స్థూలకాయం.. ఈ అపోహలు మీకూ ఉన్నాయా?

మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవన విధానంలో ఎన్నెన్నో మార్పులు చేసుకుంటాం. అయితే ఒక్కోసారి ఇలాంటి మార్పులే మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంటాయి. కొన్ని అనారోగ్యాల్ని, దీర్ఘకాలిక సమస్యల్ని కట్టబెడతాయి.

Published : 05 Mar 2024 19:51 IST

మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవన విధానంలో ఎన్నెన్నో మార్పులు చేసుకుంటాం. అయితే ఒక్కోసారి ఇలాంటి మార్పులే మన ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంటాయి. కొన్ని అనారోగ్యాల్ని, దీర్ఘకాలిక సమస్యల్ని కట్టబెడతాయి. స్థూలకాయం కూడా అలాంటిదే. చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారిపై ప్రభావం చూపుతూ.. ఇతర జబ్బులకూ కారణమవుతోందీ ఆరోగ్య సమస్య. ఇదిలా ఉంటే దీని గురించి కొంతమందిలో నెలకొన్న అపోహలు వారిని మానసికంగానూ కుంగదీస్తున్నాయని, ఇది కూడా ఒక రకంగా తీవ్రతను పెంచుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే స్థూలకాయానికి సంబంధించిన అసలు వాస్తవాలేంటో తెలుసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సలహా ఇస్తున్నారు.

సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం చేయకపోవడం, నిద్రలేమి, మానసిక సమస్యలు.. వంటివన్నీ స్థూలకాయానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా మన శరీరంలోకి చేరే క్యాలరీలు, ఖర్చయ్యే క్యాలరీల మధ్య శక్తి సమతుల్యత లోపించడం వల్లే క్రమంగా బరువు పెరిగి అది కొన్నాళ్లకు ఊబకాయంగా పరిణమిస్తుందంటున్నారు. అయితే ఇది దీర్ఘకాలిక సమస్యే అయినా ఆరోగ్యకరమైన అలవాట్లతో దీన్ని అదుపు చేసుకోవచ్చని, బరువు కూడా తగ్గచ్చని సలహా ఇస్తున్నారు.

అపోహ: అనారోగ్యకరమైన జీవనశైలి ఒక్కటే ఊబకాయానికి ప్రధాన కారణం.

వాస్తవం: ఏది పడితే అది తినడం, వ్యాయామం చేయకపోవడం.. ఇలాంటి అనారోగ్యకరమైన జీవనశైలి ఒక్కటే స్థూలకాయానికి దారితీస్తుందని చాలామంది అనుకుంటుంటారు. అయితే వీటితో పాటు ఒత్తిడి, ఆందోళనలు, నిద్రలేమి, హార్మోన్ల అసమతుల్యత, దీర్ఘకాలిక నొప్పులు, కొన్ని ఆరోగ్య సమస్యలకు వాడే మందులు.. వంటివన్నీ కూడా ఊబకాయానికి దారితీసే అవకాశాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి కేవలం ఆహార, వ్యాయామ నియమాల పైనే దృష్టి పెట్టడం కాకుండా మానసికంగానూ దృఢంగా ఉండడం చాలా ముఖ్యం. ఇక నొప్పులు, ఆరోగ్య సమస్యలకు వాడే మందుల విషయంలో మీ శారీరక మార్పుల్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ నిపుణుల సలహాలు తీసుకోవడం తప్పనిసరి.

అపోహ: అత్యంత వేగంగా బరువు తగ్గడమే స్థూలకాయానికి పరిష్కారం.

వాస్తవం: అధికంగా పెరిగిపోయిన బరువును తగ్గించుకోవడం వల్ల స్థూలకాయమే కాదు.. ఎన్నో అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చని చెబుతున్నారు నిపుణులు. అయితే అత్యంత వేగంగా బరువు తగ్గాలనే ఉద్దేశంతో కొంతమంది డైటింగ్‌ చేయడం, విపరీతంగా వ్యాయామాలు చేయడం.. వంటి మార్గాల్ని అన్వేషిస్తుంటారు. ఫలితంగా జీవక్రియల పనితీరు మందగించడంతో పాటు కండరాల సామర్థ్యం తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే శరీరంలో పోషకాహార లోపం, నిద్ర సంబంధిత సమస్యలు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం.. వంటి లేనిపోని అనారోగ్యాలకు దారితీస్తాయి. మరి, ఇలాంటి దుష్ప్రభావాలు లేకుండా బరువు తగ్గాలంటే అందుకోసం ఆరోగ్యకరమైన మార్గాలు ఉండనే ఉన్నాయి. ఈ క్రమంలో నిపుణుల సలహా మేరకు చక్కటి పోషకాహారం తీసుకోవడం, నిర్ణీత సమయం వ్యాయామానికి కేటాయించడంతో పాటు మానసిక ఆరోగ్యం కోసం సుఖ నిద్ర కూడా ముఖ్యమే. అంతేకాదు.. ఇలా బరువు తగ్గాక శరీరంపై వచ్చే స్ట్రెచ్ మార్క్స్ విషయంలోనూ ముందు నుంచే మానసికంగా సిద్ధపడాలంటున్నారు నిపుణులు.

