Published : 12/04/2022 16:26 IST

ఎప్పుడూ కలవని వ్యక్తితో ప్రేమలో పడ్డా!

(Photos: Instagram)

అమ్మ కావాలన్న ఆరాటం నిలకడగా ఉండనివ్వదు. ఇక ఆ శుభఘడియ త్వరలోనే ఆసన్నమవుతుందని తెలిసిన మరుక్షణం ఆమె ఆనందానికి అవధులుండవంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఇలాంటి సంతోషంలోనే మునిగి తేలుతోంది బాపూ బొమ్మ ప్రణీత. త్వరలోనే తాను అమ్మ కాబోతున్నానంటూ తాజాగా సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టిందీ టాలీవుడ్‌ అందం. అంతేకాదు.. తన ప్రెగ్నెన్సీ గురించి వైవిధ్యంగా ప్రకటించి మరోసారి అభిమానుల మనసు దోచుకుందీ కాబోయే అమ్మ.

ప్రెగ్నెన్సీ గురించి అందరితో పంచుకోవడానికి ఒక్కొక్కరూ ఒక్కో పద్ధతిని పాటిస్తుంటారు. మరికొందరు ఈ విషయంలో ఇంకాస్త కొత్తగా ఆలోచించి.. ఈ శుభవార్తను వైవిధ్యంగా చెప్పాలనుకుంటారు. ప్రణీత కూడా అదే చేసింది. తాను, తన భర్త నితిన్‌ రాజు త్వరలోనే తల్లిదండ్రులం కాబోతున్నామంటూ అభిమానులకు తనదైన రీతిలో గుడ్‌న్యూస్ చెప్పిందీ అందాల తార.

ఇది దేవతల వరం!

గతేడాది మేలో తన స్నేహితుడు, ఇష్టసఖుడు నితిన్‌ రాజుతో ఏడడుగులు నడిచింది ప్రణీత. కుటుంబ సభ్యుల సమక్షంలో అతి నిరాడంబరంగా జరిగిన తమ వివాహానికి సంబంధించిన ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి తమ పెళ్లి విషయం చెప్పిన ఈ బాపూ బొమ్మ.. తాను త్వరలోనే తల్లి కాబోతున్నానంటూ తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలోనే అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, పాజిటివ్‌ ఫలితం వచ్చిన ప్రెగ్నెన్సీ కిట్‌ ఫొటోల్ని పోస్ట్ చేస్తూ.. తన భర్తతో కలిసి వైవిధ్యంగా ఈ విషయం చెప్పింది ప్రణీత. ‘మా ఆయన 34వ పుట్టినరోజు సందర్భంగా.. ఆ దేవతలు మాకు ఓ గొప్ప బహుమతి ఇచ్చారు..’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. త్వరలోనే అమ్మతనంలోకి అడుగుపెట్టబోతోన్న ప్రణీతకు అటు సెలబ్రిటీలు, ఇటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అంతకంటే ముందు మరో పోస్ట్‌లో భాగంగా.. ‘ఎప్పుడూ కలవని వ్యక్తితో మీరెప్పుడైనా ప్రేమలో పడ్డారా?’ అంటూ తన ప్రెగ్నెన్సీ గురించి హింట్‌ ఇచ్చిందీ కాబోయే అమ్మ.

చాక్లెట్స్‌ బాగా తింటున్నా!

గర్భం ధరించిన సమయంలో వివిధ రకాల ఆహారపు కోరికలు కలగడం సహజం. ఆ మాటకొస్తే.. తాను చాక్లెట్స్‌, ఐస్‌క్రీమ్స్‌ ఎక్కువగా లాగించేస్తున్నానంటోంది ప్రణీత. ‘తల్లి కాబోతున్నానన్న సంతోషం నన్ను నిలవనివ్వడం లేదు.. ప్రస్తుతం రాజ్‌ కూడా ఇదే ఆనందంలో మునిగిపోయాడు. నిజానికి మేము ప్రేమలో ఉన్నప్పుడే పిల్లల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఇక ఇప్పుడు ఇద్దరం ముగ్గురం కాబోతున్నామని తెలిసే సరికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. ఏదేమైనా జీవితంలో ఇదో మధుర క్షణం. మా చిన్నారిని చేతుల్లోకి తీసుకోబోయే క్షణం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతానికైతే చాక్లెట్స్‌ విపరీతంగా తింటున్నా. రాజ్‌తో లేట్‌నైట్‌ డ్రైవ్స్‌కి వెళ్లినప్పుడల్లా ఐస్‌క్రీమ్స్‌ లాగించేస్తున్నా. మా అమ్మ గైనకాలజిస్ట్‌. ప్రెగ్నెన్సీ విషయంలో నాకు బోలెడన్ని సలహాలిస్తోంది. మరోవైపు స్నేహితులు/సన్నిహితులు, ఇతర కుటుంబ సభ్యుల నుంచీ ఈ తరహా సలహాలు అందుతున్నాయి..’ అంటూ తన ప్రెగ్నెన్సీ సంగతుల్ని ఓ సందర్భంలో పంచుకుందీ చక్కనమ్మ.

నటిగా విభిన్న భాషా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రణీత.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి తన మంచి మనసును చాటుకుంది. ‘ప్రణీత ఫౌండేషన్‌’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి ఆ వేదికగా ప్రస్తుతం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని