చేదు బాల్యం.. విషపు యవ్వనం.. నాకు నేర్పిన జీవితపాఠాలు!

‘తేనెలొలుకు బాల్యం నిత్యనూతన మధుర జ్ఞాపకం’.. కానీ అది ఆమె విషయంలో నిజం కాలేదు. ‘ఉరకలెత్తే యవ్వనం, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కలలు, ఆశల పరంపర’.. అది కూడా ఆమె విషయంలో కలగానే మిగిలిపోయింది. దాంతో కుంగిపోయింది.. వేదనపడింది.. ఆత్మహత్యకు ప్రయత్నించింది.. కానీ ప్రతి పుట్టుకకు ఒక అర్థం, పరమార్థం ఉంటుందన....

Published : 26 Mar 2022 18:32 IST

‘తేనెలొలుకు బాల్యం నిత్యనూతన మధుర జ్ఞాపకం’.. కానీ అది ఆమె విషయంలో నిజం కాలేదు. ‘ఉరకలెత్తే యవ్వనం, భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కలలు, ఆశల పరంపర’.. అది కూడా ఆమె విషయంలో కలగానే మిగిలిపోయింది. దాంతో కుంగిపోయింది.. వేదనపడింది.. ఆత్మహత్యకు ప్రయత్నించింది.. కానీ ప్రతి పుట్టుకకు ఒక అర్థం, పరమార్థం ఉంటుందనే జీవిత సత్యాన్ని కాస్త ఆలస్యంగానైనా గ్రహించిందామె. పడిలేచిన కెరటంలా భవిష్యత్తును గెలిపించుకుంది. ఓడిన జీవితం నుంచి గెలుపు బాటలు పరచుకుని, స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తనలా జీవిత సాగరాన్ని ఈదుతోన్న ఎంతోమందిలో స్ఫూర్తి రగిలించడానికి తన కథను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

హాయ్.. నా పేరు కౌముది. ఆరంభంలోనే వేదాంతం చెబుతుందేంటి అనుకోకండి.. జీవనగమనంలో ఎన్నో దారులు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఆ దారుల్లో పూలపల్లకీలుంటాయి, ముళ్ల బాటలూ మనకు స్వాగతం పలుకుతాయి. ప్రతి ఒక్కరూ అన్నింటినీ ఆహ్వానించాల్సిందే.. చిరునవ్వుతో పలకరించాల్సిందే.. అడ్డంకులకు ఎదురొడ్డి పోరాడాల్సిందే. అదే జీవితం! నేను ఈ జీవిత సత్యాన్ని ఆకళింపు చేసుకున్నాను. నా జీవితంలో ఎదురైన అనుభవాలే ఆ సత్యాన్ని నేను తెలుసుకునేలా చేశాయి. వేలు పట్టి నడిపించాల్సిన నాన్న ప్రేమ, చంకనేసుకుని గోరుముద్దలు తినిపించాల్సిన అమ్మ కురిపించే అమృతత్వం నాకు తీరని స్వప్నాలే!

******

ముంబైలోని ఛాల్‌లో పుట్టి, అక్కడే పెరిగాను. అమ్మ ఒడి, నాన్న బడి అంటారు. కానీ నాకు ఆ రెండూ దూరమే. పరస్త్రీ వ్యామోహంతో నాన్న కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. భార్యంటే ఆయన చెప్పే అర్థం ‘బానిస’ అనే! అమ్మతో ఎప్పుడూ గొడవే. చీటికీ మాటికీ తగువులాడేవాడు. అమ్మను బెల్టుతో కొట్టడం కూడా చూశాను. ఒక భార్యగా, తల్లిగా అమ్మ అన్నీ భరించింది. కానీ ఒకానొక స్థితిలో.. ఆలోచన క్షీణించిన ఆ క్షణంలో అమ్మ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తనతో పాటు నన్ను కూడా బీచ్‌కి తీసుకెళ్లింది. తన జీవితంతో పాటు నా జీవితాన్ని కూడా అంతం చేయాలనుకుంది. ఆవేశంలో చేసే పనులు విజ్ఞతకు, ఆలోచనకు తావివ్వవు. ఒక్క క్షణం.. ఒకే ఒక్క క్షణం జీవితాన్ని ఎందుకు అంతం చేసుకోవాలో ఆలోచించగలిగితే.. ఆ క్షణం మనది. ఆ జీవితం మనది. అమ్మ కూడా అదే చేసింది. ఆత్మహత్యాప్రయత్నాన్ని విరమించుకొని ఇద్దరం తిరిగి ఇంటికి వచ్చేశాం. ఆ ఒక్క క్షణం అమ్మ మనసులో మరో ఆలోచన రాకపోయి ఉంటే ప్రస్తుతం నేననే ఉనికి లేనే లేదు. అందుకే అమ్మంటే నాకంత ఇష్టం, గౌరవం!

