Published : 27/10/2021 16:59 IST

ఆ సాన్నిహిత్యం చక్కటి శృంగారానికీ సోపానం!

వైవాహిక జీవితంలో శృంగారం కీలక ఘట్టం. అయితే రాన్రానూ చాలా జంటల్లో ఈ ఆసక్తి క్రమంగా తగ్గుతోందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా వివాహ బంధాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నామని చాలామంది దంపతులు అసంతృప్తికి గురవుతున్నారట! వాస్తవానికి వివాహ బంధం దృఢంగా ఉండడానికి శృంగారం ఒక్కటే సాధనం కాదు. దైనందిన జీవితంలో మరెన్నో అంశాలు  దంపతుల మధ్య సాన్నిహిత్యం పెంచేందుకు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. తద్వారా బోర్ అనే ఫీలింగే రాకుండా అనుబంధాన్ని నిత్యనూతనం చేసుకోవచ్చంటున్నారు. అంతేకాదు.. ఈ క్రమంలో - సంతోషకరమైన శృంగార జీవితానికి కూడా మార్గం సుగమం అవుతుంది.. మరి, భార్యాభర్తల మనసుల్ని, తనువుల్ని ఒక్కటి చేసే ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

‘ఫాంటసీ’లు పంచుకోవాలి!

లైంగిక కోరికలు మగవారికే కాదు.. ఆడవాళ్లకూ ఉంటాయి. అయితే వీటి గురించి భర్తలు తమ భాగస్వామితో నిర్మొహమాటంగా పంచుకోగలుగుతారు.. భార్యలు మాత్రం కాస్త మొహమాటపడుతుంటారు. అంతే తేడా! భాగస్వామి తమతో ఎలా ఉంటే తమకు నచ్చుతుందో చెప్పడానికి చాలామంది ఆడవాళ్లు అసౌకర్యానికి గురవుతారని, తమ మనసులోని కోరికల్ని తమలోనే దాచుకొని అసంతృప్తికి గురవుతుంటారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వెలితే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కొరవడేలా చేస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఈ విషయంలో వెనక్కి తగ్గకుండా, మొహమాటం పక్కన పెట్టి భర్త దగ్గర తమ మనసు విప్పమంటున్నారు. ఇదే ఇద్దరి మధ్య శారీరక సాన్నిహిత్యాన్ని పెంచుతుందని చెబుతున్నారు.

పక్కపక్కన కూర్చోండి!

రెస్టరంట్లకు వెళ్లినప్పుడు ఎదురెదురుగా కూర్చోవడానికే చాలా జంటలు ఆసక్తి చూపుతాయి. తద్వారా మాట్లాడుకోవడానికి అనువుగా ఉంటుందనేది వారి భావన. మరికొందరేమో నలుగురిలో పక్కపక్కన కూర్చోవడానికి మొహమాటపడుతుంటారు. కానీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే ఎదురెదురుగా కంటే పక్కపక్కన కూర్చోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇద్దరి శరీరాలు తాకడం, కళ్లలోకి చూస్తూ మాట్లాడుకోవడం, ప్రేమగా వడ్డించుకోవడం-తినిపించుకోవడం.. ఇలాంటి చిన్న చిన్న పనులే మన మనసులోని కోరికల్ని భాగస్వామితో చెప్పకనే చెబుతాయట! ఫలితంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం రెట్టింపవుతుంది.

ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది..!

పెళ్లైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఉన్నంత సాన్నిహిత్యం రోజులు గడిచే కొద్దీ ఉండదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి, దీనికి అసలు కారణమేంటో తెలుసా? ముద్దూమురిపాలు క్రమంగా కనుమరుగవడమే అంటున్నారు నిపుణులు. అప్పటిదాకా ఓ ముద్దు, ఓ హగ్గుతో ప్రతి సందర్భాన్నీ సెలబ్రేట్‌ చేసుకునే జంటలు.. పిల్లలు పుట్టాక, ఇతర అనారోగ్యాలు, బిజీ లైఫ్‌స్టైల్‌, లైంగికాసక్తి తగ్గిపోవడం.. వంటి పలు కారణాల వల్ల వీటిని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నాయి. ఫలితంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయి.. నామమాత్రపు సంబంధానికి దారితీస్తుంది. మరి, ఇలా జరగకూడదంటే ముద్దూమురిపాలను ఎప్పటికీ కొనసాగించడమొక్కటే మార్గమంటున్నారు. ఇలా ఇద్దరి శరీరాలు తగలడం వల్ల ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. లవ్‌ హార్మోన్‌గా పిలిచే ఇది ఇద్దరి మధ్య ప్రేమను పెంచడంతో పాటు లైంగికాసక్తినీ ప్రేరేపిస్తుంది.

కాస్త ఓపిగ్గా లాలిస్తూ...

దాంపత్య బంధం సాఫీగా సాగాలంటే ఆలుమగల ఇష్టాయిష్టాలే కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటిది ఏ విషయంలో ఒకరు మరొకరిపై ఒత్తిడి తెచ్చినా దాని ప్రభావం ప్రతికూలంగానే ఉంటుంది. చాలామంది దంపతుల్లో శృంగారం విషయంలో ఇలాంటి భేదాభిప్రాయాలు ఎక్కువగా తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఎదుటివారిని బాధపెట్టడం, ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కోల్పోవడం.. మొదలైన వాటివల్ల ఇద్దరి మధ్య క్రమంగా దూరం పెరుగుతోందట. అందుకే శృంగారం విషయంలో- పంతాలకు పట్టింపులకు పోకుండా, భాగస్వామిని అందుకు సన్నద్ధం చేయడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రొమాన్స్‌ కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. అయితే ఇక్కడ కావాల్సిందల్లా కాస్త ఓపిక పడుతూ, ఇంకాస్త సమయం తీసుకోవడమే!

వీటితో పాటు చెట్టపట్టాలేసుకొని నడవడం, కలిసి వ్యాయామాలు చేయడం, రొమాంటిక్‌ సైగలతో ప్రేమను తెలుపుకోవడం.. వంటివన్నీ దంపతుల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచే మార్గాలే అంటున్నారు నిపుణులు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని