Parenting Tips : ఫ్యామిలీ టెన్షన్స్‌ పిల్లల దాకా రాకుండా..!

ఎంత అన్యోన్యంగా ఉన్నా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. అయితే కొంతమంది దంపతులు పిల్లల ముందే వాదులాడుకుంటారు. మరికొంతమందైతే ఫ్యామిలీ టెన్షన్స్‌ని పిల్లలపై చూపించడం, అన్నింటికీ వాళ్లనే బాధ్యుల్ని చేయడం.. వంటివి చేస్తుంటారు. ఇలాంటి పనుల వల్ల....

Published : 22 May 2022 13:07 IST

ఎంత అన్యోన్యంగా ఉన్నా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడూ చిన్న చిన్న గొడవలు జరగడం సహజం. అయితే కొంతమంది దంపతులు పిల్లల ముందే వాదులాడుకుంటారు. మరికొంతమందైతే ఫ్యామిలీ టెన్షన్స్‌ని పిల్లలపై చూపించడం, అన్నింటికీ వాళ్లనే బాధ్యుల్ని చేయడం.. వంటివి చేస్తుంటారు. ఇలాంటి పనుల వల్ల వారి చిన్ని మనసులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇలాంటి ఒత్తిళ్ల మధ్య పెరిగే పిల్లల్లో పలు శారీరక, మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే గొడవల్ని పిల్లల దాకా తీసుకురాకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లోని టెన్షన్స్‌ ప్రభావం పిల్లలపై పడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం రండి..

పిల్లలపై ప్రభావమెంత?!

అకస్మాత్తుగానో, కావాలనో.. పేరెంట్స్‌ పిల్లల ముందు గొడవ పడడం వల్ల వారి చిన్ని మనసులపై వివిధ రకాలుగా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా..

* తల్లిదండ్రులు పిల్లల ముందు గొడవ పడడం వల్ల వారిలో ఒక రకమైన అభద్రతా భావం నెలకొంటుంది. తమకు రక్షణ కవచమైన పేరెంట్సే ఇలా చీటికీ మాటికీ వాదులాడుకుంటుంటే ఇక తమనెవరు పట్టించుకుంటారన్న నెగెటివ్‌ ఆలోచనలు వారి మనసుల్ని తొలిచేస్తాయి.

* కొంతమంది సంబంధం లేకపోయినా గొడవ మధ్యలో పిల్లల ప్రస్తావన తీసుకొస్తుంటారు. దీనివల్ల ‘అమ్మానాన్న మధ్య చిచ్చు పెట్టింది నేనేనేమో?!’ అంటూ తమను తామే నిందించుకుంటారు పిల్లలు. ఇలాంటి ఆలోచనలు కూడా వారి మనసును ప్రభావితం చేస్తాయి.

* గొడవల మధ్య ప్రశాంతత లేని వాతావరణంలో పిల్లలు పెరగడం వల్ల భవిష్యత్తులో వారూ రెబల్‌ మాదిరిగా తయారయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఫలితంగా వారూ, తమ భాగస్వామితో చక్కటి రిలేషన్‌షిప్‌ను కొనసాగించలేకపోవచ్చని చెబుతున్నారు.

* ఇలాంటి ప్రతికూల వాతావరణంలో పిల్లలు పెరగడం వల్ల.. చదువులో వెనకబడిపోవడం, స్కూల్లో-తోటి పిల్లలతో కలవకపోవడం, తమను తామే తక్కువ చేసి చూసుకోవడం, అసురక్షితమైన వాతావరణంలో పెరుగుతున్నానమన్న భావన.. ఇలా భౌతికంగా, మానసికంగా పిల్లలు నష్టపోయే ప్రమాదమే ఎక్కువ!

ఎక్కడ జరిగిందో.. అక్కడే పరిష్కరించుకోండి!