ఆత్మహత్యను విరమించుకొని అమ్మ, నేను ఇంటికి చేరుకున్న తర్వాత కూడా కుటుంబ పరిస్థితి ఏమాత్రం మారలేదు. నాన్నది అదే ధోరణి.. మళ్లీ ఇంట్లో గొడవలు, పెడబొబ్బలు.. అమ్మ కన్నీళ్లకు అడ్డుకట్ట పడలేదు. కాలం ఎవరి కోసం ఆగదు.. ఎన్ని సమస్యలున్నా జీవితాన్ని ముందుకు నడిపించాల్సిందే..! ఇలాంటి పరిస్థితుల్లోనే నేను మా ఇంటికి దగ్గర్లోని ఓ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్ విభాగంలో చేరాను. నవయవ్వనం.. ఎటుచూసినా ఉత్తేజం, ఉల్లాసం.. ఆకర్షణలకు లోనయ్యే వయసు.. అసలే సమస్యల వలయంలో సతమతమవుతోన్న నాకు కాస్త వూరట కలిగింది కాలేజీలోనే! అదీ వరుణ్ తొలి పరిచయంలోనే! తను కూడా సేమ్ బ్రాంచ్. వరుణ్ నాకు ఏ ముహూర్తాన పరిచయమయ్యాడో కానీ తనను కలిశాకే జీవితంలో దుఃఖమే కాదు.. సంతోషమూ ఉంటుందని తెలుసుకున్నా.

******

అతనితో మాట్లాడుతున్న కొద్దీ ఇంకా ఇంకా మాట్లాడాలనిపించేది.. అసలు ఇంటికే వెళ్లాలనిపించేది కాదు. ఇలా కొన్ని రోజుల్లోనే వరుణ్ నా మనసంతా నిండిపోయాడు. అప్పుడే అది ప్రేమని తెలుసుకున్నా. నా మనసులోనైతే వరుణ్ ఉన్నాడు.. మరి వరుణ్ మనసులో నేనున్నానా? అదే తెలుసుకునే ప్రయత్నం చేశా. ఈ క్రమంలోనే ఓ రోజు పార్క్‌కి రమ్మన్నా. తను ఒప్పుకున్నట్లు, తనతో పెళ్త్లె జీవితాంతం హ్యాపీగా ఉన్నట్లు.. ఇలా ఎన్నో ఆశలతో నా మనసులోని ప్రేమను తన ముందుంచా.. అప్పటిదాకా ఎంతో సంతోషంతో గాల్లో తేలుతున్న నేను.. వరుణ్ మాటతో ఒక్కసారిగా అధఃపాతాళానికి పడిపోయినట్లుగా అనిపించింది.. నా కలలన్నీ కల్లలయ్యాయి.. ఆశలన్నీ అడియాశలయ్యాయి.. ఇంతకీ వరుణ్ చెప్పిన మాటేంటో తెలుసా? ‘సారీ.. నేను ఇప్పటికే మా మరదలిని ప్రేమిస్తున్నా.. చదువు పూర్తయ్యాక ఆమెతోనే నా పెళ్లి..’ అనడంతో అక్కడికక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోయా.

ఆ క్షణం నా తలపులు, వలపులు అన్నీ గాల్లో కలిసిపోయాయి. అందరూ ఉండి కూడా ఒంటరిదాన్ననే ఫీలింగ్‌తో బతుకుతోన్న నాకు ఆ క్షణం మానసికంగా కూడా ఒంటరినయ్యాననిపించింది. ఆ వేదనతోనే ఇంటికి చేరిన నాకు.. ఒక రోకలిపోటుపై మరో రోకలి పోటు అన్నట్లుగా అమ్మ విషయంలో నాన్నతో పెద్ద యుద్ధమే చేశాను. మరింత కుదేలయ్యాను. బాధను పంచుకునే తోడు లేదు. ఆసరానిచ్చే చేయి లేదు. దాంతో ఇక బతకడం అనవసరం అనిపించింది. ‘నేను ఎవరికోసం బతకాలి, ఎందుకు బతకాలి’ అనే ఆలోచనలతో నా మనసు ఉక్కిరిబిక్కిరైంది. చనిపోవాలనుకున్నాను.. ఆ రోజు మా అమ్మ చేసిన పనే నేనూ చేశాను.. అయితే ఆఖరి క్షణంలో అమ్మ తీసుకున్న నిర్ణయం నన్ను బతికిస్తే.. ఈ రోజు మాత్రం చనిపోవాలన్న ఆలోచన తప్ప నా మనసులోకి మరే ఆలోచన తొంగిచూడలేదు. ఆవేశంలో విషం తాగేశాను.

ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. పుట్టుక, చావు.. ఈ రెండూ మన చేతుల్లో లేవన్నట్టుగా.. హాస్పిటల్ మంచం మీద కళ్లు తెరిచాను. ఐసీయూలో నాలుగు రోజులున్నాను. అప్పుడు నాన్న నన్ను చూడడానికి హాస్పిటల్‌కి రావడంతో అది కలా? నిజమా? అనిపించింది. ఆ క్షణం నాన్న ఒకే ఒక్క మాట చెప్పాడు. ‘నిజంగా నువ్వు చనిపోవాలనుకుంటే, ఇంకాస్త బెటర్‌గా ఆలోచించి ఉండాల్సింది’ అని! నాన్న చెప్పిన ఈ మాటలు నా కళ్లు తెరిపించాయి.. అప్పుడర్థమైంది ‘ఎవరి జీవితం వారిది. అది వారి గుప్పిట్లోనే ఉండాలి. ఎవరి కోసమూ జీవన పయనం ఆపకూడదు’ అని!

వారం తరువాత హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాను. ఆ సంఘటనతో నాకున్న స్నేహితులు కూడా దూరమయ్యారు. నాలాంటి ఆలోచనారహిత, బలహీన మనస్కురాలితో ఎవరు స్నేహం చేస్తారు చెప్పండి. ప్రతి ఒక్కరూ నావైపు చూసే చూపు.. నేనేంటో నాకు తెలిసేలా చేసింది. నేను చేసిన ఆత్మహత్యా ప్రయత్నం.. నాకు జీవితంలోని మరో దారిని చూపించింది. కౌన్సెలింగ్‌కి వెళ్లాను. మందులు వాడాను. మానసికంగా దృఢంగా తయారయ్యాను. జీవితాన్ని ఎలా చూడాలో నేర్చుకున్నాను. ఎలా నెగ్గుకు రావాలో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇప్పుడు ప్రపంచాన్ని చూసే నా దృక్కోణంలో పూర్తిగా మార్పు వచ్చింది. దాంతో నేను మా అమ్మను తీసుకుని, నాన్నకు దూరంగా వచ్చేశాను. అందుకు నాకేం బెంగ లేదు. ఇప్పుడు ఎవరి గురించీ ఆలోచన లేదు. నా గురించి ఎవరో ఏదో అనుకుంటారన్న చింత లేదు. నేను చేసిన దానికి సిగ్గుపడడం లేదు. అదొక జీవితానుభవం అంతే.

నా భవిష్యత్తుపై దృష్టి సారించాను. జర్నలిజంలో మాస్టర్స్ చేసి ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. అలాగే కొత్తగా నేనొక స్వచ్ఛంద సంస్థ కూడా నెలకొల్పాను. దీని ద్వారా మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న వారిలో అవగాహన కల్పిస్తున్నా. కొంతమందితో కలిసి చిన్న చిన్న సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నాను. గతం గతః! కానీ నేనెప్పుడూ నా గతాన్ని మర్చిపోలేదు. అది అప్పుడప్పుడు నా హృదయపు తలుపులు తడుతూనే ఉంటుంది. నన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. జీవితం మనం గీసుకునే గీత. దాన్ని పొడిగించుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచన, ఆత్మపరిశీలన జీవితాన్ని మరో దారిలోకి, మనం చేరాలనుకున్న దారిలోకి చేర్చుతుంది. నేను అనుభవపూర్వకంగా గ్రహించిన విషయమిది. మీ అందరికీ చెప్పాలనుకున్న విషయం కూడా ఇదే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్