తన కజిన్‌ లాంటి పరిస్థితి మరొకరికి రాకూడదని..!

రొమ్ము క్యాన్సర్‌.. ముందస్తు లక్షణాలు కనిపించకుండా చాప కింద నీరులా విస్తరిస్తోందీ మహమ్మారి. మహిళల్లో క్యాన్సర్‌ సంబంధిత మరణాల్లో రొమ్ము క్యాన్సర్‌దే అగ్రస్థానం అని గణాంకాలు చెబుతున్నాయి.

Published : 14 Oct 2023 12:25 IST

(Photo: Niramai)

రొమ్ము క్యాన్సర్‌.. ముందస్తు లక్షణాలు కనిపించకుండా చాప కింద నీరులా విస్తరిస్తోందీ మహమ్మారి. మహిళల్లో క్యాన్సర్‌ సంబంధిత మరణాల్లో రొమ్ము క్యాన్సర్‌దే అగ్రస్థానం అని గణాంకాలు చెబుతున్నాయి. ఇదంతా వ్యాధిని తొలినాళ్లలో గుర్తించకపోవడం వల్లే అంటున్నారు నిపుణులు. సరైన వైద్య సదుపాయాల్లేకపోవడం, అవగాహన లోపం, వ్యాధి నిర్ధారణకయ్యే ఖర్చు, వ్యక్తిగత ప్రైవసీ.. ఇలాంటివే వ్యాధి ముదిరి ప్రాణాల మీదకు తెచ్చేందుకు కారణమవుతున్నాయి. అందుకే కృత్రిమ మేధతో ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక్క పరిష్కారం కనుక్కున్నారు బెంగళూరుకు చెందిన గీతా మంజునాథ్. థర్మోగ్రఫీతో ఆదిలోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేలా ఓ పరికరాన్ని అభివృద్ధి చేశారామె. కేవలం పావుగంటలోనే కచ్చితత్వంతో కూడిన ఫలితాల్ని అందించే ఈ పరికరంతో.. వేలాది మంది ప్రాణాల్ని కాపాడుతున్నారు గీత. ‘రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసం’ సందర్భంగా ఆమె ఈ పరికరం అభివృద్ధి చేయడం వెనకున్న అసలు కథేంటో తెలుసుకుందాం..!

గీతది బెంగళూరు. ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌’లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో పీహెచ్‌డీ పూర్తిచేసిన ఆమె.. పలు ప్రముఖ ఐటీ సంస్థల్లో పాతికేళ్ల పాటు పనిచేశారు. ఈ క్రమంలోనే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తన నైపుణ్యాల్నీ మెరుగుపరచుకుంటూ వచ్చారామె. అంతేకాదు.. అల్ట్రాసౌండ్‌, రేడియేషన్‌, ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ.. వంటి పరీక్షలకు సంబంధించిన థర్మల్‌ చిత్రాల్ని జనరేట్‌ చేసే పద్ధతుల పైనా తన బృందంతో కలిసి పనిచేశారామె.

ఆలోచన మార్చిన ఫోన్‌ కాల్!

అయితే ఇలా తన ఉద్యోగంలో బిజీగా ఉన్న సమయంలోనే.. ఓ రోజు గీతకు అనుకోకుండా ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆమె ఇద్దరు కజిన్స్‌కి రొమ్ము క్యాన్సర్‌ నిర్ధరణ అయిందనేది ఆ కాల్‌ సారాంశం!

‘నా కజిన్స్‌ ఇద్దరూ 45 ఏళ్ల లోపు వారే. తరచూ మమోగ్రామ్‌ పరీక్ష కూడా చేయించుకుంటుంటారు. అయితే ఈ పరీక్షలో భాగంగా క్యాన్సర్‌ను ఆదిలోనే గుర్తించలేకపోవడం వల్లే అది వారి ప్రాణాల మీదకు తెచ్చింది.. యుక్త వయసులో ఉన్న వారిలో ఒక్కోసారి మమోగ్రామ్‌ పరీక్షలోనూ క్యాన్సర్‌ కణతులు బయటపడవు. అలా కొన్నాళ్లకు వారిద్దరూ చనిపోవడం నన్ను కలచివేసింది. ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నా. ఇలా ఆలోచిస్తున్నప్పుడే ఆదిలోనే క్యాన్సర్‌ను గుర్తించే ఓ పరికరాన్ని అభివృద్ధి చేయాలన్న ఐడియా తట్టింది. ఇదే 2016లో ‘నిరమాయ్ హెల్త్‌ అనలిటిక్స్‌’ పేరుతో ఓ సంస్థను ప్రారంభించేలా చేసింది..’ అంటున్నారు గీత. తన సంస్థ కోసం ఉద్యోగాన్నీ వదులుకున్నారామె. ఈ వేదికగానే థర్మల్‌ ఇమేజింగ్‌ పద్ధతికి, కృత్రిమ మేధను జోడించి ‘థర్మలిటిక్స్‌’ అనే పరికరాన్ని తన నిపుణుల బృందంతో కలిసి అభివృద్ధి చేశారు గీత.

ఉష్ణోగ్రతను బట్టి..!

చిన్న సైజు కెమెరాను పోలి ఉండే ఈ పరికరంతో పావుగంటలోనే క్యాన్సర్‌ ఉందో, లేదో పూర్తి కచ్చితత్వంతో నిర్ధరించచ్చంటున్నారు గీత.

‘థర్మలిటిక్స్‌ ఒక చిన్న సైజు కెమెరాను పోలి ఉంటుంది. దీన్ని సులభంగా పట్టుకోవడానికి ఓ హ్యాండిల్‌ను అనుసంధానించాం. క్యాన్సర్‌ పరీక్ష చేయించుకునే వారికి ఈ పరికరాన్ని మూడడుగుల దూరంలో ఉంచాలి. ఇందులోని ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలు వక్షోజాల్లో వేర్వేరు భాగాల్లో ఉన్న ఉష్ణోగ్రతను రికార్డ్‌ చేస్తాయి. ఈ ఉష్ణోగ్రతలోని హెచ్చుతగ్గులను బట్టి ఓ థర్మల్‌ ఛాయాచిత్రం సిద్ధమవుతుంది. కృత్రిమ మేధతో పని చేసే ఈ పరికరం రొమ్ములో ఉన్న ఉష్ణోగ్రతను బట్టి మూడు పేజీల క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ రిపోర్ట్‌ను తయారుచేస్తుంది. ఈ ఫొటోల్ని, రిపోర్ట్‌ను డాక్టర్‌కు చూపిస్తే.. వ్యాధి ఉందో, లేదో సులభంగా నిర్ధరిస్తారు. అవసరమైతే అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, ఇతర పరీక్షలు చేయించుకోమని సలహా ఇస్తారు. నిజానికి మా పరికరం క్యాన్సర్‌ లక్షణాలు బయట పడకముందే క్యాన్సర్‌ను నిర్ధరించడంలో సమర్థంగా పనిచేస్తుంది. తద్వారా తొలినాళ్లలోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడం వీలవుతుంది. ఇక ఈ పరికరంతో ఎప్పుడంటే అప్పుడు, ఎవరికి వారే స్వయంగా పరీక్ష చేసుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లచ్చు..’ అంటున్నారామె.

నొప్పి లేకుండానే..!

రొమ్ము క్యాన్సర్‌ పరీక్షలనగానే చాలామంది భయపడతారు. పరీక్ష చేసే క్రమంలో తీవ్రమైన నొప్పి వస్తుందని, వ్యక్తిగత ప్రైవసీ దెబ్బతింటుందని.. ఇబ్బంది పడే వారూ లేకపోలేదు. కానీ తమ పరికరంతో ఈ సమస్యలేవీ ఉండవంటున్నారు గీత.

‘మమోగ్రామ్‌ వంటి రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీస్తాయని మహిళలు ఇబ్బంది పడుతుంటారు. కానీ థర్మలిటిక్స్‌ పరికరంతో ఈ ఇబ్బంది ఉండదు. ఎవరూ పేషెంట్‌ని నేరుగా చూడాల్సిన, తాకాల్సిన పని ఉండదు. పేషెంట్‌ నాలుగ్గోడల మధ్య ఉన్న ఈ కెమెరా ముందు కూర్చుంటే.. గది బయట ఉన్న టెక్నీషియన్‌ ల్యాప్‌టాప్‌లో ఆమె పరిస్థితిని సమీక్షిస్తారు. తదనంతర రిపోర్ట్‌ పనులపై దృష్టి పెడతారు. పైగా ఇది రేడియేషన్‌ రహిత క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్ష. అంతేకాదు.. ఈ పరీక్ష వల్ల ఎలాంటి నొప్పి కూడా ఉండదు. ఇలా మా పరికరంతో ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టే ప్రస్తుతం చాలామంది మహిళలు దీన్ని వినియోగిస్తున్నారు. కేవలం పావుగంటలో పూర్తయ్యే ఈ పరీక్ష ద్వారా పేషెంట్‌కు కచ్చితమైన ఫలితాలు, అత్యధిక రిజల్యూషన్‌ గల థర్మల్‌ ఛాయాచిత్రాల్నీ అందించగలుగుతున్నాం..’ అంటున్నారీ క్యాన్సర్‌ వారియర్.

ఉచిత పరీక్షలు!

ఈ క్యాన్సర్‌ నిర్ధారణ పరికరాన్ని అభివృద్ధి చేసిన తొలినాళ్లలో పలు ఆస్పత్రుల్లోని పేషెంట్లపై దీన్ని ప్రయోగించి, క్యాన్సర్‌ నిపుణుల సలహా మేరకు ఇందులో పలు మార్పులు చేర్పులు చేసిన గీత.. ఇప్పటివరకు ఎన్నో సంస్థల్లో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఆయా ప్రాంతాల్లో క్యాన్సర్‌ పరీక్షా శిబిరాల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు గీత.

‘ఇప్పటికీ మన దేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు కూడా లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థల చొరవతో అలాంటి చోట మా పరికరంతో ఉచితంగా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. నగరాల్లోనూ తక్కువ ధరకే పరీక్షలు చేస్తున్నాం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 30కి పైగా నగరాల్లో వేల మంది మహిళలు మా పరికరంతో క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లలోనూ మా పరికరం అందుబాటులో ఉంది. అలాగే యూఏఈ, కెన్యా, ఫిలిప్పీన్స్‌, యూరప్‌, అమెరికా.. వంటి దేశాల్లోనూ మా పరికరం వినియోగంలో ఉంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి మహిళా క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. రొమ్ము క్యాన్సర్‌తో మరణించే మహిళల సంఖ్య తగ్గించడమే నా అంతిమ లక్ష్యం..’ అంటున్నారు గీత.

ఫోర్బ్స్‌ మెచ్చింది!

ఇప్పటికే 30కి పైగా పేటెంట్‌ హక్కుల్ని సొంతం చేసుకున్న ఈ పరికరంతో కేవలం రొమ్ము క్యాన్సర్‌నే కాదు.. ఇతర క్యాన్సర్లనూ కచ్చితత్వంతో గుర్తించచ్చంటున్నారు గీత. ఇలా తన సృజనాత్మకత, సేవలకు గుర్తింపుగా కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) నుంచి ‘ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ అవార్డు’తో పాటు ‘విమెన్‌ హెల్త్‌ ఇన్నొవేషన్‌ షోకేస్‌ ఏషియా’, ‘విమెన్‌ ఆంత్రప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ - 2020’.. వంటి పురస్కారాల్నీ అందుకున్నారామె. 2020లో ఫోర్బ్స్‌ పత్రిక ప్రకటించిన ‘20 మంది స్వయంశక్తితో ఎదిగిన మహిళల’ జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు గీత. ఆమె మంచి వక్త కూడా! రొమ్ము క్యాన్సర్‌పై జాతీయ, అంతర్జాతీయ వేదికలపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసే గీత.. ఇటీవలే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో 90కి పైగా దేశాధినేతల సమక్షంలో మరోసారి తన గళాన్ని వినిపించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్