మీ పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు?

తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ ఎంత స్పష్టంగా ఉంటే వారి మధ్య అనుబంధం అంత దృఢమవుతుంది.. అంతేకాదు దీనివల్ల ఇద్దరి మధ్య స్నేహభావం రెట్టింపై.. పిల్లలు వారి పేరెంట్స్ దగ్గర్నుంచి నిస్సంకోచంగా బోలెడన్ని విషయాలు నేర్చుకుంటారు కూడా! ఒక రకంగా చెప్పాలంటే.. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు కూడా సాధిస్తారట!

Published : 21 Jan 2022 21:28 IST

తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ ఎంత స్పష్టంగా ఉంటే వారి మధ్య అనుబంధం అంత దృఢమవుతుంది.. అంతేకాదు దీనివల్ల ఇద్దరి మధ్య స్నేహభావం రెట్టింపై.. పిల్లలు వారి పేరెంట్స్ దగ్గర్నుంచి నిస్సంకోచంగా బోలెడన్ని విషయాలు నేర్చుకుంటారు కూడా! ఒక రకంగా చెప్పాలంటే.. ఇలాంటి పిల్లలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు కూడా సాధిస్తారట! అయితే ఇలా పిల్లలతో మంచి కమ్యూనికేషన్ ఏర్పరచుకునే క్రమంలో తల్లిదండ్రులు కొన్ని పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి.. వారిని ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రోత్సహించినట్లవుతుందట! మరి పిల్లలతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు దృష్టిలో ఉంచుకోవాల్సిన కొన్ని విషయాలేంటో మనం కూడా తెలుసుకుందాం రండి..

సాగతీత వద్దు..

పిల్లలకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆతృత, ఆసక్తి ఉంటాయి. వీటిని తెలుసుకోవడానికి వారు ముందుగా ఆశ్రయించేది తల్లిదండ్రుల్నే. ఇలా పిల్లలకు సందేహం ఉన్న విషయాన్ని వివరించేటప్పుడు కొందరు తల్లిదండ్రులు ఆ విషయం గురించి పెద్ద ఉపన్యాసమే మొదలుపెడుతుంటారు. అసలే పిల్లలకు ఓపిక తక్కువగా ఉంటుంది. ఇలా చిన్న విషయాన్ని కూడా సాగదీస్తూ చెబితే వారి ఓపిక తగ్గి.. క్రమంగా వారిలో విషయం తెలుసుకోవాలన్న ఆ కొద్దిపాటి ఆసక్తి కూడా నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు సందేహం అడిగినప్పుడు లేక మీరే మీకు తెలిసిన విషయం వారితో పంచుకునేటప్పుడు.. పెద్దగా సాగదీయకుండా.. క్లుప్తంగా, స్పష్టంగా, అవసరమున్నంత మేరకే వివరించాలి. తద్వారా మీనుంచి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలన్న ఆకాంక్ష వారిలో పెరగచ్చు.

టైం ఇవ్వండి!

పిల్లలు బాధైనా, సంతోషమైనా తల్లిదండ్రులతో పంచుకోవడానికి ఆరాటపడుతుంటారు. ఎందుకో తెలుసా..? వారు తమకు అండగా ఉంటారని.. సమస్యను త్వరగా పరిష్కరిస్తారని. అయితే కొందరు తల్లిదండ్రులు పిల్లలు తమ దగ్గరికి తీసుకొచ్చిన విషయం గురించి విని.. 'సరే.. నువ్వు విషయం చెప్పావు కదా! ఇక నాకు వదిలెయ్.. నేను చూసుకుంటాలే..' అని, మరికొందరైతే 'ఇప్పుడు ఆఫీసుకు టైమవుతోంది.. తర్వాత చెప్పు..' అని పిల్లలు చెప్పే విషయాల్ని పలు రకాలుగా దాటవేస్తుంటారు. ఫలితంగా వారి సమస్య పరిష్కారమవదు సరి కదా.. వారి గురించి పట్టించుకోవడానికి మీ దగ్గర సమయం లేదని పిల్లలు భావిస్తారు. ఇకపై వారు మీతో ఎలాంటి విషయాల్ని పంచుకోవడానికి ఇష్టపడరు. ఇది క్రమంగా పిల్లల్లో అభద్రతా భావం పెరిగేందుకు దోహదం చేస్తుంది. పిల్లలు ఎదిగే క్రమంలో ఇలాంటి భావన వారిలో రేకెత్తడం మంచిది కాదు. కాబట్టి మీరెంత బిజీగా ఉన్నా.. పిల్లలు చెప్పేది శ్రద్ధగా విని.. వారి సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించడం చాలా ఉత్తమం.

