నెల రోజులు వెంటిలేటర్‌పై ఉన్నా.. మొండి ధైర్యంతో కొవిడ్‌ను జయించా!

కరోనా మొండిది.. దాన్ని జయించాలంటే అంతకంటే మొండి ధైర్యం కావాలంటోంది భోపాల్‌కు చెందిన రేణూ చౌహాన్‌. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కొవిడ్‌ బారిన పడిన ఆమె.. నెల రోజులు వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంది.. జీవితంపై ఆశలు ఆవిరై, భవిష్యత్తు అంధకారమవుతోన్న తరుణంలో గుండె ధైర్యం తెచ్చుకొని.. వైద్యులు-నర్సులు-కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహంతో మొండిగా వైరస్‌తో పోరాడింది.. ఈ పోరులో అంతిమ విజయం తనదేనంటూ ఇటీవలే ఇంటికి చేరిన ఆమె.. మానసిక ధైర్యమే కరోనా బా

Published : 24 Jun 2021 20:16 IST

Image for Representation

కరోనా మొండిది.. దాన్ని జయించాలంటే అంతకంటే మొండి ధైర్యం కావాలంటోంది భోపాల్‌కు చెందిన రేణూ చౌహాన్‌. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా కొవిడ్‌ బారిన పడిన ఆమె.. నెల రోజులు వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంది.. జీవితంపై ఆశలు ఆవిరై, భవిష్యత్తు అంధకారమవుతోన్న తరుణంలో గుండె ధైర్యం తెచ్చుకొని.. వైద్యులు-నర్సులు-కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహంతో మొండిగా వైరస్‌తో పోరాడింది.. ఈ పోరులో అంతిమ విజయం తనదేనంటూ ఇటీవలే ఇంటికి చేరిన ఆమె.. మానసిక ధైర్యమే కరోనా బాధితులకు అసలు సిసలైన ఔషధం అని మరోసారి నిరూపించింది. కరోనాతో కుంగిపోతూ ఇక జీవితం ముగిసినట్లేనని భావిస్తోన్న ఎంతోమందిలో స్ఫూర్తి నింపే సదుద్దేశంతో తన అనుభవాలను పంచుకోవడానికి ఇప్పుడిలా మన ముందుకొచ్చింది.

ఎంత ధైర్యంగా ఉన్నా.. కరోనా సోకిందనగానే ఆ ధైర్యమంతా ఒక్కసారిగా ఆవిరైపోతుంది.. ఈ మహమ్మారిని తట్టుకొని నేను తిరిగి కోలుకోగలనా.. నా కుటుంబాన్ని చూడగలనా?.. ఎప్పటిలాగే నా పిల్లలతో సంతోషంతో గడపగలనా? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు మదిని తొలిచేస్తుంటాయి. నాకు కొవిడ్‌ పాజిటివ్‌ అని తెలిసిన మరుక్షణం నా పరిస్థితీ ఇదే! నాకేమైనా అయితే నా కొడుకు, కూతురిని చూసుకునేదెవరు? అన్న ఆలోచనతో ఒక్క క్షణం నా జీవితం ఆగిపోయినట్లనిపించింది.

మాది భోపాల్‌. మా వారి ఉద్యోగరీత్యా పెళ్లయ్యాక మేము ఇక్కడే స్థిరపడ్డాం. మాకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. నేను కూడా ఇక్కడే ఓ ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నా. ‘ఎలాగూ స్కూళ్లకు సెలవులిచ్చారు.. పరీక్షలూ రద్దయ్యాయి.. అమ్మా మనం అమ్మమ్మ వాళ్లింటికి వెళ్దాం’ అని నా పిల్లలు అనడంతో మార్చిలో వారిని దిల్లీలో ఉండే మా అమ్మ వాళ్లింటికి తీసుకెళ్లా. నేనూ అక్కడ రెండు రోజులుండి పిల్లల్ని అక్కడే వదిలేసి తిరిగి భోపాల్‌ వచ్చేశా. అక్కడ వాళ్లూ ఇంట్లో నుంచి బయటికి వెళ్లరు.. ఎలాగూ నాకు స్కూల్‌కు సెలవులు.. మా వారికీ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌.. ఒకవేళ నిత్యావసర సరుకులు కోసం బయటికి వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం.. కాబట్టి రిస్క్‌ చాలా తక్కువ అని భావించా. ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి.. బయట పరిస్థితులూ రోజురోజుకీ దిగజారిపోతున్నాయి.. అయినా మానసికంగా ధైర్యంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం అలవాటు చేసుకున్నాం.

చూస్తుండగానే నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి.. పిల్లలు దిల్లీ వెళ్లి నెల దాటింది.. ఇక వాళ్లను ఇక్కడికి తీసుకొచ్చేద్దాం అన్న ఉద్దేశంతో ఏప్రిల్‌ రెండో వారంలో నేనూ అమ్మ వాళ్లింటికి వెళ్లా.. మరో రెండు రోజులు అక్కడ గడిపి పిల్లలతో కలిసి మా ఇంటికి చేరుకున్నాం. అయితే అసలు సమస్య అప్పుడే మొదలైంది. రెండు రోజులయ్యాక ఒంట్లో కాస్త నలతగా అనిపించింది. ప్రయాణం చేశాను కదా.. దాని వల్లేమో అనుకున్నా. కానీ ఆ తర్వాత జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం, విపరీతమైన తలనొప్పి, అలసట.. ఒకదాని తర్వాత ఒకటి ఒక్క రోజు వ్యవధిలోనే నన్ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన నేను మా ఫ్యామిలీ ఫిజీషియన్‌ సలహా మేరకు కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నా. నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సాయంత్రానికి రిపోర్టు వచ్చింది. మళ్లీ ఈ రిపోర్ట్‌ను డాక్టర్‌కు పంపి.. ఆయన సలహా మేరకు హోమ్‌ ఐసొలేషన్‌లో ఉంటూనే మందులు వాడడం ప్రారంభించా.

ఇక మరోవైపు నాకు పాజిటివ్‌ అని తేలడంతో.. అమ్మానాన్నల్ని కూడా టెస్ట్ చేయించుకోమన్నా.. ఎందుకైనా మంచిదని నా భర్త, పిల్లలు కూడా పరీక్షలు చేయించుకున్నారు. దేవుడి దయ వల్ల వాళ్లందరికీ నెగెటివ్‌ రావడంతో ఒక్కసారిగా గుండె భారం దిగినట్లనిపించింది. మరోవైపు నేను డాక్టర్‌ సూచించిన మందులు వాడుతున్న క్రమంలో రెండు రోజులు నెమ్మదిగా కోలుకున్నట్లే అనిపించింది.. ఆ తర్వాత ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. వెంటనే ఆక్సీమీటర్‌లో శ్యాచురేషన్‌ చెక్‌ చేసుకుంటే 80 కంటే తక్కువకు పడిపోయినట్లు చూపించింది. అప్పటికప్పుడు అంబులెన్స్‌ సేవలు అందుబాటులో లేకపోవడంతో మా వారే నన్ను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతి కష్టమ్మీద అక్కడ బెడ్‌ దొరికింది.. ఆక్సిజన్‌ కూడా పెట్టారు. అయినా ఆక్సిజన్‌ స్థాయుల్లో ఎలాంటి పెరుగుదల కనిపించకపోవడంతో సీటీ స్కాన్‌ చేసి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ఉందని చెప్పారు. దాంతో అప్పటిదాకా నాలో ఉన్న ధైర్యం ఒక్కసారిగా ఆవిరైపోయింది.. అసలు నేను ఈ మహమ్మారి నుంచి తిరిగి కోలుకుంటానా? నా పిల్లల్ని చూస్తానా? అన్న సందేహాలు నా మదిని తొలిచేశాయి.

అయితే ఈ ఆస్పత్రిలో వెంటిలేటర్‌ సదుపాయం లేకపోవడంతో నన్ను అక్కడికి దగ్గర్లోని మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వెంటిలేటర్‌ అమర్చారు. అయినా మొదట్లో నా ఆరోగ్యం విషయంలో అంత పురోగతి కనిపించకపోవడంతో రోజులు గడుస్తోన్నా ఐసీయూలోనే ఉండాల్సి వచ్చింది. ఇలా సుమారు నెల రోజుల పాటు నాకు వెంటిలేటర్ పైనే చికిత్స అందించారు డాక్టర్లు. మొదట్లో నా ఆరోగ్యం విషయంలో ఎంతగానో కలత చెందిన నాకు.. అక్కడి డాక్టర్లు, నర్సులే కొండంత అండగా నిలిచారు. కేవలం మందులివ్వడం, చికిత్స చేయడమే కాదు.. నేను కోల్పోయిన ధైర్యాన్ని తిరిగి పొందానంటే అది వారి మాటల చలవే! మరోవైపు నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కూడా ‘అమ్మా నీకేం కాదు.. నువ్వు త్వరలోనే ఇంటికొచ్చేస్తావ్‌.. ఎప్పటిలాగే మాతో ఆడుకుంటావ్‌!’ అంటూ నాలో ధైర్యం నింపారు. ఇలా నెల పాటు ఆస్పత్రి బెడ్ పైనే ఉండి మొండిగా వైరస్‌తో పోరాటం చేసి ఇటీవలే కోలుకొని ఇంటికి చేరాను. అయినా ఇంకొన్నాళ్ల పాటు నా కుటుంబానికి దూరంగా ఉండడమే వారికి శ్రేయస్కరమని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలో డాక్టర్‌ సూచించిన మందులు, పోషకాహారం తీసుకుంటున్నా.. మరోవైపు నిపుణులు చెప్పినట్లుగా శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తూ నా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపరచుకుంటున్నా.

******

మరి, ఇంతటి కఠిన పరిస్థితుల్ని జయించి.. మీ అందరి ముందుకొచ్చి నా అనుభవాలను పంచుకుంటున్నానంటే వైరస్‌తో నేను శారీరకంగా, మానసికంగా ఎంత వేదనను అనుభవించానో మీరు అర్థం చేసుకోవచ్చు. నిజానికి నాకు అంతకుముందు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు.. రోగనిరోధక శక్తీ ఎక్కువే! అయినా వైరస్‌ బారిన పడ్డా! ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో నెల రోజుల పాటు వెంటిలేటర్ పైనే ఉన్నానంటే ప్రస్తుత పరిస్థితులు, వైరస్‌ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వైరస్‌ను ఎవరూ నిర్లక్ష్యం చేయకండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. అర్హత ఉన్న వారు టీకా వేయించుకోండి. ఒకవేళ కరోనా సోకినా భయపడకుండా నిపుణుల సలహాలు పాటిస్తూ ధైర్యంగా ఉంటే ఈ మహమ్మారిని తుదముట్టించచ్చు.. అందరూ ఇలా మానసికంగా దృఢంగా ఉంటే ఏ ఒక్కరూ ఆపదలో పడరు..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్