ప్రేమ మైకంలో కూరుకుపోయా.. కట్టుకున్నవాడికే దూరమయ్యా..

కన్న తల్లిదండ్రులనే పట్టించుకోని ఈ రోజుల్లో పిల్లనిచ్చిన అత్తామామలను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకునే మగవాళ్లు ఎంతమందుంటారు? మిగతా వాళ్ల గురించి నాకు తెలీదు కానీ.. మా ఆయన మాత్రం దేవుడు! మా పేరెంట్స్ విషయంలో ఆయన కన్న కొడుక్కన్నా ఎక్కువగా వ్యవహరించారు.

Published : 19 Aug 2021 20:41 IST

కన్న తల్లిదండ్రులనే పట్టించుకోని ఈ రోజుల్లో పిల్లనిచ్చిన అత్తామామలను తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకునే మగవాళ్లు ఎంతమందుంటారు? మిగతా వాళ్ల గురించి నాకు తెలీదు కానీ.. మా ఆయన మాత్రం దేవుడు! మా పేరెంట్స్ విషయంలో ఆయన కన్న కొడుక్కన్నా ఎక్కువగా వ్యవహరించారు. అయితే అలాంటి భర్తకు తోడూనీడగా నిలవాల్సిన నేనే ఆయన్ని అసహ్యించుకున్నాను... శత్రువుగా భావించాను. మరో వ్యక్తితో ప్రేమ మైకంలో పడి చేజేతులారా జీవితాన్ని నాశనం చేసుకోబోయాను.. ఏమిటా కథ అంటారా..??

నా పేరు అపర్ణ. అమ్మానాన్నలకు నేను, అక్క ఇద్దరమే సంతానం. ఆయన ఓ మిల్లులో పనిచేసేవారు. డిగ్రీలో ఉండగా నేను నా క్లాస్‌మేట్ రవిని ప్రేమించాను. ఇది తెలియని అమ్మానాన్న నాకో పెళ్లి సంబంధం తీసుకువచ్చారు. అక్క పెళ్లిలో నన్ను చూసిన ఆయన కట్నం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవడమే కాక పెళ్లి ఖర్చులూ తానే భరిస్తానని చెప్పడంతో నాన్న ఒప్పుకున్నారు. రవితో జరిగిన విషయం చెప్పి వెంటనే మా ఇంట్లో వాళ్లతో మా పెళ్లి గురించి మాట్లాడమని, లేదంటే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకోమని చెప్పాను. రెండిటికీ కాదన్న రవి తానింకా చదవాల్సింది చాలా ఉందని, మా ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు ఇప్పుడే ఒప్పుకునే వీల్లేదని, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోమని నాకు సర్దిచెప్పాడు. దాంతో చేసేదేం లేక ఆ పెళ్లికి తలవంచాను.

పెళ్లాయ్యాక నా భర్తకు దూరంగానే ఉండేదాన్ని. రెండుమూడుసార్లు దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తే గట్టిగా అడ్డు చెప్పడంతో ఆ తర్వాత ఆయన ఆ ప్రయత్నం చేయలేదు. నా మనసులో ఉండే సంకోచాలన్నీ తొలగిపోయి నా అంతట నేనే మారతాననుకున్నారేమో- ఆ విషయం గురించి బలవంతం చేయలేదు. నెలనెలా ఆయనిచ్చే డబ్బుతో నా ఫ్రెండ్స్‌తో పాటు సినిమాలకు, షికార్లకు తిరిగేదాన్ని. కొంతకాలానికి నాన్న పనిచేసే మిల్లులో అగ్నిప్రమాదం జరగడంతో నాన్న ఉద్యోగం పోయింది. ఖాళీగా ఉండటంతో తిండికి కూడా కష్టంగా మారింది. నేను ఈ విషయాలేవీ పట్టించుకోలేదు. నాకిష్టంలేని పెళ్లి చేసి నా గొంతు కోసారన్న అక్కసుతో వారి గురించి ఆలోచించడమే మానేశాను. మా ఆయనే కొంతకాలం వాళ్లకు ఆర్థిక సాయం చేశారు. తర్వాత నాన్నతో చిన్న వ్యాపారం పెట్టించారు. ఈ సమస్య తీరింది అనుకునేలోపే అమ్మకు అనారోగ్యం. ఆయన వాళ్లకు చేయించిన బీమా ద్వారా కేవలం ఏడు లక్షలే వచ్చాయి. అమ్మ ఆపరేషన్‌కు కనీసం పదిలక్షలు కావాలి. ఈయన ఏమాత్రం వెనకాడకుండా తన ఎకౌంట్‌లో దాచుకున్న మూడు లక్షలు పెట్టి అమ్మకు ఆపరేషన్ చేయించారు. వేరేవాళ్లెవరైనా ఆ పరిస్థితుల్లో ఉంటే, ఆయన మంచితనానికి వాళ్ల మనసు మారేదేమో, కానీ నా మనసు మాత్రం కరగలేదు.

*****

అమ్మ ఆపరేషన్‌కు అంత ఖర్చు పెట్టారని తెలిసి మా అత్తయ్య సూటిపోటి మాటలు అనడం ప్రారంభించింది. దీంతో ఓ రోజు గొడవ పెట్టుకున్నా. 'కావాలంటే నేను పని చేసి మీ డబ్బు మీకు తిరిగి తెచ్చిస్తా' అన్నా. దానికి ఆవిడ 'సరే చూస్తాను అసలు ఇవ్వగలవో.. లేదో..' అనేసరికి ఉక్రోషం పొడుచుకొచ్చింది. వెంటనే ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాను. నేను చేసింది కేవలం డిగ్రీ. దానికి వచ్చే ఉద్యోగాలన్నీ తక్కువ జీతం వచ్చేవే. దాంతో ఆయన నన్ను పీజీ చేసి ఆ తర్వాత ఉద్యోగం చేయమని ప్రోత్సహించారు. మా అత్తగారు దీనికి ఒప్పుకోవడంతో నేను పీజీ చేశాను. తర్వాత ఆయన తన ఫ్రెండ్‌కి తెలిసిన ఓ మంచి కంపెనీలో ఉద్యోగంలో చేర్పించారు.

నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఇంతకాలం నన్ను కాదనుకున్న రవి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమంటూ నా వెంట తిరిగాడు. ఎంతో సంతోషించాను. ఈ నరకం నుంచి వెళ్లిపోయే దారి దొరికిందని, స్వేచ్ఛగా బతికే రోజు వస్తుందని ఆశతో ఎదురుచూశాను. రవి నేను అప్పుడప్పుడూ కలుసుకునే వాళ్లం. కలిసినప్పుడల్లా కొంత డబ్బిచ్చేదాన్ని. కొంతకాలం తర్వాత రవి బైక్ మీద ఓ అమ్మాయితో వెళ్లడం చూశాను. ఎవరని అడిగితే బంధువని చెప్పాడు. నేను నమ్మాను. కానీ నా స్నేహితుల ద్వారా తెలిసింది ఆ అమ్మాయి రవి బంధువు కాదని, అతను ప్రేమించే అమ్మాయని. నమ్మలేకపోయాను. అసలు విషయమేంటని రవిని నిలదీశాను. తను ఏమాత్రం సంకోచం లేకుండా ఒప్పుకున్నాడు. ఇన్ని రోజులూ నా డబ్బు కోసమే నా వెంట తిరిగానని, లేకపోతే పెళ్త్లెనదాంతో నాకేంటి పని అంటూ మాట్లాడాడు. నా గుండె పగిలినంత పనైంది. వెనక్కి తిరిగి వెళ్లిపోతున్న నాకు అతడో ఆఫర్ ఇచ్చాడు. ఎలాగూ నాకు పెళ్త్లెపోయింది కాబట్టి తనను కేవలం ఓ బాయ్‌ఫ్రెండ్‌లా చూడమని, ఏ అవసరాలున్నా తీరుస్తానని చెప్పుకొచ్చాడు. చెంప పగలగొట్టి ఇంటికొచ్చేశా.

ఇలాంటి వాడికోసమా.. ఇన్ని రోజులూ దేవుడిలాంటి నా భర్తను అసహ్యించుకున్నాను. దూరంగా ఉంచాను. ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నాను. కానీ, ఈ విషయం ఆయనకెలా చెప్పను? ఎప్పటికీ చెప్పలేను.. కానీ తప్పు చేశానన్న అపరాధ భావం గుండెల్ని పిండేస్తోంది. కనీసం ఇలాగైనా పంచుకుంటే నా బాధ తగ్గుతుందని భావిస్తున్నా... కేవలం డబ్బుకు ఆశపడే వ్యక్తి కోసం ఇన్నాళ్లూ మిమ్మల్ని బాధపెట్టాను. నన్ను క్షమించండి. మీకు నేనంటే ఎంతిష్టమో నాకు తెలుసు. నా తప్పును క్షమించి మీ గుండెల్లోనే కాక మీ జీవితంలోనూ నాకింత చోటివ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...

- అపర్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్