నా దృష్టిలో రక్షా బంధన్‌ అంటే అదే!

అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షా బంధన్‌. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఈరోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. అన్నాతమ్ముళ్లు ఉంటే ఓకే.. మరి సోదరులు లేని అక్కాచెల్లెళ్లు ఈ పండుగను జరుపుకోకూడదా? అంటే నిస్సందేహంగా జరుపుకోవచ్చంటోంది బాలీవుడ్‌ బ్యూటీ భూమీ పెడ్నేకర్‌.

Published : 22 Aug 2021 09:12 IST

(Photo: Instagram)

అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకొనే పండుగ రక్షా బంధన్‌. తమ సోదరులు జీవితాంతం తమకు రక్షగా ఉండాలని ఈరోజున వారి చేతికి అక్కాచెల్లెళ్లు రాఖీ కడతారు. అన్నాతమ్ముళ్లు ఉంటే ఓకే.. మరి సోదరులు లేని అక్కాచెల్లెళ్లు ఈ పండుగను జరుపుకోకూడదా? అంటే నిస్సందేహంగా జరుపుకోవచ్చంటోంది బాలీవుడ్‌ బ్యూటీ భూమీ పెడ్నేకర్‌. మన ప్రియమైన వారందరికీ రక్షగా నిలవడమే ‘రక్షా బంధన్‌’ అంటోన్న ఆమె ఈ సందర్భంగా తన రాఖీ పండుగ విశేషాలు పంచుకుంది.

బాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఆకట్టుకునే నటీమణుల్లో భూమి కూడా ఒకరు. ‘టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా’, ‘శుభ్‌ మంగళ్‌ సావ్‌ధాన్‌’, ‘సోంఛిరియా’, ‘శాండ్‌ కీ ఆంఖ్‌’, ‘బాలా’, ‘భూత్’, ‘డోలీ కిట్టీ ఔర్‌ వో ఛమక్తే సితారే’ తదితర చిత్రాలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం భూమి నటిస్తోన్న సినిమాల్లో ‘రక్షా బంధన్‌’ కూడా ఒకటి. ఈ సందర్భంగా రాఖీ పండుగ గురించి మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

చెల్లి, అమ్మకి కూడా రాఖీ కడతాను!

‘రక్షా బంధన్‌ అంటే కేవలం అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్ల పండగే కాదు. మన ప్రియమైన వారందరికీ రక్షగా నిలవడమే ‘రాఖీ’ ఉద్దేశమని నేను నమ్ముతాను. రక్షా బంధన్‌ రోజున నేను నా చెల్లి (సమీక్షా పెడ్నేకర్‌), అమ్మ (సుమిత్రా పెడ్నేకర్‌)కు రాఖీ కడతాను. తిరిగి వారు కూడా నాకు రాఖీ కడతారు. మేమెంతో ఉత్సాహంగా ఈ పండుగను సెలబ్రేట్‌ చేసుకుంటాం’ అని తన రాఖీ పండుగ విశేషాలు చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

ఇంట్లో పెళ్లి చర్చలు జరగవు!

భూమి బాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తుంటే ఆమె సోదరి సమీక్ష లాయర్‌గా ప్రాక్టీస్‌ చేస్తోంది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న భూమి పెళ్లితో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది. 
‘మా అమ్మానాన్నలిద్దరూ అభ్యుదయ భావాలున్న వారే. నేటి పరిస్థితులపై వారికి పూర్తి అవగాహన ఉంది. వారు మా స్వేచ్ఛకు అత్యంత ప్రాధాన్యాన్నిస్తారు. పెళ్లికి సంబంధించి ఇంట్లో మా మధ్య పెద్దగా చర్చలు జరగవు. సమాజంలో బాధ్యాయుతమైన పౌరులుగా బతకాలని మాత్రమే నాకు, నా చెల్లికి సలహాలిస్తుంటారు. మేం ఆర్థికంగా బాగా స్థిరపడాలని, జ్ఞాన సముపార్జన కోసం ప్రపంచమంతా తిరిగి రావాలని, మానసికంగా బలంగా మారాలని అమ్మానాన్నలు ఆకాంక్షిస్తుంటారు.’

పెళ్లి చేసుకోకపోతే నష్టమేమీ లేదు!

‘పెళ్లి చేసుకోకపోయినంత మాత్రాన అమ్మాయిలకు కలిగే నష్టం ఏమీ లేదు. ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది వారి ఇష్టాయిష్టాల ప్రకారమే జరగాలి. కానీ ప్రస్తుత సమాజంలో అలాంటి పరిస్థితులు లేవు. కొంచెం వయసు రాగానే అమ్మాయిలపై పెళ్లి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితులు మారాలి. అలాగని నేను వివాహ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. దాంపత్య బంధాన్ని గట్టిగా విశ్వసిస్తాను. అమ్మా-నాన్న, ఆంటీ-అంకుల్‌... ఇలా పెళ్లితో తమ అనుబంధాన్ని గట్టిగా ముడేసుకున్న వారిని చాలామందిని చూస్తున్నాను. నాకు కూడా పెళ్లి చేసుకోవాలనుంది. నలుగురు పిల్లలకు తల్లిగా మారాలనుంది’ అని తన మనసులోని మాటను చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్