Published : 18/11/2021 16:23 IST

అద్దెగర్భం ద్వారా అమ్మతనాన్ని పొందారు!

పెళ్లైన ప్రతి మహిళా మాతృత్వాన్ని పొందాలని, తద్వారా తన జీవితాన్ని సంపూర్ణం చేసుకోవాలని ఆరాటపడుతుంది. అయితే పలు ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఇతర కారణాలు.. ఎంతోమంది స్త్రీలను అమ్మతనానికి దూరం చేస్తున్నాయి. ఇలాంటి వారందరికీ అద్దెగర్భం (సరోగసీ) ఓ వరంలా పరిణమించిందని చెప్పచ్చు. ఇలా సామాన్యులే కాదు.. పలువురు సెలబ్రిటీలూ ఈ పద్ధతిని ఆశ్రయించి అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందారు. ఆ జాబితాలో తాజాగా చేరిపోయారు ప్రీతీ జింటా-జీన్‌ గుడ్‌ఎనఫ్‌ దంపతులు. సరోగసీ విధానంలో కవల పిల్లలకు జన్మనిచ్చిన ఈ జంట.. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా ద్వారా అందరితో పంచుకుంటూ మురిసిపోయింది. తమ పిల్లల పేర్లను తెలియజేస్తూ ఉబ్బితబ్బిబ్బైంది. ఈ నేపథ్యంలో అద్దె గర్భం ద్వారా అమ్మతనాన్ని పొందిన కొందరు సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం..


ప్రీతీ జింటా - జీన్‌ గుడ్‌ఎనఫ్‌

తన అందం, అభినయంతో సినీ ప్రేక్షకుల్ని అలరించిన ప్రీతీ జింటా.. 2016లో అమెరికన్‌ వ్యాపారవేత్త జీన్‌ గుడ్‌ఎనఫ్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత తన భర్తతో కలిసి క్యాలిఫోర్నియాలో స్థిరపడ్డ ఆమె.. సోషల్‌ మీడియా ద్వారా అనునిత్యం తన ఫ్యాన్స్‌కి దగ్గరగానే ఉంటోంది. అయితే తాజాగా అమ్మతనంలోకి అడుగుపెట్టిందీ సొట్టబుగ్గల బ్యూటీ. తాను అద్దెగర్భం ద్వారా అమ్మయినట్లు, తమకు కవల పిల్లలు పుట్టారన్న శుభవార్తను సోషల్‌ మీడియాలో తన ఫ్యాన్స్‌తో తాజాగా పంచుకుంది ప్రీతి.
‘ఈ రోజు నేను మీ అందరికీ ఓ శుభవార్త చెప్పబోతున్నా. మాకు కవల పిల్లలు పుట్టారు. మా జీవితాల్లో కొత్త దశ ప్రారంభమైంది. నేను, జీన్‌ ప్రస్తుతం అమితానందంలో మునిగిపోయాం. మా చిన్నారులకు జై జింటా గుడ్‌ఎనఫ్‌, జియా జింటా గుడ్‌ఎనఫ్‌.. అనే పేర్లు పెట్టాం. ఈ జర్నీలో భాగమైన డాక్టర్లు, నర్సులు, సరోగేట్‌ మదర్‌కి థ్యాంక్యూ!!’ అంటూ తాను అమ్మయిన విషయాన్ని పంచుకుంటూ మురిసిపోయిందీ డింపుల్‌ బ్యూటీ. దీంతో ప్రస్తుతం ఈ జంటకు సెలబ్రిటీలు, సామాన్యుల దగ్గర్నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


శిల్పా శెట్టి - రాజ్‌ కుంద్రా

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే ముద్దుగుమ్మల్లో శిల్పా శెట్టి ముందు వరుసలో ఉంటుంది. 2009లో రాజ్‌కుంద్రాను వివాహమాడిన ఆమెకు.. 2012లో వియాన్‌ అనే కొడుకు పుట్టాడు. అయితే ఆ తర్వాత పలు అనారోగ్య కారణాల వల్ల మరో బిడ్డను కనలేకపోయిన ఆమె.. సరోగసీ విధానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే 2020లో సమీషా అనే పాపకు తల్లైంది శిల్ప. ఆ సమయంలో ఈ శుభవార్తను అందరితో పంచుకుంటూ.. ‘వియాన్‌ పుట్టాక మరో చిన్నారి కోసం ప్రయత్నించాం. అయితే దురదృష్టవశాత్తూ నేను గర్భం ధరించినప్పుడల్లా APLA (Anti Phospho Lipid Anti Bodies) అనే ఆరోగ్య సమస్య నా ఆశలను చిదిమేస్తూ వచ్చింది. దీని కారణంగా నాకు రెండుసార్లు అబార్షన్‌ అయింది. ఇక బిడ్డను దత్తత తీసుకుందామనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. దీంతో ఆఖరి ప్రయత్నంగా అద్దెగర్భాన్ని ఆశ్రయించాం. అలా వియాన్‌ పుట్టాక ఎనిమిదేళ్లకు సమీషా మా కుటుంబంలోకి అడుగుపెట్టి మా జీవితాలను పరిపూర్ణం చేసింది..’ అంటూ చెప్పుకొచ్చిందీ బాలీవుడ్‌ మామ్‌.


సన్నీ లియోని - డేనియల్‌ వెబర్‌

పిల్లలతోనే కుటుంబం పరిపూర్ణమవుతుందంటోంది బాలీవుడ్‌ బ్యూటీ సన్నీ లియోని. 2011లో డేనియల్‌ వెబర్‌ని వివాహమాడిన ఆమె.. 2017లో నిషా అనే పాపను దత్తత తీసుకుంది. ఆ తర్వాతి ఏడాదే సరోగసీ విధానంలో మరో ఇద్దరు కవల అబ్బాయిలకు తల్లైంది సన్నీ. ‘2017, జూన్‌ 21న నిషా దత్తత అధికారికంగా ఖరారైంది. ఇక అదే రోజు కవల అబ్బాయిలు కావాలని మేము అద్దెగర్భాన్ని ఆశ్రయించాం. ఇలా అతి తక్కువ సమయంలోనే దేవుడు మాకు ముగ్గురు పిల్లల్ని ప్రసాదించాడు. నిజానికి పిల్లలతోనే కుటుంబం పరిపూర్ణమవుతుంది. దత్తత తీసుకోవడం, సరోగసీ విధానాన్ని ఆశ్రయించడం.. ఈ రెండు నిర్ణయాలు పూర్తిగా నా వ్యక్తిగతం. అటు వృత్తికి ఆటంకం కలగకుండా, ఇటు అమ్మతనాన్ని పొందే ఆలోచనతోనే ఈ నిర్ణయాలు తీసుకున్నా..’ అంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ బాలీవుడ్‌ మామ్‌. ప్రస్తుతం ఓవైపు సినిమాల్లో కొనసాగుతూనే.. మరోవైపు తన పిల్లల ఆలనా పాలనలో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది సన్నీ.


లీసా రే - జాసన్‌ డెహ్నీ

జాసన్‌ డెహ్నీ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న బాలీవుడ్‌ బ్యూటీ లీసా రేకు 2009లో Myeloma అనే ఒక రకమైన బ్లడ్‌ క్యాన్సర్‌ నిర్ధారణ అయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు కోలుకున్న ఆమె.. క్యాన్సర్‌ను నయం చేసుకోవడానికి వాడిన మందుల కారణంగా అమ్మతనానికి దూరమైంది. దీంతో సరోగసీ పద్ధతిని ఆశ్రయించిన లీసా.. 2018లో సూఫీ, సొలీల్‌ అనే కవల ఆడపిల్లలకు అమ్మయింది. ఇదే విషయాన్ని, తన పిల్లలతో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అమ్మగా మురిసిపోయిందీ ముద్దుగుమ్మ.


ఏక్తాకపూర్

బాలీవుడ్ దిగ్గజ నటుడు జితేంద్ర కపూర్ - శోభా కపూర్‌ల గారాల పట్టిగానే కాదు.. ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకుంది ఏక్తాకపూర్. బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రిగా చిత్రపరిశ్రమలో దూసుకుపోతున్న ఏక్తా.. 2019, జనవరి 27న సరోగసీ ద్వారా పండంటి మగబిడ్డకు అమ్మయింది. అయితే తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఈ ఉద్దేశంతోనే తన 36 ఏళ్ల వయసులో అండాల్ని నిల్వ చేసుకున్నానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ బాలీవుడ్‌ మామ్‌. 2016లో ఏక్తా తమ్ముడు తుషార్ కపూర్ కూడా సరోగసీ విధానంలోనే లక్ష్య్ కపూర్ అనే బాబుకు తండ్రయ్యాడు.


మంచు లక్ష్మీప్రసన్న - ఆండీ శ్రీనివాసన్

టాలీవుడ్ ముద్దుగుమ్మ, మంచు వారి వారసురాలు మంచు లక్ష్మీప్రసన్న కూడా అద్దె గర్భం ద్వారా అమ్మతనాన్ని పొందింది. మంచు లక్ష్మి - ఆండీ శ్రీనివాసన్ దంపతులు 2014లో సరోగసీ విధానంలో నిర్వాణ అనే పాపకు తల్లిదండ్రులయ్యారు. దీంతో సరోగసీ విధానం ద్వారా తల్త్లెన తొలి టాలీవుడ్ సెలబ్రిటీ మామ్‌గా నిలిచారు మంచు లక్ష్మి. అప్పట్నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలోనూ తన ముద్దుల కూతురితో దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతోందీ అందాల అమ్మ.

వీరు కూడా!

* బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్‌ 2013లో సరోగసీ ద్వారా అబ్రామ్‌ అనే బాబుకు జన్మనిచ్చారు. 1991లో షారుఖ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న గౌరికి ఆర్యన్, సుహానా అనే ఇద్దరు పిల్లలు పుట్టాక, 2013లో అబ్రామ్‌ జన్మించాడు.

* ఇటీవలే విడాకుల ప్రకటన చేసిన ఆమిర్‌ ఖాన్‌ - కిరణ్‌ రావ్ దంపతులు కూడా సరోగసీ (ఆర్టిఫీషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ) పద్ధతిలోనే ఆజాద్ రావ్‌ ఖాన్ అనే బాబుకు జన్మనిచ్చారు.

* కండలవీరుడు సల్మాన్ సోదరుడు సోహైల్‌ఖాన్, సీమాసచ్‌దేవ్ దంపతులు కూడా తమ పెళ్లయి దాదాపు పది సంవత్సరాలు గడిచాక, 2011లో సరోగసీ పద్ధతి ద్వారా యోహాన్ అనే బిడ్డకు జన్మనిచ్చారు. వారికి ఇది రెండో సంతానం. మొదటి బిడ్డ పేరు నిర్వాన్.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని