ముఖానికి ‘వెండి’ పూత!

బంగారం, వెండి.. వంటి లోహాలతో తయారైన నగల్ని ధరించడానికి మనం ఎంతగానో ఇష్టపడతాం. కానీ ఇవి సౌందర్య పరిరక్షణలోనూ ఉపయోగపడతాయన్న విషయం మీకు తెలుసా? వీటిలో ముఖ్యంగా వెండి ముఖవర్ఛస్సును ఇనుమడించడంలో కీలక పాత్ర...

Published : 14 Sep 2022 20:56 IST

బంగారం, వెండి.. వంటి లోహాలతో తయారైన నగల్ని ధరించడానికి మనం ఎంతగానో ఇష్టపడతాం. కానీ ఇవి సౌందర్య పరిరక్షణలోనూ ఉపయోగపడతాయన్న విషయం మీకు తెలుసా? వీటిలో ముఖ్యంగా వెండి ముఖవర్ఛస్సును ఇనుమడించడంలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. అయినా ఇది ఖరీదైన లోహం కదా.. అని మీరు అనుకోవచ్చు. కానీ ‘సిల్వర్‌ లీవ్స్‌/పీసెస్‌’ రూపంలో ప్రస్తుతం ఇవి అందుబాటు ధరల్లోనే లభిస్తున్నాయి. మరి, ఇంతకీ ముఖానికి వెండి పూత ఎలా వేసుకోవాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

నిమిషాల్లో మెరిసిపోతారు!

సౌందర్య పరిరక్షణలో భాగంగా.. ప్రస్తుతం వెండి లీవ్స్‌ (సన్నటి ఉల్లి పొర మాదిరిగా) రూపంలో మార్కెట్లో దొరుకుతోంది. వీటిలో హెర్బల్‌ ఎక్స్‌ట్రాక్ట్స్ కలిపినవి కూడా దొరుకుతున్నాయి. అన్నీ సహజసిద్ధమైన పదార్థాలే కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండవని, పైగా ఇవి అన్ని చర్మతత్వాల వారికీ సరిపోతాయంటున్నారు నిపుణులు. అందుబాటు ధరల్లో లభిస్తోన్న వీటిని వేసుకోవడం కూడా చాలా సులువే!

ముందుగా ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకొని పొడిగా తుడుచుకోవాలి. ఆపై కలబంద గుజ్జును ముఖంపై రుద్దుకొని.. ఆపై సిల్వర్‌ లీవ్స్ని నెమ్మదిగా అతికించుకోవాలి. నేరుగా చేత్తో అయితే ఇవి చేతికి అంటుకుపోతాయి.. కాబట్టి వీటిని పేపర్‌లోకి తీసుకొని ముఖంపై పరచుకోవాలి. పావుగంట తర్వాత గుండ్రంగా రుద్దే కొద్దీ.. ఇవి చర్మంలోకి ఇంకిపోతాయి. తద్వారా ముఖంపై తక్షణ మెరుపును మనం గమనించచ్చు. అలాగే ఏదైనా అత్యవసరంగా పార్టీ/ఫంక్షన్లకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సిల్వర్‌ ఫేషియల్‌తో నిమిషాల్లోనే మెరిసిపోవచ్చు.

మొటిమలు మాయం!

సిల్వర్‌ ఫేషియల్‌తో తక్షణ మెరుపే కాదు.. ఇతర సౌందర్య ప్రయోజనాలూ ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..!

హానికారక బ్యాక్టీరియా చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. తద్వారా చర్మంపై దద్దుర్లు, ర్యాషెస్‌, దురద.. వంటివి వస్తుంటాయి. ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే సిల్వర్‌ ఫేషియల్‌ చక్కటి మార్గం. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలే ఇందుకు కారణం!

ముఖంపై మొటిమలు రావడానికి ముఖ్య కారణం జిడ్డుదనం. చర్మంలో సీబం ఉత్పత్తి పెరిగితే ఈ సమస్య తలెత్తుతుంది. కాబట్టి దాని ఉత్పత్తిని తగ్గించి.. తద్వారా మొటిమల సమస్యకు చెక్‌ పెడుతుంది వెండి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలే ఇందుకు మేలు చేస్తాయి. అలాగే చర్మ రంధ్రాలు తెరుచుకునేందుకు సహకరిస్తాయి.

వెండిలోని యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు చర్మ కణాల్ని దెబ్బతీసే ఫ్రీరాడికల్స్‌ని తొలగిస్తాయి. తద్వారా ముఖంపై ముడతలు, గీతలు, మచ్చలు.. వంటివి తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

ముఖంపై వాపును, అలర్జీని తగ్గించడంలో ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు సహకరిస్తాయని వివిధ పరిశోధనల్లో నిరూపితమైంది.

ఈ సిల్వర్‌ ఫేషియల్‌ చర్మంలోని పీహెచ్‌ స్థాయుల్ని బ్యాలన్స్‌ చేసి.. చర్మాన్ని తేమగా మార్చుతుంది. తద్వారా ముఖం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

గమనిక : ఈ సిల్వర్‌ లీవ్స్‌ అన్ని చర్మతత్వాల వారికి సరిపడతాయని నిపుణులు చెప్పినప్పటికీ.. కొంతమందిలో లోహ అలర్జీ ఉండచ్చు. కాబట్టి ముందు ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకున్నాకే ముఖానికి వాడడం ఉత్తమం. అలాగే కాస్త ఖరీదు అని భావించేవారు.. ముఖ్యమైన పార్టీలు, ఫంక్షన్లు.. వంటి అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ సిల్వర్‌ ఫేషియల్‌ను ఎంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్