దంపతుల మధ్య జరిగే గొడవలకు వివిధ కారణాలుండచ్చు. అయితే ఒక్కోసారి సహనం కోల్పోయి పిల్లల సమక్షంలోనే ఒకరిపై ఒకరు విరుచుకుపడడం, మాటలనుకోవడం.. వంటివి చేస్తుంటారు కొందరు. దీనివల్ల కుటుంబంలో ఒకరకమైన టెన్షన్‌ వాతావరణం ఏర్పడుతుంది. పిల్లలు కూడా దీన్ని జీర్ణించుకోలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లల సమక్షంలో ఇలాంటి వాదులాటకు తావివ్వకూడదంటున్నారు నిపుణులు. ఒకవేళ అకస్మాత్తుగా ఇలా జరిగినా.. పిల్లల ముందే దంపతులిద్దరూ ఆ సమస్యను పరిష్కరించుకోవడం మంచిదంటున్నారు. ఈ క్రమంలో గొడవకు కారణమేంటో ఇద్దరూ చర్చించుకోవడం, తప్పెవరిదైతే వారు భాగస్వామికి క్షమాపణ చెప్పడం, తిరిగి కలిసిపోవడం.. వంటివి చేస్తే గొడవా తీరుతుంది.. పిల్లల మనసూ కుదుటపడుతుంది. వాళ్ల మనసులో మీపై ఏర్పడిన నెగెటివ్‌ భావన కూడా తొలగిపోతుంది.

సమస్య ఎక్కడుంది?!

సాధారణంగా కుటుంబంలో జరిగే గొడవలకు వివిధ కారణాలుండచ్చు. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోలేకపోవడం, భాగస్వామి చేసే కొన్ని పనులు నచ్చకపోవడం, దంపతుల్లో ఎవరో ఒకరు కోపిష్టి కావడం.. ఇలాంటి సందర్భాల్లో ప్రతిదానికీ వాగ్వాదం జరుగుతుంది. ఇది ఇటు మీకు, అటు మీ పిల్లలకు మంచిది కాదు. కాబట్టి ఇలా చీటికి మాటికి గొడవలు జరగడానికి అసలు కారణమేంటో, సమస్య ఎక్కడుందో కనుక్కునే ప్రయత్నం చేయమంటున్నారు నిపుణులు. తద్వారా దానికి పరిష్కార మార్గం వెతుక్కోగలిగితే.. మరోసారి ఆ విషయంలో గొడవలు రాకుండా జాగ్రత్తపడచ్చు.

కలిసి చేస్తే పోలా!

తమ తల్లిదండ్రులు గొడవల్లేకుండా అన్యోన్యంగా ఉన్నారని, తమకు భద్రత కల్పిస్తారన్న భరోసా పిల్లల్లో కల్పించాలంటే పేరెంట్స్‌ తమ పిల్లలతో కలిసి కొన్ని పనులు చేయాలంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. ఎంత బిజీగా ఉన్నా కలిసి సమయం గడపడం, వ్యాయామాలు చేయడం, వారాంతాల్లో కాసేపు కలిసి బయటికి వెళ్లడం, కాసేపు సరదాగా జోక్స్‌ వేసుకోవడం, ఆ రోజు వాళ్ల సమయం ఎలా గడిచిందో ఒకరికొకరు చెప్పుకోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే కుటుంబంతో కలిసి గడిపే క్షణాలు, మధుర జ్ఞాపకాలు ఎన్నో! నిజానికి ఇవి సింపుల్‌గానే అనిపించచ్చు.. కానీ కుటుంబాన్ని కలిపి ఉంచే అద్భుతమైన సూత్రాలివి అంటున్నారు నిపుణులు.

మీకోసం.. మీరుగా!

చాలామంది ఎక్కడెక్కడి కోపాన్నో తమ భాగస్వామి, పిల్లలపై చూపిస్తుంటారు. ఇందుకు పూర్తి సమయమంతా కుటుంబ సభ్యుల కోసం కేటాయించి.. తమను తాము నిర్లక్ష్యం చేసుకోవడం ఓ కారణం. మొదట్లో ఇది పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ముందు ముందు ఓపిక నశించి మీపై మీకే కోపం, చిరాకు వస్తుంటాయి. కాబట్టి ఇలా జరగకూడదంటే.. ముందు స్వీయ ప్రేమ పెంచుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజులో కాస్త సమయం వెచ్చించి.. మీకు నచ్చినట్లుగా రడీ అవడం, ఇష్టమైన పనులే చేయడం, కష్టంగా అనిపించిన విషయాల్ని పక్కన పెట్టేయడం.. లేదంటే భాగస్వామి సహాయం తీసుకోవడం.. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల ఇటు మీరు హ్యాపీగా ఉండచ్చు.. అటు మీ ఇంట్లో వాళ్లనూ సంతోషపెట్టచ్చు.

మరి, ఇన్ని చేసినా మీ ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణగకపోయినా.. ఇంట్లో మానసిక ప్రశాంతత లోపించినా.. ఆలస్యం చేయకుండా ఓసారి మానసిక నిపుణుల సలహాలు, అవసరమైతే కౌన్సెలింగ్‌ తీసుకుంటే తప్పకుండా ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్