Break Up: పాజిటివ్‌గా తీసుకున్నారు.. జీవితాన్ని గెలిచారు!

నచ్చితే ప్రేమించుకోవడం, కొన్నాళ్లు కలిసుండడం, నచ్చకపోతే విడిపోవడం.. సెలబ్రిటీల జీవితంలో ఇవన్నీ కామన్‌. అయితే బ్రేకప్‌ని కూడా పాజిటివ్‌గా స్వీకరించి..

Updated : 24 Dec 2021 20:07 IST

నచ్చితే ప్రేమించుకోవడం, కొన్నాళ్లు కలిసుండడం, నచ్చకపోతే విడిపోవడం.. సెలబ్రిటీల జీవితంలో ఇవన్నీ కామన్‌. అయితే బ్రేకప్‌ని కూడా పాజిటివ్‌గా స్వీకరించి.. జీవితంలో ముందుకు సాగాలని చెబుతున్నారు కొందరు తారలు. బాలీవుడ్‌ దివా సుస్మితా సేన్‌ కూడా తాజాగా తన బాయ్‌ఫ్రెండ్‌ రోమన్‌ షాల్‌తో ప్రేమకు ప్యాకప్‌ చెప్పి ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది. ‘స్నేహితులుగా కలిశాం.. స్నేహితులుగానే విడిపోతున్నాం..’ అంటూ తన మూడేళ్ల ప్రేమకు స్వస్తి పలికిందీ బాలీవుడ్‌ అందం. ఈ నేపథ్యంలో బ్రేకప్‌నీ సానుకూలంగా స్వీకరించి ముందుకు సాగుతున్న కొందరు ముద్దుగుమ్మల గురించి తెలుసుకుందాం రండి..

ప్రశాంతతను మించింది లేదు!

2018లో ప్రేమలో పడ్డారు సుస్మితా సేన్‌ - రోమన్‌ షాల్‌. సుమారు 15 ఏళ్ల వయోభేదం ఉన్న కారణంగా.. సమాజం నుంచి ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంటూ ముందుకు సాగిందీ జంట. సుస్మిత దత్త పుత్రికల్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకున్నాడు రోమన్‌. ఇలా చిలకా గోరింకల్లా మూడేళ్ల పాటు కలిసున్న ఈ జంట.. తాజాగా తమ బ్రేకప్‌ని ప్రకటించి తమ ఫ్యాన్స్‌ని విస్మయానికి గురిచేసింది. ‘స్నేహితులుగా కలిశాం.. ఇక ఎప్పటికీ స్నేహితులుగానే కొనసాగుతాం.. కానీ మా మధ్య అనుబంధం ముగిసింది.. కానీ ప్రేమ కొనసాగుతుంది..’ అంటూ రోమన్‌తో తన బ్రేకప్‌ని అధికారికంగా ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో పంచుకుంది సుస్మిత. అంతేకాదు.. బ్రేకప్‌నీ సానుకూలంగా స్వీకరించాలని.. ‘ప్రశాంతతను మించింది లేదం’టోందీ బాలీవుడ్‌ అందం.

 


స్వీయ ప్రేమ ముఖ్యం!

ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో కొన్నేళ్ల పాటు ప్రేమాయణాన్ని కొనసాగించింది బెల్లీ బ్యూటీ ఇలియానా. ఒకానొక సందర్భంలో ‘అత్యుత్తమ భర్త’ అంటూ అతడిని ఆకాశానికెత్తేసింది. అయితే వీళ్లిద్దరికి పెళ్లైందా, లేదా అన్న విషయంలో ఎప్పుడూ పెదవి విప్పలేదు ఇల్లూ బేబీ. ఇక 2019 ఆగస్టులో తన నుంచి విడిపోయినట్లు ప్రకటించిందీ బాలీవుడ్‌ అందం.

‘అనుబంధం అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది. ఇష్టపడిన వ్యక్తి నుంచి విడిపోయిన తర్వాత మనసు కకావికలం అవడం సహజం. అయితే దాన్నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత సులభంగా ముందుకెళ్లచ్చు. ఈ విషయంలో నేను కాస్త నెర్వస్‌ అయినా థెరపిస్ట్‌ సహాయంతో దాన్నుంచి త్వరగా బయటపడగలిగా. నిజానికి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే కుటుంబం, స్నేహితుల విలువ తెలుస్తుందంటారు. అలాగే మనల్ని మనం అంగీకరించడం, ప్రేమించుకోవడం.. వంటివి కూడా తిరిగి మనం గాడిలో పడేలా చేస్తాయి..’ అని చెప్పిందీ గోవా బ్యూటీ.


ప్రతిదీ పాజిటివ్‌గా తీసుకోవాలి!

జీవితమంటే సానుకూలాంశాలే కాదు.. ప్రతికూలతలూ ఉంటాయంటోంది శృతి హాసన్‌. లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన సంగీత కళాకారుడు మైఖేల్‌ కోర్సెల్‌తో రెండేళ్లు ప్రేమలో ఉన్న ఆమె.. ఆ తర్వాత తమ అనుబంధానికి బ్రేకప్‌ చెప్పింది. అయితే ముందు ఈ విషయాన్ని మైఖేల్‌ ట్విట్టర్‌ పోస్ట్‌ ద్వారా పంచుకున్నాడు. ఇక ఆపై ఓ ఇంటర్వ్యూలో భాగంగా శృతి.. ‘జీవితమంటే సానుకూలతలే కాదు.. ప్రతికూలతలూ ఉంటాయి. అయితే వాటిని పాజిటివ్‌గా స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. నేనూ అదే చేశా. తద్వారా సంతోషంగా ముందుకు సాగుతున్నా..’ అంటూ తమ బ్రేకప్‌ గురించి చెప్పకనే చెప్పిందీ టాలీవుడ్‌ అందం.


వాటికి మనం బాధ్యులం కాదు!

అధికారికంగా ప్రకటించకపోయినా కొన్నేళ్లు ప్రేమబంధంలో ఉన్నారు కత్రినా కైఫ్‌, రణ్‌బీర్‌ కపూర్‌. అయితే ఆ తర్వాత ఇద్దరూ విడిపోయినా తమ బ్రేకప్‌ గురించి చెప్పీ చెప్పనట్లుగానే ఓ సందర్భంలో పంచుకుంది క్యాట్‌. ‘జీవితంలో ఏది జరిగినా అది మన మంచికే అనుకోవాలి. బ్రేకప్‌ కూడా అలాంటిదే! కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే పొరపాట్లు జరుగుతుంటాయి. వాటికి మనం బాధ్యులం కాదు. అయినా ఆ బాధ మనల్ని వెంటాడుతుంటుంది. ఈ క్రమంలో మనం ముందుకు సాగాలంటే మన జీవితంలో జరిగిన విషయాలను, తీసుకున్న నిర్ణయాలను పునఃపరిశీలించుకోవాలి. తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి.. ఎదుటివారి ప్రేమను పొందడం మంచి విషయమే కావచ్చు.. కానీ మిమ్మల్ని మీకంటే బాగా ఇంకెవ్వరూ ప్రేమించలేరన్నది నగ్న సత్యం..’ అంటోందీ బాలీవుడ్‌ అందం. ప్రేమ-బ్రేకప్‌ విషయంలో తన జీవితంలో పలు ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. తన ఇష్టసఖుడు విక్కీతో పెళ్లి పీటలెక్కి ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తోందీ ముద్దుగుమ్మ.


వీళ్లే కాదు.. దీపికా పదుకొణే-రణ్‌బీర్‌ కపూర్‌, ప్రియాంక చోప్రా - షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌ - షాహిద్‌ కపూర్‌, కరిష్మా కపూర్‌ - అభిషేక్‌ బచ్చన్‌.. వంటి సెలబ్రిటీ జంటలు కూడా పలు కారణాల రీత్యా తమ ప్రేమాయణానికి మధ్యలోనే బ్రేకప్‌ చెప్పారు. అయితే ఈ క్రమంలో వ్యక్తిగతంగా ఎదురైన సమస్యలు, బయటి నుంచి వచ్చే విమర్శల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు.. ఎవరి జీవితాల్లో వారు స్థిరపడ్డారు.

మరి, మీ జీవితంలోనూ బ్రేకప్‌ మిగిల్చిన చేదు అనుభవాలున్నాయా? అయితే వాటిని మీరు ఎలా అధిగమించారు? పాజిటివ్‌గా ఎలా ముందుకెళ్లగలిగారు? మీ అభిప్రాయాలను, సలహాలను Contactus@vasundhara.net ద్వారా మాతో పంచుకోండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్