Updated : 27/09/2021 19:40 IST

ఇద్దరి మధ్యా ఆ దూరం పెరుగుతోందా?

నిండు నూరేళ్ల దాంపత్య బంధంలో ఆలుమగల్ని కలిపి ఉంచడానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. వాటిలో శృంగారం ఒకటి. కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగా, ఎమోషనల్‌గా ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేస్తుందిది. అయితే ప్రస్తుతం చాలామంది దంపతుల మధ్య ఇది కొరవడుతుందని, దాంపత్య బంధంలో గొడవలకు ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులు. అంతేకాదు.. దంపతుల్లో లైంగికాసక్తి తగ్గినా, ఇద్దరూ శారీరక సంబంధానికి పూర్తిగా దూరమైనా.. అది వారి అనుబంధంలో ఇతర పర్యవసానాలకు దారితీస్తుందంటున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

పురుషులతో పోల్చితే మహిళల్లో సాధారణంగానే లైంగికాసక్తి తక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఒత్తిడి, అలసట, హార్మోన్ల స్థాయులు తగ్గిపోవడం, ఇతర అనారోగ్యాలు.. వంటివన్నీ ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే దీని ప్రభావం దాంపత్య బంధంపై తీవ్రంగానే ఉంటుందంటున్నారు నిపుణులు. తద్వారా ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశాలూ లేకపోలేదంటున్నారు.

అనుమానాలు-అపార్థాలు!

భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అయితే ఇద్దరిలో లైంగికాసక్తి తగ్గిపోవడం, శారీరకంగా ఇద్దరూ దూరమవడం వల్ల ఇవి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా భాగస్వామి తనకు నచ్చిన పని చేయట్లేదన్న కోపంతో ఏది మాట్లాడినా తప్పు పట్టడం, అనుమానపడడం, అపార్థం చేసుకోవడం.. ఇలాంటివే గొడవలకు దారితీస్తాయి. మరి, ఇలాంటప్పుడు ఎదుటివారితో వాదనకు దిగితే గొడవ పెద్దదవడం తప్ప మరే ఉపయోగమూ ఉండదు. అదే వాళ్లేమన్నా పట్టించుకోకుండా కామ్‌గా ఉండడం, వాళ్ల కోపం తగ్గాక.. అసలు సమస్య గురించి వారికి వివరించడం వల్ల మీ పరిస్థితిని తప్పకుండా వాళ్లు అర్థం చేసుకుంటారు. తద్వారా దూరం మరింత పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

ఆ ఆలోచనల నుంచి బయటికి రండి!

శృంగార జీవితం ఆస్వాదించలేని దంపతుల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం దెబ్బతింటాయని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో తమ భాగస్వామి విషయంలో తామేదో తప్పు చేస్తున్న భావన కలుగుతుంది. ఆ ఆలోచనల్లో పడిపోయి ఎప్పుడూ ఒంటరిగా ఉండాలనిపించడం, ఎదుటివారు మాట్లాడించినా మాట్లాడకపోవడం, చేసే పనిపై ఏకాగ్రత కోల్పోవడం, కెరీర్‌పై ప్రభావం.. ఇలా ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిపరంగా చిక్కులు తప్పకపోవచ్చు. కాబట్టి పరిస్థితి చేయిదాటకముందే జాగ్రత్తపడడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో భాగస్వామిపై మీకున్న ప్రేమను, అనురాగాన్ని భౌతికంగా చూపించలేకపోయినా.. మాటలు, సందేశాల ద్వారా చాటుకోవాలి. ప్రేమగా పలకరించాలి.. ఆప్యాయంగా హత్తుకోవాలి. తద్వారా ఇద్దరి మధ్య దూరం మరింత పెరగకుండా.. దీని ప్రభావం ఇతర విషయాలపై పడకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు.. ఈ అనురాగం ఇద్దరిలో లైంగికాసక్తిని తిరిగి ప్రేరేపించే అవకాశాలూ ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

పంచుకుంటేనే పరిష్కారం!

భార్యాభర్తలిద్దరిలో లైంగికాసక్తి తగ్గిపోవడానికి ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిపరంగా ఎన్నో కారణాలుండచ్చు. వాటిని మీలోనే దాచుకొని ‘ఇకపై నా భర్త/భార్యతో జీవితం కొనసాగించలేను..’, ‘ఈ వైవాహిక బంధానికి స్వస్తి పలకడమే మంచిది..’ అంటూ నెగెటివ్‌ ఆలోచనలు చేస్తే.. జరిగే పరిణామాలూ ప్రతికూలంగానే ఉండచ్చు. కాబట్టి ఏ విషయమైనా సానుకూల దృక్పథంతో ఆలోచించి చూడాలి. అలాగే భాగస్వామి ఏదన్నా అందులో పెడార్థాలు వెతక్కుండా.. మీ సమస్యల్ని, పరిస్థితుల్ని వారితో పంచుకోవాలి. అప్పుడు వాళ్లలోని లోపాలు కూడా మీతో పంచుకోవడానికి ఓ అవకాశమిచ్చినట్లవుతుంది. తద్వారా లోటుపాట్లను సరిచేసుకుంటూ ఇద్దరూ కలిసే ముందుకు సాగచ్చు. ఈ కలిసి పరిష్కరించుకునే తత్వమే మీ సంసార జీవితాన్ని నిలబెడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో అవసరమైతే ఇంట్లో పెద్దవాళ్లు లేదంటే నిపుణుల కౌన్సెలింగ్‌ తీసుకోవడంలోనూ తప్పు లేదు.

తిరిగి దగ్గరయ్యే దారులెన్నో!

లైంగికాసక్తి తగ్గడం వల్ల సంసార జీవితంలో పెరిగిన దూరాన్ని దగ్గర చేసుకొని.. తిరిగి మునుపటిలా అన్ని విషయాల్లో కలిసిపోవాలంటే దంపతులిద్దరూ కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

* మహిళల్లో లైంగికాసక్తి తగ్గడానికి హైపో యాక్టివ్‌ సెక్సువల్‌ డిజైర్‌ డిజార్డర్‌ (హెచ్‌ఎస్‌డీడీ) ఓ కారణం అంటున్నారు నిపుణులు. ఈ పరిస్థితి మెనోపాజ్‌ దశ కంటే ముందు లేదంటే మెనోపాజ్‌ దశలోనూ తలెత్తే అవకాశాలున్నాయంటున్నారు. అయితే దీన్ని అధిగమించడానికి ప్రస్తుతం మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని వైద్యుల సూచన మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

* భార్యాభర్తల్లో తగ్గిన లైంగికాసక్తిని తిరిగి పెంపొందించడానికి కపుల్స్‌ థెరపీ కూడా చక్కటి మార్గమంటున్నారు నిపుణులు. ఇందులో భాగంగా దంపతుల మధ్య ఉన్న గొడవల్ని పరిష్కరించి.. వారి మధ్య కమ్యూనికేషన్‌ని పెంచే ప్రయత్నం చేస్తారు. తద్వారా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం క్రమంగా పెరుగుతుంది.

* మెనోపాజ్‌ దశలో మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గిపోతాయి. ఈ దశలో వారిలో లైంగికాసక్తి తగ్గడానికి ఇదీ ఓ కారణమే! కాబట్టి ఈ హార్మోన్‌ స్థాయులు పెంచడానికి ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ థెరపీ కూడా కొంతమంది వైద్యులు సూచిస్తారు.

వీటితో పాటు వ్యక్తిగత/వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకుంటూ.. సమస్యల్ని కలిసి పరిష్కరించుకుంటూ ముందుకు సాగితే సంసార సాగరం నిత్య నూతనమవుతుంది.. అనుబంధమూ రెట్టింపవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని