ఎవరేమనుకున్నా, ఎవరెలా చూసినా.. అమ్మగా అది మన హక్కు!

చంటి బిడ్డ ఆకలి తీర్చడం తల్లి ప్రథమ కర్తవ్యం.. అది ఎక్కడైనా, ఎప్పుడైనా సరే?! అయితే ఈ విషయంలో చాలామంది అమ్మలు వెనకబడే ఉన్నారని చెప్పాలి. ఇంట్లో నాలుగ్గోడల మధ్య స్వేచ్ఛగా తన చిన్నారికి పాలిచ్చే తల్లులు.. నలుగురిలోకి వచ్చేసరికి మాత్రం మొహమాటపడుతున్నారు. చుట్టూ ఉన్న వాళ్ల వెకిలి చూపులు వాళ్లను ఇబ్బందికి గురి చేయడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి. అయితే ఎవరేమనుకున్నా, ఎవరెలాంటి దృష్టితో చూసినా ఇంటా బయటా తల్లులు చిన్నారులకు పాలివ్వడానికి అస్సలు వెనకాడకూదని చెబుతున్నారు కొందరు తారామణులు.

Updated : 03 Aug 2021 19:09 IST

(Photo: Instagram)

చంటి బిడ్డ ఆకలి తీర్చడం తల్లి ప్రథమ కర్తవ్యం.. అది ఎక్కడైనా, ఎప్పుడైనా సరే?! అయితే ఈ విషయంలో చాలామంది అమ్మలు వెనకబడే ఉన్నారని చెప్పాలి. ఇంట్లో నాలుగ్గోడల మధ్య స్వేచ్ఛగా తన చిన్నారికి పాలిచ్చే తల్లులు.. నలుగురిలోకి వచ్చేసరికి మాత్రం మొహమాటపడుతున్నారు. చుట్టూ ఉన్న వాళ్ల వెకిలి చూపులు వాళ్లను ఇబ్బందికి గురి చేయడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పాలి. అయితే ఎవరేమనుకున్నా, ఎవరెలాంటి దృష్టితో చూసినా ఇంటా బయటా తల్లులు చిన్నారులకు పాలివ్వడానికి అస్సలు వెనకాడకూదని చెబుతున్నారు కొందరు తారామణులు. కేవలం చెప్పడమే కాదు.. చేసి చూపించారు కూడా! తల్లిపాలు పట్టడమనేది మన హక్కు.. అందరూ దాన్ని ప్రోత్సహించాలే తప్ప నిరుత్సాహపరచకూడదనే స్ఫూర్తిదాయక సందేశంతో అందరిలో ప్రేరణ నింపుతున్నారు. ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవాల (ఆగస్టు 1-7)’ సందర్భంగా తమ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ స్టోరీస్‌తో నేటి తల్లుల్లో స్ఫూర్తి రగిలిస్తోన్న అందాల తారలెవరో తెలుసుకుందాం..

వాళ్ల మనసులు మార్చాలి!

బిడ్డకు పాలివ్వగలగడం అనేది మహిళలందరికీ దక్కిన గొప్ప వరం. అలాంటిది బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడాన్ని చాలామంది తల్లులు తామేదో తప్పు చేసినట్లుగా భావిస్తున్నారంటోంది అందాల తార అనితా హస్సానందాని. ముఖ్యంగా పల్లెటూళ్లు, చిన్న నగరాల్లో ఉండే మహిళలు ఈ విషయం పట్ల సిగ్గుపడుతున్నారని, వాళ్ల మనసులో ఉన్న ఆ భావనను మార్చడం మనందరి చేతుల్లోనే ఉందంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరవ్‌ అనే బాబుకు జన్మనిచ్చి అమ్మతనాన్ని పొందిన ఈ బ్యూటిఫుల్‌ మామ్‌.. బహిరంగ ప్రదేశాల్లో తన కొడుక్కి పాలిచ్చే విషయంలో తాను మాత్రం అస్సలు మొహమాటపడనంటోంది.

‘బ్రెస్ట్‌ ఫీడింగ్‌ అనేది చాలా సాధారణమైన ప్రక్రియ. అది ఇంకా సాధారణం కావాలి.. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మనం దీని గురించి బహిరంగంగా మాట్లాడుతున్నామంటే నిజంగా అది సానుకూల మార్పే అని చెప్పాలి. అయితే కొన్ని చిన్న చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో బిడ్డకు పాలివ్వడాన్ని మహిళలు తప్పుగా భావిస్తున్నారు. అలాంటి వాళ్ల ఆలోచనల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం మనందరిపై ఉంది. ఎక్కడున్నాం, ఎవరి మధ్య ఉన్నాం.. అనే విషయాన్ని పట్టించుకోకుండా బిడ్డకు ఆకలేసినప్పుడల్లా పాలివ్వడం అనేది మన హక్కు అనే విషయంలో అవగాహన పెంచాలి. ఓ తల్లిగా ఈ విషయంలో నేనస్సలు మొహమాటపడను. ఎక్కడున్నా పాలిచ్చి నా బిడ్డ ఆకలి తీర్చడానికే ప్రయత్నిస్తా. ఎందుకంటే నాకు నా బిడ్డే ముఖ్యం..’ అంటోంది అనిత.


ఆ దృష్టితో చూడడమెందుకు?!

రక్తాన్ని పాలుగా మార్చి బిడ్డ ఆకలి తీర్చే స్తనాలను లైంగిక దృష్టితో చూడడమెందుకు అని ప్రశ్నిస్తోంది బాలీవుడ్‌ టీవీ తార ఏక్తా కౌల్‌. ఈ కారణంతోనే మహిళలు బహిరంగ ప్రదేశాల్లో బిడ్డకు పాలివ్వడానికి ముందుకు రావట్లేదంటోంది. వేద్‌ అనే ఏడాది కొడుక్కి తల్లైన ఆమె.. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా తన చిన్నారికి పాలివ్వడం మాత్రం మరవనంటోంది. ఈ క్రమంలోనే తన కొడుక్కి పాలిస్తోన్న ఫొటోని ఇన్‌స్టాలో పంచుకుంటూ అమ్మలందరిలో స్ఫూర్తి నింపే ఓ లవ్లీ పోస్ట్‌ పెట్టింది ఏక్తా.
‘తల్లి బిడ్డకు పాలివ్వడమనేది ఈ సృష్టిలో అతి సాధారణమైన విషయం. ఇలాంటి సాధారణ విషయాలే వార్తల్లో సెన్సేషన్‌ ఎందుకవుతాయో నాకిప్పటికీ అర్థం కాదు. ఒక తల్లి నలుగురిలో బిడ్డకు పాలిస్తున్నప్పుడు బిడ్డను వదిలేసి ఆమె స్తనాల వైపే అందరి చూపూ పడుతుంది. ఈ దృష్టి వల్లే మహిళలు సౌకర్యవంతంగా పాలివ్వలేకపోతున్నారు. అందుకే అలాంటి ఆలోచనను ప్రతి ఒక్కరూ మార్చుకోవాలి. ఇక ఎక్కడైనా, ఎప్పుడైనా బిడ్డకు పాలివ్వడమనేది మన హక్కు అని ప్రతి తల్లీ తెలుసుకోగలగాలి.. చుట్టూ ఉన్న వాళ్లు తల్లి పాలివ్వడాన్ని ప్రోత్సహించాలి. అప్పుడే ఈ విషయంలో అందరి ఆలోచనలు ఒక్కతాటిపైకి వస్తాయి..’ అంటోందీ లవ్లీ మామ్.


ముందు ప్రవర్తన మారాలి!

సమాజంలో పాతుకుపోయిన మూసధోరణుల వల్లే బహిరంగ ప్రదేశాల్లో తల్లులు తమ బిడ్డలకు సౌకర్యవంతంగా పాలివ్వలేకపోతున్నారంటోంది బాలీవుడ్‌ న్యూమామ్‌ దియా మీర్జా. ఇలాంటి వివక్షను అంతమొందించడానికి కొన్ని దేశాల్లో చట్టాలున్నాయని గుర్తు చేసింది. అయితే మన దేశంలో పాలిచ్చే తల్లుల్ని చూసే దృష్టి కోణంలో మార్పొస్తే ఇలాంటి మూసధోరణుల్ని, వివక్షను తరిమికొట్టడం పెద్ద కష్టమేమీ కాదంటోందీ నేచర్‌ బ్యూటీ. ఈ ఏడాది మేలో ముద్దుల బాబుకు జన్మనిచ్చిన ఈ అందాల తార.. ఓ అమ్మగా తనకెదురవుతోన్న మధురానుభూతుల్ని ఎప్పటికప్పుడు పంచుకుంటోంది.

‘తల్లయ్యాక బ్రెస్ట్ ఫీడింగ్‌ ప్రాధాన్యాన్ని, ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్ల గురించి తెలుసుకుంటున్నా. అయితే చాలామంది తల్లులు సమాజం చూసే దృష్టి కోణానికి తలొగ్గి బహిరంగ ప్రదేశాల్లో తమ చిన్నారికి పాలివ్వడాన్ని అసౌకర్యంగా భావిస్తున్నారు. ఇలాంటి వివక్షను, మూసధోరణుల్ని బద్దలు కొట్టడానికి కొన్ని దేశాల్లో ప్రత్యేక చట్టాలున్నాయి. బయటి ప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని బెల్జియం చట్టబద్ధం చేసింది.. అదే యూరోపియన్‌ యూనియన్‌ చట్టాల ప్రకారం.. పాలిచ్చే తల్లులకు ఎలాంటి వివక్ష ఎదురైనా అది చట్టరీత్యా నేరం. నిజానికి ఇలాంటి చట్టాలు మన దగ్గర అమలు చేస్తే మార్పొస్తుందంటారా? అయితే అంతకంటే ముందు మన సమాజం దృష్టి కోణం, ప్రవర్తన మారాలి. ప్రతిసారీ బహిరంగ ప్రదేశాల్లో తల్లి పాలివ్వడం గురించి చర్చించడం మాని దీన్ని సర్వసాధారణమైన విషయంగా పరిగణించాలి. అప్పుడే ఈ విషయంపై ఉన్న మూసధోరణులు, అపోహలు తొలగిపోతాయి..’ అంటూ తనదైన సందేశంతో అందరిలో స్ఫూర్తి నింపింది.


కుటుంబం నుంచి ఆ సపోర్ట్‌ కావాలి!

బహిరంగ ప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని కొన్ని కుటుంబాలు కూడా తప్పుగా భావిస్తున్నాయంటోంది అందాల తార అమృతా రావ్‌. గతేడాది నవంబర్‌లో వీర్‌ అనే చిన్నారికి జన్మనిచ్చిన ఈ క్యూట్‌ మామ్‌.. అమ్మగా తనకు ప్రతి రోజూ ఓ కొత్త అనుభూతిని పంచుతుందంటోంది.

‘ఎన్ని తరాలు గడిచినా బహిరంగ ప్రదేశాల్లో తల్లి తన బిడ్డకు పాలివ్వడం అనేది చర్చనీయాంశంగానే మారుతోంది. ఇందుకు.. కొన్ని కుటుంబాల నుంచి ఆయా తల్లులకు ఎదురయ్యే వివక్ష కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని! ఎందుకంటే నా పుట్టింట్లో, అత్తింట్లో బ్రెస్ట్ ఫీడింగ్‌ అనేది సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా ఈ విషయంలో మా అత్తయ్యకు థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. ఎందుకంటే నలుగురిలో బిడ్డ ఆకలి తీర్చడానికి మొహమాటపడడమెందుకు అని నేను ఉన్న చోటే సౌకర్యవంతంగా పాలిచ్చేలా నన్ను ప్రోత్సహిస్తుంటారావిడ. ఇలా ప్రతి కుటుంబం ఈ విషయంలో కొత్తగా తల్లైన మహిళలకు అండగా నిలిస్తే సమాజంలో తప్పకుండా మార్పొస్తుంది..’ అంటూ తనదైన రీతిలో బహిరంగ ప్రదేశాల్లో తల్లి పాల ప్రాధాన్యాన్ని తెలిపింది అమృత.


విమర్శలొద్దు.. వీలైతే అవగాహన పెంచండి!

పాలిచ్చే క్రమంలో తల్లులు ఎదుర్కొనే సవాళ్లేంటో పట్టించుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడాన్ని మాత్రం చెడు దృష్టితో చూస్తుంటారని, విమర్శలు గుప్పిస్తుంటారని అంటోంది బాలీవుడ్‌ లవ్లీ మామ్‌ నేహా ధూపియా. ఇలా అనవసరంగా మరొకర్ని నిందించడం మాని వీలైతే ఈ విషయంలో అందరిలో అవగాహన పెంచడం ఉత్తమం అంటోంది. 2018లో మెహ్ర్‌ అనే ముద్దుల పాపకు జన్మనిచ్చిన నేహ.. ఇప్పుడు మరోసారి తల్లి కాబోతోంది.

‘కొత్తగా తల్లైన మహిళలకు ఎదురయ్యే అనుభవాలేంటో, ఈ క్రమంలో ప్రతికూలతల్ని తట్టుకుంటూ ఎలా ముందుకెళ్లాలో వారికి మాత్రమే తెలుసు! అమ్మతనం అనేది ఓ గొప్ప బాధ్యత. ఎన్నో భావోద్వేగాలు ఇందులో మిళితమై ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకొని ముందుకు సాగడమంటే సవాలే! ఇది అర్థం చేసుకోకుండా కొంతమంది ఎవరికిష్టమొచ్చినట్లు వాళ్లు మాట్లాడుతుంటారు. బ్రెస్ట్ ఫీడింగ్‌ విషయంలో విమర్శలు గుప్పిస్తుంటారు. వారు చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇది అస్సలు కరక్ట్‌ కాదు. ఇలాంటి విమర్శలు నేనూ ఎదుర్కొన్నా. ఇవి మనసును ఎంతగా మెలిపెడతాయో నాకు తెలుసు. అమ్మగా తన చిన్నారికి ఏ ప్రదేశంలో పాలివ్వాలి? ఎలా పాలు పట్టాలి? అన్న విషయాలు ఆమెకు తెలుసు! అది ఆమె నిర్ణయం. అయినా బహిరంగ ప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలిస్తుంటే ఆమె ఏదో తప్పు చేస్తున్నట్లుగా భావిస్తారు.. లైంగిక దృష్టితో చూస్తారు. ఈ దృష్టి కోణాన్ని మార్చడానికే ‘ఫ్రీడమ్‌ టు ఫీడ్‌’ పేరుతో సోషల్‌ మీడియా వేదికగా బ్రెస్ట్ ఫీడింగ్‌పై అవగాహన కల్పిస్తున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది నేహ.

వీళ్లే కాదు.. సమీరా రెడ్డి, లిసా హెడెన్‌, సెలీనా జైట్లీ, మీరా రాజ్‌పుత్‌.. వంటి సెలబ్రిటీ మామ్స్‌ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా బహిరంగ ప్రదేశాల్లో తల్లి పాలివ్వడంపై స్పందిస్తూ.. ఈ క్రమంలో సమాజంలో ఉన్న అపోహల్ని, మూసధోరణుల్ని బద్దలుకొట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో- బహిరంగ ప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వలేకపోవడానికి మీ దృష్టిలో కారణాలేమిటి? ఈ ధోరణి మారాలంటే వ్యక్తిగతంగా, సమాజం పరంగా ఎలాంటి మార్పులు రావాలి?  మీ అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలను మాతో పంచుకోండి.. తల్లి పాల ప్రాధాన్యాన్ని తెలియజేయడంలో మీరూ భాగస్వాములు కండి..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్