హావభావాలూ ముఖ్యమే!

పిల్లలతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు వారి హావభావాల పట్ల కూడా జాగ్రత్త వహించాలి. అయితే కొందరు తల్లిదండ్రులు మాత్రం వారి ఒత్తిడి కారణంగా పిల్లలపై అరవడం, వారి చేష్టలకు విసిగిపోయి వేలు చూపిస్తూ బెదిరించడం, కోపంగా మొహం చిట్లించుకోవడం.. వంటివి చేస్తుంటారు. ఈ భావాలన్నీ పిల్లల ప్రవర్తనపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలు దాదాపు అన్ని విషయాలు తల్లిదండ్రుల వద్ద నుంచే నేర్చుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ క్రమంలో వారు పేరెంట్స్ ప్రవర్తనను కూడా అనుకరిస్తారు. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలతో ఇలా కోపిష్టి మాదిరిగా ప్రవర్తిస్తే పిల్లలు కూడా పెరిగే క్రమంలో పెద్దల నుంచి ఇవన్నీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. అది వారి వ్యక్తిగత జీవితానికి అస్సలు మంచిది కాదు.. అంతేనా..? తల్లిదండ్రులు చూపే ఇలాంటి ప్రవర్తన పిల్లలకు-పేరెంట్స్‌కి మధ్య బంధాన్ని బలహీనపరుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎంతటి ఒత్తిడిలో ఉన్నప్పటికీ పిల్లలతో నవ్వుతూ, ప్రేమగా మాట్లాడాలి.

మాట్లాడనివ్వండి...

పిల్లలెంతో సంతోషంగా వారి స్కూల్ విషయాలు.. లేదంటే ఇతర విషయాలు మీతో పంచుకుందామని వచ్చారనుకోండి.. వారిలో ఆ ఉత్సాహాన్ని నీరుకార్చకూడదంటే వారు ఆ విషయాన్ని పూర్తిచేసే వరకు మీరు మధ్యలో మాట్లాడకపోవడమే మంచిది. ఇలా పిల్లలు వారు చెప్పే విషయాన్ని పూర్తిచేయకుండా మీరు మధ్యలో మాట్లాడడం వల్ల పేరెంట్స్‌కి, పిల్లలకు మధ్య అటు కమ్యూనికేషన్ పరంగా, ఇటు అనుబంధం పరంగా అవరోధాలు వచ్చే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పిల్లలు ఏది చెప్పినా వారు చెప్పే విషయాన్ని పూర్తిగా విన్న తర్వాతే, మీరు వారికి సలహాలు, సూచనలు చేయడం ఉత్తమం. అలాగే వారు చెప్పే విషయాల్లో తప్పుల్ని మాత్రమే ఎంచడం కాకుండా.. మంచి విషయాల్ని ప్రశంసిస్తూ.. తప్పుల్ని నెమ్మదిగా సవరించడం మరీ మంచిది.

వీటితో పాటు పిల్లలతో మాట్లాడేటప్పుడు వారిని ఏ విషయంలోనైనా నిరుత్సాహపరచడం, వారిపై ఒత్తిడి పడేలా మాట్లాడడం, ఇతరులతో పోల్చడం.. వంటివి కూడా తల్లిదండ్రులు చేయకూడదని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా ఇద్దరి మధ్య అనుబంధం రెట్టింపవుతుంది. ఇది ఇటు పిల్లలకు, అటు తల్లిదండ్రులకు.. ఇద్దరికీ మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్