అపోహ: వ్యాయామం చేయకుండా కేవలం క్యాలరీలు తగ్గించడం వల్ల ఎక్కువగా బరువు తగ్గచ్చు.

వాస్తవం: బరువు తగ్గాలనుకునే వారు, అదుపులో ఉంచుకోవాలనుకునే వారు క్యాలరీలు తగ్గించి తీసుకోవాలనుకోవడం లేదంటే పూర్తిగా మానేయాలనుకోవడం సహజం. అయితే వ్యాయామం చేయకుండా కేవలం క్యాలరీలను తగ్గించడం వల్ల కూడా బరువును అదుపులో ఉంచుకోవచ్చనుకుంటుంటారు కొంతమంది. అయితే ఇది కొంతవరకు నిజమే అయినా దీని ప్రభావం మాత్రం తక్కువ సమయానికే పరిమితమంటున్నారు నిపుణులు. అదే దీర్ఘకాలం పాటు బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటే శరీరానికి సరిపడా క్యాలరీలు లభించే పండ్లు, కాయగూరల్ని తీసుకుంటూనే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంపై దృష్టి పెట్టమంటున్నారు. ఎందుకంటే అనారోగ్యకరమైన ఆహారం (జంక్‌ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, డెజర్ట్స్‌.. మొదలైనవి) ద్వారా లభించే క్యాలరీల కంటే ఆరోగ్యకరమైన (పండ్లు, కాయగూరలు వంటివి) పదార్థాల నుంచి శరీరానికి అందే క్యాలరీలే మంచివని నిపుణులు సలహా ఇస్తున్నారు.

అపోహ: తల్లిపాలు తాగిన పిల్లలకు స్థూలకాయం రాదు.

వాస్తవం: డబ్బా పాలు తాగిన పిల్లలతో పోల్చితే తల్లిపాలు తాగిన పిల్లలు స్థూలకాయం బారిన పడే అవకాశాలు కొంతవరకు తక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే తల్లిపాలు తాగిన పిల్లలందరికీ స్థూలకాయం రాదని చెప్పలేమని, వారు పెరిగి పెద్దయ్యే క్రమంలో కొన్ని అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు వారిని స్థూలకాయులుగా మార్చే ప్రమాదమూ లేకపోలేదని హెచ్చరిస్తోంది. అందుకే పిల్లలకు చిన్నతనం నుంచే సంపూర్ణ పోషకాలు లభించే ఇంటి ఆహారాన్నే అందించడం శ్రేయస్కరమని చెబుతోంది. దీంతో పాటు వ్యాయామాన్నీ వారి జీవన విధానంలో భాగం చేయడం మర్చిపోవద్దు.

అపోహ: తక్కువ ఆహారం ఎక్కువసార్లు తింటే ఊబకాయం వస్తుంది.

వాస్తవం: ఇది కూడా ఓ రకమైన అపోహే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే చిప్స్, కుకీస్, చక్కెరలు ఎక్కువగా ఉండే పదార్థాలు.. వంటి అనారోగ్యపూరిత ఆహారం ఎక్కువగా తింటే స్థూలకాయానికి దారితీయచ్చు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో ఇలా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా నట్స్‌, పండ్లు, కాయగూరలు, పండ్ల రసాలను భోజనానికి మధ్యలో తీసుకోవడం.. వేళకు భోంచేయడం, తక్కువ ఆహారం ఎక్కువసార్లు తినడం.. వంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే శరీరంలో జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. ఇది అంతిమంగా బరువును అదుపులో ఉంచడానికి/బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.

మరి, ఊబకాయం విషయంలో మీలోనూ ఇలాంటి అపోహలుంటే.. వెంటనే మీ ఆలోచనల్ని మార్చుకోండి.. ఆరోగ్యకరమైన ఆహారం, చక్కటి వ్యాయామం.. ఇవే సంపూర్ణ ఆరోగ్యానికి సోపానాలు! కాబట్టి ఎప్పటికప్పుడు మీ బరువును చెక్‌ చేసుకుంటూ.. దానికి అనుగుణంగా నిపుణుల సలహా తీసుకుంటూ ముందుకెళ్లడం మంచిదని గుర్తుంచుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్