Updated : 11/10/2021 20:33 IST

మలి వయసులో మళ్లీ ప్రేమను వెతుక్కున్నారు!

(Image for Representation)

‘ప్రేమకు సరిహద్దులు లేవు... ప్రేమకు వయసుతో సంబంధం లేదు’... సినిమాల్లో వినిపించే ఈ మాటలు... ఈ మధ్య కాలంలో నిజ జీవితంలోనూ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మలి వయసులో భార్య/భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన వారు మళ్లీ తమకంటూ ఓ తోడును వెతుక్కొంటున్నారు. హాయిగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. అదే సమయంలో కొందరు బిడ్డలు తమ ఒంటరి తల్లిదండ్రులకు స్వయంగా పెళ్లిళ్లు చేసి వారి కళ్లల్లో ఆనందాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో-  ‘వయసు అనేది ఓ సంఖ్య మాత్రమే ’ అని మరోసారి నిరూపిస్తూ ఏడు పదుల వయసులో వివాహం చేసుకున్నారు ఇద్దరు వృద్ధులు.

 

డేటింగ్‌ యాప్‌లో పరిచయమై!

అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరానికి చెందిన జిమ్‌ ఆడమ్స్ వయసు 78 ఏళ్లు. ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. 2017లో ఆయన భార్య కన్నుమూసింది. 38 ఏళ్ల పాటు కష్టసుఖాలు పంచుకున్న భాగస్వామి దూరం కావడంతో ఆడమ్స్‌ ఒంటరివాడయ్యాడు. స్వతహాగా పెయింటర్‌ కావడంతో బొమ్మలు వేస్తూ ఎక్కువ సమయం తన స్టూడియోలోనే గడిపాడు. అప్పుడప్పుడు తన ఇద్దరు బిడ్డల ఇళ్లకు వెళ్లి, వారి పిల్లలతో సరదాగా గడుపుతుండేవాడు. అయితే 2020లో కరోనా జిమ్‌ను పూర్తిగా స్టూడియోకే పరిమితం చేసింది. దీంతో అతను మరింత ఒంటరివాడయ్యాడు. ఈ క్రమంలోనే తన జీవితానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఓ డేటింగ్‌ యాప్‌లో తన పేరును రిజిస్టర్ చేసుకుని, తనకు తగిన జోడీ కోసం వెతకడం ప్రారంభించాడు. అప్పుడు తన ప్రొఫైల్‌తో 94 శాతం మ్యాచ్‌ అయిన ఆద్రే కోట్స్‌ అనే 79 ఏళ్ల మహిళ జిమ్‌కు తారసపడింది. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమెను సంప్రదించాడు.

నిజమైన ప్రేమ దొరక్కపోవడంతో!

ఇన్సూరెన్స్‌ బ్రోకర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ తీసుకున్న ఆద్రే ప్రస్తుతం కొలంబియాలో నివాసముంటోంది. 33 ఏళ్ల క్రితమే తన భర్తకు విడాకులిచ్చింది. అప్పటి నుంచి ఒంటరిగానే జీవితాన్ని వెళ్లదీస్తోన్న ఆమె పలువురితో డేటింగ్‌ చేసింది. కానీ నిజమైన ప్రేమ మాత్రం దొరకలేదు. ఇక డేటింగ్‌ యాప్‌లోనూ నాలుగేళ్లుగా మెంబర్‌గా ఉంది. అప్పుడప్పుడు ఆ యాప్‌ను ఓపెన్‌ చేసి తన ప్రొఫైల్‌కు సూట్‌ అయ్యే వారి కోసం వెతుకుతోంది. అయితే సరైన జోడీ తారసపడకపోవడంతో యాప్‌ను కూడా తొలగించాలనుకుంది.

ఉంగరంతో లవ్‌ ప్రపోజల్!

అప్పుడే జిమ్‌ నుంచి ఆద్రేకు ఓ మెసేజ్‌ వచ్చింది. ఫోన్లలో ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. తమ ఇష్టాయిష్టాలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రత్యక్షంగా కలుసుకోవాలనుకున్నారు కానీ కొవిడ్‌ ఆంక్షలు అడ్డు తగిలాయి. ఈ క్రమంలో పరిచయమైన మూడు నెలల తర్వాత కానీ ఒకరి ముఖాలు ఒకరు ప్రత్యక్షంగా చూసుకోలేకపోయారు. అయితే ఈ ఏడాది మేలో తన ఇంట్లో గ్రాండ్‌ డిన్నర్‌ ఏర్పాటు చేశాడు జిమ్‌. ఆద్రేను కూడా ఆహ్వానించాడు. అక్కడే తన స్నేహితులు, సన్నిహితుల ముందు ఆమెకు ఉంగరాన్ని తొడిగి తన ప్రేమను వ్యక్తపరిచాడు. 

బ్యూటిఫుల్‌ కపుల్!

జిమ్‌-ఆద్రేల ప్రేమను వారి పిల్లలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. దీంతో ఇటీవలే నిరాడంబరంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారీ లవ్లీ కపుల్‌. కరోనా ఆంక్షల నేపథ్యంలో జిమ్-ఆద్రేల పిల్లలు, సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఫొటోగ్రాఫర్‌తో పాటు జిమ్‌ కుమారుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ‘మీ జంట చూడముచ్చటగా ఉంది’, ‘బ్యూటిఫుల్ అండ్‌ లవ్లీ కపుల్‌’, ‘రెండు మనసులు కలవడానికి వయసుతో సంబంధం లేదు’ అంటూ ఎంతోమంది నెటిజన్లు ఈ వృద్ధ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదే క్రమంలో తాము కూడా తమ ఒంటరి తల్లిదండ్రులకు ఇలాగే వివాహం చేశామంటూ మరికొందరు తమ అనుభవాలను పంచుకుంటున్నారు.

విదేశాల్లోనే కాదు.. వివిధ కారణాల రీత్యా వృద్ధాప్యంలో తోడు వెతుక్కుంటున్న ఇలాంటి సంఘటనలు మన దేశంలోనూ ఈ మధ్య తరచుగానే వింటున్నాం. ఈ క్రమంలో- ఇలా మలి దశలో మరో తోడు వెతుక్కోవడం ఎంతవరకు సమంజసం? దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటి? అలాగే కారణాలేవైనా- వృద్ధాప్యంలో మళ్లీ పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే నష్టాలేమైనా ఉన్నాయా?  వివాహ బంధానికి సంబంధించి మారుతున్న నిర్వచనాలు, కొత్తగా వస్తున్న ధోరణుల పైన మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి..


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని