Updated : 06/08/2021 15:53 IST

అందుకే అమ్మ పాలే అమృతం..!

తల్లి పాలు.. బిడ్డకు అమృత తుల్యం.. తల్లీబిడ్డల మధ్య అనుబంధం బలపడటానికి అమ్మ అందించే పాలే కీలకం. ప్రసవానంతరం గంటలోపు తాగించే మాతృ క్షీరం సంజీవని లాంటిది. వీటినే ముర్రుపాలు (కొలస్ట్రమ్) అంటారు. సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత మూడు నుంచి ఆరు రోజుల వరకూ ఇవి లభిస్తాయి. ఈ పాలు కేవలం ఆకలి తీర్చేవి మాత్రమే కాదు.. బిడ్డకు దీర్ఘాయుష్షునిచ్చే అమృత ధారలు.. అమ్మకు, బిడ్డకు అందం, ఆరోగ్యాన్నందించడం తల్లిపాల ప్రత్యేకత. కానీ చాలామంది రకరకాల అపోహలతో, లేక వివిధ కారణాలతో బిడ్డలను ఆ పాలకు దూరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు తల్లిపాలు ఎంత అవసరం? అసలు పిల్లలకు పాలు ఎలా పట్టాలి? అన్న విషయాలు తెలుసుకుందాం.. అంతే కాదు.. పాలు పట్టడం గురించి ఉన్న అపోహలను కూడా దూరం చేసుకుందాం..

తల్లి పాలకు దూరమవుతున్నారా?

వివిధ కారణాలతో చాలామంది బిడ్డలు ముర్రుపాలకు దూరంగా ఉంటున్నారు. కొద్దిమంది శిశువులకు మాత్రమే గంట లోపు ఇవి అందుతున్నాయి. సాధారణ ప్రసవాల్లో గంటలోపే శిశువుకి ముర్రుపాలు అందినా, సిజేరియన్ ప్రసవాల్లో మాత్రం గంటలోపు అందడం లేదని నిపుణులు చెబుతున్నారు. 24 గంటల్లో 8 నుంచి 10 సార్లు తల్లి నుంచి బిడ్డకు పాలు అందాలి. కనీసం ఆరు నెలల పాటు బిడ్డకు ఇవి తప్పనిసరి.

ఉద్యోగాలు చేసే తల్లుల్లో చాలామంది 3 నెలలకే విధుల్లో చేరిపోతున్నారు. దీంతో తల్లిపాలకు బిడ్డలు దూరంగా ఉంటున్నారు. పోత పాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. శిశువుల్లో ఇవి వూబకాయానికి కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం 69 శాతం మంది మహిళలు బిడ్డకు రెండో నెల కూడా రాకముందే పాలివ్వడం మానేసి పోతపాలు పడుతున్నారని తేలింది. కొద్దిమంది మాత్రం రెండు మూడు నెలల వయసు వరకు, చాలా తక్కువ మంది మాత్రమే నాలుగైదు నెలల వరకు బిడ్డకు పాలిస్తున్నారని చెప్పారు.

ఆవు పాలు మంచివేనా?

దాదాపు వెయ్యేళ్లుగా మన దేశంలో పిల్లలకు ఆవుపాలు పట్టడం అలవాటుగా ఉందని, అయినా అది కూడా ఏమంత సురక్షితం కాదని ఎన్ఐఎన్ తేల్చింది. తల్లి పాలు కాకుండా ఆవు పాలు పట్టడం వల్ల బిడ్డకు అవసరమైన పోషకాలు అంతగా అందకపోవడమే కాకుండా వాటిలో ఉండే అధిక స్థాయి ప్రొటీన్లు నెలలు నిండక ముందే పుట్టే పిల్లల్లోని లేత మూత్రపిండాలకు సరిపడవని నిపుణులు చెబుతున్నారు.

పౌష్టికాహారం తీసుకోవాలి...

పాలిచ్చే తల్లులుకు పౌష్టికాహారం అవసరం. రెండు పూటలా పాలు, ఓట్స్, బాదం, ఆకుకూరలు, గుడ్లతో పాటు మాంసకృతులు ఉండే ఆహారం తీసుకోవాలి. వంటల్లో వెల్లుల్లి ఎక్కువగా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో పాలు ఎక్కువగా వస్తాయి.

 

ప్రయోజనాలెన్నో...

* తల్లిపాలు బాగా తాగిన పిల్లల్లో 10 ఏళ్లు వచ్చే నాటికి చదువుల్లో ఘనంగా రాణిస్తారని వెస్ట్రన్ ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ పరిశోధన బృందం తెలిపింది. వెయ్యి మందిపై సర్వే నిర్వహించగా, మగ పిల్లల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అధ్యయనం పేర్కొంది.

* శిశువు జన్యుపటాన్ని తల్లి పాలు మెరుగుపరుస్తాయని, ప్రొటీన్ల ఉత్పత్తికి దోహదపడతాయని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. నవజాత శిశువుకు తల్లి తొలిసారిగా పట్టే చనుబాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఈ పాలలో ఉండే ప్రొటీన్లే శిశువులకు అమృత తుల్యమవుతాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. దీనికి వారు 'జీన్ ఎక్స్‌ప్రెషన్'గా పేరు పెట్టారు.

* ముర్రుపాలు గంట లోపు ఇవ్వడం వల్ల బిడ్డకు తొలి రోజే విరేచనం అవుతుంది.

* 24 గంటల్లో 8 నుంచి 10 సార్లు బిడ్డకు పాలు తాగించాలి. మొదటిసారి అందే ముర్రుపాలు పోషకాలకు నెలవు.

* భూమ్మీద పడ్డ శిశువు... తల్లి కడుపులో ఉన్నప్పటి మాదిరి రక్షణ లేదని అభద్రతా భావానికి గురవుతుంది. ఆ సమయంలో అమ్మ అందించే స్తన్యం బిడ్డకు ధైర్యాన్ని ఇస్తుంది. తల్లిపాలలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. పుట్టిన వెంటనే తల్లి పాలు బిడ్డకు ఎంత త్వరగా పట్టిస్తే అంత వేగంగా తల్లి గర్భాశయ కండరాలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. బాలింతలని వేధించే అధిక రక్తస్రావ సమస్య అదుపులో ఉంటుంది.

* 100 గ్రాముల తల్లిపాలు సుమారు 65 కిలో కేలరీల శక్తిని అందిస్తాయి. వీటిల్లో విటమిన్లు, క్యాల్షియం, ఇనుము వంటి పలు పోషకాలు ఉంటాయి. బిడ్డ ఎదిగేందుకు ఇవి చాలా అవసరం.

* తల్లిపాలు అందని పిల్లల్లో ఉబ్బస వ్యాధి లక్షణాలు ఎక్కువని గతంలో నెదర్లాండ్స్ నిపుణుల అధ్యయనంలో తేలింది. కనీసం ఆరు నెలలయినా చనుబాలు తాగిన పిల్లల్లో జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులు కనిపించవు.

* నిద్రలో శిశువుల్లో సంభవించే ఆకస్మిక మరణాలని అమ్మ పాలు అడ్డుకుంటాయని వైద్యులు చెబుతున్నారు.

 

పాలు ఎలా ఇవ్వాలి?

* తల్లి రొమ్ముకు శిశువు గడ్డం తాకాలి.

* శిశువు నోరు వెడల్పుగా ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి.

* కింది పెదవి బయటకు వచ్చి ఉండాలి.

* శిశువు ముక్కు ఎదురుగా చనుమొన ఉండేలా జాగ్రత్తగా పడాలి.

* చిన్నారి శరీరాన్ని తల్లి తన శరీరానికి అదుముకోవాలి.

* మెడ, భుజాలు మాత్రమే కాకుండా శిశువు శరీరం మొత్తానికి తల్లి ఆధారం ఇవ్వాలి.

 

 

కొన్ని అపోహలు - వాస్తవాలు

అపోహ: బిడ్డకు పాలిస్తే అందం తగ్గుతుంది...

