద్ద మనిషయ్యాక ఒక్కసారిగా ఆంక్షల చట్రంలో బందీ అయిపోతారు. వాళ్లు ఏ పనిచేసినా, ఏ వస్తువు ముట్టుకున్నా, ఎవరితో మాట్లాడినా.. చుట్టూ ఉన్న వారికి అది తప్పుగానే అనిపిస్తుంటుంది. పదమూడేళ్లొచ్చాక నేనూ ఇలాంటి అనుభవాలే ఎదుర్కొన్నా.

******

మా గ్రామంలోని సర్కార్‌ బళ్లోనే నా చదువు సాగింది. స్కూల్లో చదువే లోకంగా భావించే నేను.. ఇంట్లో మాత్రం ఎంతో చలాకీగా ఉండేదాన్ని. ఇద్దరు అన్నల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్లను కావడంతో అమ్మానాన్న నన్ను గారాబంగానే పెంచారు. ఇక పుట్టినరోజొస్తే అటు ఇంట్లో, ఇటు స్కూల్లో నాకు పండగే! ఎప్పటిలాగే నా పదమూడో పుట్టినరోజు నాడు కూడా ఆడుతూ పాడుతూ స్కూలుకెళ్లాను. ఎంతో ఇష్టంగా కొనుక్కున్న క్రీమ్‌ కలర్ గాగ్రా వేసుకున్నా. అందరికీ చాక్లెట్స్‌ పంచడం పూర్తైంది. ఇక లంచ్‌ చేద్దామనుకునేసరికి కడుపునొప్పితో ఏదో అసౌకర్యంగా అనిపించింది. వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్లి చెక్‌ చేసుకునే సరికి.. నా డ్రస్‌పై అక్కడక్కడా రక్తపు మరకలు కనిపించాయి. ఒక్కసారిగా భయమేసింది. గతంలో నాకెప్పుడూ ఇలా జరిగింది లేదు. అలాంటిది ఇప్పుడే ఎందుకిలా? ఇదేమైనా వ్యాధేమో.. అసలు నాకేమైందో, ఏమో పాలుపోలేదు. భయంతో కాళ్లు వణికిపోతున్నాయి. దీని గురించి అక్కడ ఎవరితోనైనా చెప్తే ఏమనుకుంటారోనన్న ఉద్దేశంతో వెంటనే టీచర్‌కి ఒంట్లో బాలేదని చెప్పి ఇంటికెళ్లిపోయాను.

నేను అలా సడెన్‌గా ఇంటికెళ్లేసరికి అమ్మ కంగారు పడిపోయింది. జరిగిన విషయమంతా అమ్మకు చెప్పా. నేను విషయం చెప్పగానే నన్ను నాన్న, అన్నయ్యలకు దూరంగా ప్రత్యేకంగా ఓ గదిలో ఉంచేసింది. ఏ వస్తువూ తాకొద్దని ముందే హెచ్చరించింది. ఇరుగుపొరుగు అమ్మలక్కలంతా మా ఇంటికి రావడం, నా ఒంటికి పసుపు రాయడం, మంగళస్నానం చేయించడం, నువ్వులు-బెల్లంతో తయారుచేసిన వంటకాల్ని నా కోసం తీసుకురావడం.. ఇలా నా చుట్టూ జరిగేవన్నీ నాకు వింతగా అనిపించాయి. ఐదు రోజుల పాటు నన్ను ఇలా అందరికీ దూరంగా ఉంచిన తర్వాత అమ్మ నాకు కొన్ని విషయాలు చెప్పింది. దీన్నే నెలసరి అంటారని, ఇకపై నెలనెలా ఇలాగే జరుగుతుందని, ఈ సమయంలో వంట గదిలోకి రావొద్దని, పచ్చళ్లు తాకొద్దని, పూజ గదికి దూరంగా ఉండాలని, గుళ్లకు వెళ్లకూడదని, పువ్వులు కోయొద్దని.. ఇలా ఏవేవో ఆంక్షలు విధించింది. ‘ఇప్పుడు నువ్వు పెద్దదానివైపోయావ్‌..! కాబట్టి చిన్న పిల్లల మనస్తత్వం తగ్గించుకొని మెలుగు’ అని చెప్పడంతో నాకు అంతా కొత్తగా అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. అమ్మ పెట్టిన ఈ ఆంక్షలు నాకు ఏ కోశానా నచ్చలేదు. అయినా ఆ సమయంలో ఇలా ఉండడమే కరెక్టేమో అనుకున్నా..

******

ఇప్పుడంటే పిరియడ్స్‌ సమయంలో ధరించడానికి శ్యానిటరీ న్యాప్కిన్లున్నాయి. కానీ అప్పుడు మాకు అసలు అవంటే ఏంటో కూడా తెలియవు. క్లాత్‌ వాడడం వల్ల వేసుకున్న దుస్తులపై రక్తపు మరకలు పడడంతో స్కూల్‌ మధ్యలోనే ఇంటికొచ్చిన సందర్భాలు కోకొల్లలు. ఇక కొన్ని సందర్భాల్లో స్కూల్‌ మానేసి ఆ ఐదు రోజులు ఇంటికే పరిమితమయ్యేదాన్ని. పైగా నెలసరి గురించి ఇంట్లో అమ్మతో మాట్లాడాలన్నా, ఏదైనా అడగాలన్నా.. నాన్నకు, అన్నయ్యలకు తెలియకూడదన్న ఉద్దేశంతో అమ్మ నాతో గుసగుసలాడేది. కాలక్రమేణా ఇది నా ఒక్కదాని సమస్యే కాదు.. అమ్మాయిలందరూ ఇలాంటి ఇబ్బందులు, ఆంక్షలు ఎదుర్కొంటున్నారన్న నిజం తెలుసుకున్నా.

******

ఇలా రియలైజ్‌ అయ్యేసరికి పది పూర్తైంది. ఇంటర్మీడియట్‌ కోసం హుజూరాబాద్‌లోని ఓ జూనియర్‌ కాలేజీలో చేరా. రోజూ మా ఊరి నుంచి కాలేజీకి రావడం, పోవడం చేసేదాన్ని. నాలాగే ఆ చుట్టూ ఉన్న వివిధ గ్రామాల్లోని ఆడపిల్లలు కూడా ఇదే కాలేజీలో చదువుకునేవాళ్లు. వాళ్లతో గడిపిన ఈ రెండేళ్లలో నెలసరి గురించిన ఎన్నో అనుభవాలు వాళ్లు నాతో పంచుకునేవాళ్లు.. కొంతమందైతే పిరియడ్స్‌ సమయంలో తమను తమ ఇంటికి దూరంగా ఓ పాకలో ఉంచేవారని చెప్పేవారు. అది మరింత దయనీయంగా అనిపించింది. నా స్వీయానుభవాలకు తోడు, వాళ్ల పిరియడ్‌ స్టోరీస్‌ నన్ను ఆలోచనలో పడేశాయి. ఏదేమైనా.. అసలు నెలసరిపై విధించిన ఇలాంటి ఆంక్షల్లో ఎంత నిజముందో తెలుసుకునేందుకు నన్ను పురికొల్పాయి. ఈ క్రమంలోనే నేను పిరియడ్‌లో ఉండగా ఓ రోజు అమ్మ చూడనప్పుడు ఇంట్లోని పచ్చళ్ల సీసాలను తాకాను.. దేవుడి పటాన్ని ముట్టుకున్నా.. మా ఇంట్లో ఉన్న మల్లె చెట్టు నుంచి పూలు కోశా.

ఏడాది దాటినా నేను ముట్టుకున్న పచ్చళ్లు పాడవలేదు.. మల్లె చెట్టు మరింత విరగబూసిందే తప్ప ఎండిపోలేదు.. ఆ దేవుడు కూడా నేను చదువులో మరింత రాణించేలా సహకరించాడే తప్ప నన్ను ఏ విధంగానూ శపించలేదు. అప్పుడనిపించింది.. ఇవన్నీ మనకు మనం పెట్టుకున్న ఆంక్షలు! ఒకరిని చూసి మరొకరు గుడ్డిగా పాటించే మూఢనమ్మకాలు అని! ఇదంతా అమ్మకు వివరించి.. అప్పట్నుంచి ఇవన్నీ నమ్మడం మానేశాను. నా మనసుకు ఏది నచ్చితే అదే చేసేదాన్ని. అయితే నేనొక్కదాన్నే మారడం కాకుండా.. ఈ సమాజంలో కొంతైనా మార్పు తీసుకురావాలనిపించింది. ఈ కార్యక్రమానికి నా స్నేహితుల దగ్గర్నుంచే శ్రీకారం చుట్టాలనుకున్నా. అందుకే ముందు మా కాలేజీ అమ్మాయిల్లో నెలసరిపై ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం చేశా. ఆ తర్వాత నేను చదివే కాలేజీ యాజమాన్యం సహకారంతో ఓ స్వచ్ఛంద సంస్థలో చేరి.. స్కూళ్లు, కాలేజీలు.. ఇలా ఎక్కడ నెలసరి అవగాహన కార్యక్రమాలు జరిగితే అక్కడికెళ్లి సెమినార్లు ఇచ్చేదాన్ని.

******

రోజులు గడిచే కొద్దీ నెలసరి విషయంలో వస్తోన్న మార్పులు, ఈ క్రమంలో పాటించాల్సిన వ్యక్తిగత పరిశుభ్రత, పుట్టుకొస్తోన్న కొత్త కొత్త ఉత్పత్తులు.. వంటి వాటి గురించి తెలుసుకోవడం, అందరికీ తెలియజెప్పడం.. ఇదే నా విధిగా మారిపోయింది. ఎప్పటికైనా సమాజంలో వేళ్లూనుకుపోయిన ఇలాంటి మూఢనమ్మకాల్ని పెకిలించి వేయాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం సోషల్‌ వర్క్‌లో ఎంఏ చేస్తున్నా. అయితే అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తోంది. అది కూడా పట్టణ ప్రాంతాలు, అక్షరాస్యులైన తల్లిదండ్రుల విషయంలో మాత్రమే! కానీ చాలావరకు గ్రామాలు నెలసరిని ఇంకా శాపంగానే భావిస్తున్నాయి. అమ్మాయిలపై లేనిపోని ఆంక్షల్ని విధించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత లోపంతో స్త్రీలను తీవ్ర అనారోగ్యాల బారిన పడేలా చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమాజ ధోరణి మారాలంటే.. నెలసరి అపోహలకు మూలమైన గ్రామాల నుంచే మార్పు రావాలి. నా ముందున్న లక్ష్యమిదే! ఈ క్రమంలోనే సొంతంగా ఓ స్వచ్ఛంద సంస్థ నెలకొల్పాలని సంకల్పించుకున్నా. దాని ద్వారా అందరికీ ఉచితంగా శ్యానిటరీ న్యాప్‌కిన్లు అందించాలన్న ఆలోచన కూడా ఉంది.

ఆఖరుగా ఒక్క మాట.. మీరు కూడా మీ వంతుగా మీ చుట్టూ ఉన్న వాళ్లలో నెలసరి అపోహల్ని తొలగించే ప్రయత్నం చేయండి.. తల్లులు కూడా తమ కూతుళ్లకు చిన్న వయసు నుంచే నెలసరి, తదనంతర పరిణామాలపై అవగాహన పెంచాలి. అలాగే మగ పిల్లలకూ పిరియడ్స్ గురించి పాజిటివ్‌గా చెప్పడం, వాళ్ల ముందు దీని గురించి గుసగుసలాడకపోవడం.. మంచిది. ఇలా ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకున్నప్పుడే శాపమనుకున్న నెలసరి వరమవుతుంది..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని