ఆడపిల్ల పుట్టిందని అలా వేడుక చేసుకున్నారు!

కంప్యూటర్ల కాలమని గొప్పలు చెప్పుకుంటున్నా కూతురు పుడితే గుండెల మీద కుంపటిలా భావించే తల్లిదండ్రులు నేటికీ ఉన్నారు. అంతెందుకు.. కడుపులో పడిన నలుసు ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్‌ చేయించే వారు ఇప్పటికీ కనిపిస్తుంటారు.

Updated : 14 Sep 2021 20:25 IST

(Image for Representation)

కంప్యూటర్ల కాలమని గొప్పలు చెప్పుకుంటున్నా కూతురు పుడితే గుండెల మీద కుంపటిలా భావించే తల్లిదండ్రులు నేటికీ ఉన్నారు. అంతెందుకు.. కడుపులో పడిన నలుసు ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్‌ చేయించే వారు ఇప్పటికీ కనిపిస్తుంటారు. అయితే తనకు ఆడపిల్ల పుట్టిందన్న సంతోషంతో ఓ పానీపూరీ వ్యాపారి తెగ సంబరపడిపోయాడు. తన ఇంట్లో మహాలక్ష్మి అడుగుపెట్టిందన్న శుభవార్తను పంచుకుంటూ సుమారు 50వేల రూపాయల పానీపూరీలను ఉచితంగా పంచాడు.

అమ్మాయి పుట్టిందని!

మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు చెందిన అంచల్‌ గుప్తా గత 20 ఏళ్లుగా పానీపూరీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. తన ఇద్దరు సోదరులు ఇంజినీర్లుగా స్థిరపడ్డా అతడు మాత్రం ఈ వ్యాపారాన్నే కొనసాగిస్తున్నాడు. ఇక పెళ్లైనప్పటి నుంచి ఆడబిడ్డ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న అంచల్‌ కోరిక ఇటీవల నెరవేరింది. అతడి సతీమణి ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురు పుట్టిందని అంచల్‌ మేఘాల్లో తేలిపోతుంటే కొందరు బంధువులు మాత్రం ‘ఆడబిడ్డంట కదా.. ఇక నీకూ సమస్యలు తప్పవులే’ అంటూ అతడి ముఖం మీదే చెప్పేశారు. ఇది అంచల్‌ను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలో అమ్మాయి పుట్టిందని ఘనంగా సంబరాలు చేసుకొని ఓ సామాజిక సందేశం ఇవ్వాలనుకున్నాడు.

ఆ మాటలు బాధించాయి!

ఇందులో భాగంగా కోలార్‌ పట్టణంలోని బీమా కుంజ్‌ రోడ్డులో మూడు పానీపూరీ స్టాల్స్‌ను ఏర్పాటుచేశాడు అంచల్‌. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్థానికులందరికీ ఉచితంగా పానీపూరీ అందించాడు. రెగ్యులర్‌ కస్టమర్లే కాకుండా.. వేలాది మంది ప్రజలు అక్కడకు వచ్చి పానీపూరీ తిని అతడికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ‘అమ్మాయిలతోనే భవిష్యత్తు బాగుంటుందని నేను గట్టిగా విశ్వసిస్తాను. అందుకే పెళ్లైనప్పటి నుంచి ఆడబిడ్డే పుట్టాలని కోరుకున్నాను. అయితే రెండేళ్ల క్రితం అబ్బాయి పుట్టాడు. కానీ అదృష్టవశాత్తూ ఈసారి నా కల నిజమైంది. మా ఆవిడ మహాలక్ష్మికి జన్మనిచ్చింది. ఈ ఆనంద సమయంలోనే కొందరు అన్న మాటలు నన్నెంతో బాధించాయి. అందుకే సమాజంలో ఆడ, మగ అన్న తేడా రూపుమాపేందుకు నా వంతు ఓ చిన్న ప్రయత్నం చేద్దామనుకున్నాను. పైగా నా కొడుకు రెండో పుట్టిన రోజు కూడా సమీపిస్తుండడంతో ఉచితంగా పానీపూరీలను పంచాలనుకున్నా. ఇలా ఒకేసారి రెండు సెలబ్రేషన్స్‌ కలిసొచ్చాయి.’

సొంత కాళ్లపై నిలబడేలా చేస్తాను!

‘నాది చిన్న వ్యాపారం కావచ్చు. కానీ కూతురు ఉన్న తల్లిదండ్రులందరూ గర్వంగా భావించాలి. అందుకే ఖర్చు గురించి ఏ మాత్రం ఆలోచించలేదు. ఇక నా సతీమణి డిగ్రీ చదువుకుంది. సొంతకాళ్లపై నిలబడాలనుకుంటోంది. అందుకే తనతో కుట్టు మిషన్‌ కేంద్రాన్ని ప్రారంభిద్దామనుకున్నాను. కానీ ఇంతలో తాను గర్భం దాల్చింది. త్వరలోనే తనతో కుట్టు మిషన్‌ దుకాణం ఓపెన్‌ చేయిస్తాను. ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడేలా చేస్తాను’ అంటున్నాడు అంచల్‌.

‘బేటీ హై తో కల్‌ హై ’ (అమ్మాయిలతోనే భవిష్యత్‌ బాగుంటుంది) అనే సందేశాన్ని  అందిస్తూ అంచల్‌ చేసిన పని ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో పాటు పలువురు ప్రముఖులు వీటిని చూసి అంచల్‌ను అభినందిస్తున్నారు.

కూతురు పుట్టిందని ఉచితంగా హెయిర్‌ కటింగ్‌!

ఇదొక్కటే కాదు.. ఆడపిల్ల పుడితే ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్న సంఘటనలు చాలానే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన సల్మాన్‌ ఈ ఏడాది జనవరిలో తనకు కూతురు పుట్టిందని వినూత్నంగా సంబరాలు చేసుకున్నాడు. ఇందులో భాగంగా నగరంలో తనకున్న మూడు హెయిర్‌ సెలూన్లలో ఉచితంగా సెలూన్‌ సేవలు పొందచ్చంటూ తన కస్టమర్లందరికీ ఓ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాడు. వాటిల్లో ఒక రోజంతా సుమారు 80 మంది కస్టమర్లకు ఉచితంగా హెయిర్‌ సెలూన్‌ సేవలు అందించాడు. ‘ఇంట్లో ఎంతమంది మగపిల్లలు ఉన్నా.. ఒక్క ఆడపిల్ల లేకపోతే ఆ ఇల్లంతా బోసిపోయినట్లు ఉంటుంది. అందుకే నాకు కూడా ఆడపిల్ల పుట్టాలని కోరుకున్నాను. కోరుకున్నట్లుగానే దేవదూత రూపంలో ఓ చిన్నారి మా ఇంట్లోకి అడుగుపెట్టింది. ఈ వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకున్నాను. అదే సందర్భంలో ఆడపిల్ల పుడితే బాధపడకూడదు.. సంతోషపడాలనే సందేశాన్ని అందరికీ తెలియజేయాలనుకున్నాను. అందుకే నాకున్న మూడు సెలూన్లలో ఒక రోజంతా ఉచితంగా సేవలు అందించాను’ అంటూ చెప్పుకొచ్చాడు సల్మాన్‌.

 

ఆడపిల్లను కన్న కోడలిపై పూల వర్షం!

అంతకు ముందు తెలంగాణలోని మహబూబాబాద్‌లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఆడపిల్లను కన్న కోడలిపై అత్తింటివారు పూల వర్షం కురిపించారు. మహబూబాబాద్‌ జిల్లా కే సముద్రం మండలానికి చెందిన నవీన్‌, రమ్యలకు మూడేళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది రమ్య. ప్రసవం తర్వాత సంప్రదాయం ప్రకారం మొదట పుట్టింటికి వెళ్లిన రమ్య... కొన్ని నెలల తర్వాత తన బిడ్డతో అత్తారింట్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తల్లీబిడ్డలపై పూల వర్షం కురిపిస్తూ అపూర్వ స్వాగతం పలికారు అత్తింటి వారు. మహాలక్ష్మి ఇంట్లోకి అడుగుపెట్టిందన్న ఆనందంతో ఇంటి బయట నుంచి లోపలి గది వరకు వారిని పూల బాటపై నడిపించారు. అనంతరం మంచంపై పూలను అందంగా పేర్చి మధ్యలో బిడ్డను పడుకోబెట్టి మురిసిపోయారు.

ఆడపిల్లలను భారంగా భావించి పొత్తిళ్లలోనే చిదిమేస్తున్న వారికి ఇలాంటి సంఘటనలు కనువిప్పు కలిగించాలని కోరుకుందాం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్