వాస్తవం: ఇది అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు శరీరంలో పేరుకున్న కొవ్వు నిల్వలు పాలివ్వడం వల్ల క్రమంగా కరిగిపోతాయి. దాంతో పాలిచ్చే తల్లులు కాన్పు తరువాత మూడు నెలల్లోనే సన్నగా, నాజూగ్గా మారి మునుపటి ఆకృతిని సొంతం చేసుకుంటారు. శరీరం మృదువుగా, కాంతివంతంగా కన్పిస్తుంది.అంతేకాదు... బిడ్డకు తగినన్ని పాలివ్వడం వల్ల తల్లికి ఆస్టియోపొరోసిస్, టైప్ 2 మధుమేహం, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ద్వార క్యాన్సర్ వంటి జబ్బుల నుంచి రక్షణ కలుగుతుంది. కొంతమందిలో ప్రసవానంతరం ఎదురయ్యే మానసిక ఆందోళన కూడా తగ్గుముఖం పడుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అపోహ: పోత పాలు తల్లి పాలతో సమానం.

వాస్తవం: ఇది నిజం కాదు. పోత పాలతో పోలిస్తే తల్లి పాలల్లో బిడ్డకు అవసరమయ్యే పోషకాలెన్నో ఉంటాయి. పోత పాలు పట్టిన పిల్లలు బొద్దుగా కనిపించినా... అవి ఆరోగ్యకరం కాదు.

అపోహ: హెచ్ఐవీ పాజిటివ్ రోగులు బిడ్డకు పాలివ్వకూడదు.

వాస్తవం: ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, హెచ్ఐవీ సోకిన తల్లులు పిల్లలకు పాలు ఇవ్వవచ్చు. అయితే గర్భం దాల్చిన 14వ వారం నుంచి వైద్యుల సలహాతో యాంటీ రెట్రో వైరల్ థెరపీ తీసుకోవాలి. దీని వల్ల బిడ్డకు హెచ్ఐవీ సంక్రమించకుండా నివారించవచ్చు. పాలు ఇచ్చినంత కాలం ఈ చికిత్స తీసుకోవాలి.

సందేహం: బాలింతగా ఉన్నప్పుడు, గర్భం దాల్చినప్పుడు మామోగ్రామ్ చేయించకూడదు...

వాస్తవం: నిజమే..ఆ సమయాల్లో స్కానింగ్, మామోగ్రామ్, ఎక్స్‌రే లాంటివి చేయకూడదు. ఆ పరీక్ష నుంచి వచ్చే రేడియేషన్ బిడ్డపై ప్రభావం చూపిస్తుంది. 

 

ఆహ్లాదకరమైన వాతావరణంలో పాలివ్వాలి..

మానసిక ప్రశాంతతతో బిడ్డకు పాలివ్వడం మంచిది. కోపంగా ఉన్నప్పుడు... సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ పాలు ఇవ్వకూడదు. మంచి పౌష్టికాహారం, తీసుకుంటూ ఒత్తిడి లేకుండా ఉంటే పాలు ఎక్కువగా వస్తాయి. పిల్లలకు పాలిస్తే తల్లి మానసిక ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్ కారణంగా చాలామంది తల్లులు నిర్లక్ష్యం చేస్తున్నారు. పాలు ఇచ్చిన తల్లులు నాజూకుగా కనిపిస్తారు.

 

తల్లీ బిడ్డల అనుబంధానికి చిరునామా!

పాలివ్వడం వల్ల తల్లికి బిడ్డకు మధ్య చక్కటి బంధం ఏర్పడుతుంది. రోజుకు 500 కిలో కేలరీలు ఖర్చు అవుతాయి. వెంటనే రుతుక్రమం రాదు..తొందరగా గర్భం దాల్చకుండా సహాయపడి, బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఎక్కువగా ఉంటుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. గుండె సమస్యలు, మధుమేహం, ఎముకలు అరిగిపోవడం లాంటి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. ఉద్యోగాలు చేసే తల్లులు బ్రెస్ట్ పంప్స్ లాంటి సాధనాలతో పాలు తీసి, ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. వాటిని వాడే ముందు గది వాతావరణానికి తీసుకొచ్చి పిల్లలకు పట్టించాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని