విడాకులు తీసుకుంటున్నారా..? ఈ పొరపాట్లు చేయకండి!

పెళ్లంటే మనసులు కలిసిన ఇద్దరు వ్యక్తుల్ని నిండు నూరేళ్ల పాటు కలిపి ఉంచే బంధం. అయితే పలు కారణాల వల్ల ఈ మధ్య చాలా జంటలు విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. వీరిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఒక్కసారిగా తమ విడాకుల విషయం బయటికి చెప్పి తమ అభిమానుల్ని విస్మయానికి గురి చేస్తున్నారు. తాజాగా తమిళ నటుడు ధనుష్‌-ఐశ్వర్య విడాకుల విషయం కూడా చాలామందిని షాక్‌కి గురి చేసిందని చెప్పచ్చు.

Published : 18 Jan 2022 20:28 IST

పెళ్లంటే మనసులు కలిసిన ఇద్దరు వ్యక్తుల్ని నిండు నూరేళ్ల పాటు కలిపి ఉంచే బంధం. అయితే పలు కారణాల వల్ల ఈ మధ్య చాలా జంటలు విడిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. వీరిలో సామాన్యులే కాదు.. సెలబ్రిటీలూ ఒక్కసారిగా తమ విడాకుల విషయం బయటికి చెప్పి తమ అభిమానుల్ని విస్మయానికి గురి చేస్తున్నారు. తాజాగా తమిళ నటుడు ధనుష్‌-ఐశ్వర్య విడాకుల విషయం కూడా చాలామందిని షాక్‌కి గురి చేసిందని చెప్పచ్చు.

అయితే కారణమేదైనా దాంపత్య బంధం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న వారు మాత్రం విడాకులు తీసుకునే క్రమంలో కొన్ని పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలని చెబుతున్నారు నిపుణులు. తద్వారా ఈ ప్రక్రియ సులభంగా పూర్తవడంతో పాటు.. ఆపైనా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, ఇంతకీ విడాకులు తీసుకునే క్రమంలో చేయకూడదని ఆ పొరపాట్లేంటో మనమూ తెలుసుకుందాం రండి..

వాళ్ల మాట వినండి!

భాగస్వామితో విడిపోతామంటే.. అటు ఇంట్లో వాళ్లు, ఇటు నిపుణులు తొలి ప్రయత్నంగా ఇద్దరినీ కలపడానికే మొగ్గు చూపుతారు. అయినా సరే కచ్చితంగా విడాకులు తీసుకోవాల్సి వస్తే మాత్రం.. మీవైపు కేసు వాదించడానికి ఓ అనుభవజ్ఞులైన న్యాయవాదిని పెట్టుకోవడం మామూలే! అయితే విడాకుల ప్రక్రియ అనేది అంత తేలిగ్గా పూర్తయ్యే విషయం కాదు.. ఇందుకు కొన్ని నెలల సమయం పట్టచ్చు. ఆ ఓపిక కూడా పట్టకుండా, లాయర్‌ చెప్పినట్లు చేయకుండా.. త్వరగా విడాకులు కావాలని చెప్పుడు మాటలు విని మీకు నచ్చిన ప్రయత్నాలు మీరు చేశారంటే మొదటికే మోసం రావచ్చు.. పైగా ఈ ప్రక్రియ సాగదీతగా కూడా మారచ్చు. కాబట్టి మీరు ఎంచుకున్న లాయర్‌ సలహాలు పాటిస్తూ, వాదోపవాదాల సమయంలో గైర్హాజరు కాకుండా కోర్టుకు వెళ్తూ.. వాళ్లకు సహకరిస్తే సత్వర ఫలితం ఉంటుంది.

పిల్లలపై ప్రతాపమా?!

విడాకులనేది అతి సున్నితమైన అంశం. ఈ క్రమంలో మానసిక ఆందోళన, ఒత్తిడి.. వంటివి సహజం. అయితే ఒక్కోసారి ఈ కోపం, చిరాకును చుట్టూ ఉండే వాళ్లపై చూపుతుంటారు కొంతమంది. ముఖ్యంగా కళ్ల ముందుండే పిల్లలను దూషిస్తుంటారు. నిజానికి దీనివల్ల వారి మనసులో మీపై నెగెటివ్‌ ముద్ర పడిపోతుంది. ఇది క్రమంగా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచే ప్రమాదమూ లేకపోలేదు. విడాకుల తర్వాత మీరే మీ పిల్లలకు అమ్మానాన్న అవ్వాలన్న విషయం మర్చిపోయి.. ఇలాంటి క్షణికావేశాన్ని పిల్లలపై ప్రదర్శిస్తే ఇటు మీరు, అటు వాళ్లు నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే విడాకుల విషయం, దాని ప్రభావం పిల్లల దాకా రానీయకుండా జాగ్రత్తపడమంటున్నారు. ఇందుకోసం మీ మనసులో ఎంత బాధ ఉన్నా వాళ్లతో ఎప్పటిలాగా నవ్వుతూ, అన్ని విషయాల్లో అండగా నిలబడాలి. ఈ దృఢమైన మనస్తత్వమే మీరు సింగిల్‌ మదర్‌గా మారాక కూడా వాళ్లకు ఎలాంటి లోటూ రాకుండా పెంచేందుకు దోహదం చేస్తుంది.

సంతోషమే సగం బలం!

మానసికంగా దృఢంగా ఉంటే ఎలాంటి సమస్యలనైనా సులభంగా అధిగమించేయచ్చు.. అందుకే విడాకుల సమయంలో కుంగిపోకుండా.. ఇలాంటి దృఢమైన మనస్తత్వాన్ని అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో స్వీయ ప్రేమను పెంచుకోవడం, నచ్చిన పనుల్లో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడం, పిల్లలు-ఇతర కుటుంబ సభ్యులు, ప్రాణ స్నేహితులతో సమయం గడపడం.. వంటి పనులతో సగం ఒత్తిడిని అధిగమించచ్చు. ఇక మిగతా సగం సంతోషాన్ని పొందడం కోసం వ్యాయామాలు, యోగా, ధ్యానం.. వంటివి ఉండనే ఉన్నాయి.

స్నేహితులుగా ఉండచ్చుగా!

విడాకులంటే భార్యాభర్తలకు మాత్రమే సంబంధించిన అంశం కాదు.. ఇందులో మీ పిల్లలు, ఇరు కుటుంబాలు.. ఇలా ఎంతోమంది దీనివల్ల ప్రభావితమవుతారు. కాబట్టి అంత సులభంగా మీ బంధాన్ని తెగతెంపులు చేసుకొని ఎవరి దారి వారు చూసుకోవడం సరికాదంటున్నారు నిపుణులు. ఇద్దరూ విడిపోయాక కూడా పిల్లల కోసమైనా స్నేహితులుగా కొనసాగక తప్పదంటున్నారు. ఒకవేళ భరణం ఇచ్చిపుచ్చుకున్నా స్నేహబంధాన్ని కొనసాగించడం వల్ల.. పిల్లలకు సంబంధించిన చాలా విషయాల్లో కలిసి నిర్ణయాలు తీసుకోవచ్చంటున్నారు. ఫలితంగా వాళ్లకు తల్లిదండ్రులిద్దరూ తమతోనే ఉన్నారన్న భావన కలుగుతుంది. ఇది మీపై భారం పడకుండా చేయడంతో పాటు మీ పిల్లలపైనా సానుకూల ప్రభావం చూపుతుంది. అందుకే విడాకులు తీసుకునే క్రమంలో, విడాకులు మంజూరయ్యాక కూడా ఇష్టమైతే ఇద్దరూ స్నేహితులుగా మెలగడం మంచిదంటున్నారు నిపుణులు.

వాటిని దాచకండి!

భాగస్వామి నుంచి విడాకులు తీసుకునే క్రమంలో కొంత మొత్తాన్ని భరణంగా స్వీకరించడం సహజమే! ఈ విషయంలో భర్త భార్యకు ఎంత డబ్బు ఇవ్వాలన్న విషయాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి పేరు మీదా ఉన్న ఆస్తిపాస్తులు, ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే ఎక్కువ డబ్బు ఆశించి.. మీ ఆస్తిపాస్తులు, ఆదాయవ్యయాల విషయంలో తప్పుడు లెక్కలు చూపిస్తే.. అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే కాదు.. చట్టపరంగా దాన్ని నేరంగా కూడా పరిగణిస్తారని చెబుతున్నారు నిపుణులు. తద్వారా ఈ ప్రక్రియ సమయంలో, లేదంటే ఆ తర్వాతైనా మూడో వ్యక్తి ద్వారా ఈ విషయం బయటికి వచ్చినా, దీనిపై మీ భాగస్వామి కేసు వేసినా మీరు ఉచ్చులో చిక్కుకుంటారని మర్చిపోవద్దు. కాబట్టి ఆర్థిక విషయాల్లో నిజానిజాలు దాచకుండా పారదర్శకంగా ఉంటూ.. లాయర్‌ సలహాలు పాటిస్తే త్వరగా విడాకులు మంజూరవడంతో పాటు ఆ తర్వాత కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్