భయంతో పొరపాట్లు చేస్తున్నా!

మా బాస్‌ని చూస్తేనే భయం. చిన్న పొరపాటు చేసినా, అనుకున్న సమయానికి పని పూర్తవకపోయినా అరిచేస్తుంది. ఆమె ఏం అంటుందో అన్న భయంతో తెలియకుండానే పొరపాట్లు దొర్లుతున్నాయి.

Updated : 01 Nov 2023 13:28 IST

మా బాస్‌ని చూస్తేనే భయం. చిన్న పొరపాటు చేసినా, అనుకున్న సమయానికి పని పూర్తవకపోయినా అరిచేస్తుంది. ఆమె ఏం అంటుందో అన్న భయంతో తెలియకుండానే పొరపాట్లు దొర్లుతున్నాయి. మీటింగ్‌లో ఆలోచనలు పంచుకోవాలన్నా ముచ్చెమటలు పట్టేస్తాయి. ఈ తిట్లతో తెలియకుండానే డిప్రెషన్‌లోకి వెళ్లేలా ఉన్నా. ఏం చేయాలో తోచడం లేదు. సలహా ఇవ్వండి.

- సుమిత

హోదా, వారి తీరు కారణమేదైతేనేం బాస్‌ అంటే సహజంగానే భయం ఉంటుంది. అయితే అది మీ పనిలో ఆటంకాలు కలిగిస్తోంటే మాత్రం సమస్యగా గుర్తించాలి. కాబట్టి, ముందు మీ బాస్‌తో తరచూ మాట్లాడండి. పని విధానం గురించి తెలియడమే కాదు.. ఒకరిపై మరొకరికీ అవగాహన వస్తుంది. ఒక్కసారిగా కష్టమైతే ముందు రోజువారీ రిపోర్ట్‌ చేయాల్సిన అంశాల గురించి మాట్లాడండి. పనిచేస్తున్న ప్రాజెక్టు.. దానిలో వేటిపై దృష్టిపెట్టాలి? మీ ఆలోచనలు.. ఇలాంటివి ప్రయత్నించొచ్చు. కాస్త ధైర్యమొచ్చాక సీరియస్‌ అంశాలనూ చర్చించొచ్చు. ఇది ఇద్దరి మధ్యా గౌరవప్రదమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఒక్కసారిగా వెళ్లి నిల్చోగానే బుర్ర ఖాళీ అయిపోతోంది, ముచ్చెమటలు పట్టేస్తున్నాయి అనిపిస్తే.. ఏం చెప్పాలనుకుంటున్నారో ఓ పేపర్‌ మీద పెట్టండి. అద్దం ముందు మాట్లాడటం సాధన చేయండి. ఇదీ పనిచేయట్లేదు అనిపిస్తే డిజిటల్‌ బాట పట్టేయండి. ఆలోచనల దగ్గర్నుంచి, ఎటువంటి సాయం ఆశిస్తున్నారో వరకు ఈమెయిల్‌ పెట్టండి. ఇక భయానికి తావేది? ఆఫీసు అనగానే మీరొక్కరే ఉండరుగా! మీతోపాటు పనిచేసే వాళ్లు ఈ స్థితిని ఎలా అధిగమిస్తున్నారో కనుక్కోండి. వాళ్ల సలహాలు, సూచనలు పాటించినా మంచిదే. మీటింగ్‌ సమయాల్లో కాస్త అండగా ఉండమనీ అడగొచ్చు. ఒక్కోసారి భయం మనసులో లోతుగా పాతుకొని పోతుంది. దానికి అవతలి వ్యక్తే కారణం కాకపోవచ్చు. మీ సమస్యా అయ్యుండొచ్చు. అప్పుడు నిపుణుల సాయం కోరడం మంచిది. వీటిలో మీకు అనుకూలమైన మార్గాన్ని ఎంచుకొని ప్రయత్నించండి. పని వాతావరణం తేలిక పడటం మీరే గమనిస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్