కంటేనే అమ్మ కాదని నిరూపిస్తున్నారు!

ప్రతి స్త్రీ తన జీవితంలో మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. అయితే మారుతున్న జీవన శైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం వంటి కారణాలతో కొంతమంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారు అనాథ చిన్నారులను దత్తత తీసుకొని అమ్మగా ప్రమోషన్‌ పొందుతున్నారు.

Published : 02 Dec 2021 18:19 IST

(Photo: Instagram)

ప్రతి స్త్రీ తన జీవితంలో మాతృత్వపు మధురిమల్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. అయితే మారుతున్న జీవన శైలి, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో లోపాలు, ప్రెగ్నెన్సీని వాయిదా వేయడం వంటి కారణాలతో కొంతమంది మహిళలు అమ్మతనానికి దూరమవుతున్నారు. ఈ క్రమంలో అలాంటి వారు అనాథ చిన్నారులను దత్తత తీసుకొని అమ్మగా ప్రమోషన్‌ పొందుతున్నారు. వీరితో పాటు అప్పటికే పిల్లలు ఉన్నా-లేకపోయినా, వివాహం చేసుకున్నా-చేసుకోకపోయినా కొంతమంది మహిళలు సామాజిక దృక్పథంతో అనాథ పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. ఆ జాబితాలో త్వరలోనే చేరబోతోంది బాలీవుడ్‌ అందాల తార స్వరా భాస్కర్‌. తనకంటూ ఓ కుటుంబం, పిల్లలు కావాలనుకున్నానని, అందుకు దత్తతే సరైన పద్ధతి అని నిర్ణయించుకున్నానంటోంది. స్వరా కంటే ముందు దత్తత ద్వారా అమ్మతనాన్ని పొందిన సెలబ్రిటీలు కొందరున్నారు. వాళ్లెవరో తెలుసుకుందాం రండి..

స్వరా భాస్కర్

తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలు ఎంచుకునే ఈ ముద్దుగుమ్మ.. తన వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో బోల్డ్‌గా వ్యవహరిస్తుంటుంది. సమాజం ఏమనుకున్నా తన మనసుకు నచ్చిన పనే చేస్తానని, ఇష్టమైన నిర్ణయాలే తీసుకుంటానంటోంది. ఈ క్రమంలోనే పెళ్లికి ముందే ఓ బిడ్డను దత్తత తీసుకోవడానికి సిద్ధమైందీ బాలీవుడ్‌ అందం. ఇదే విషయాన్ని ఇటీవలే ఓ సందర్భంలో పంచుకుంటూ.. తనలోని సామాజిక దృక్పథాన్ని చాటుకుంది స్వరా.

‘నాకంటూ ఓ కుటుంబం, పిల్లలు ఉండాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. దత్తత తీసుకోవడం ద్వారా ఈ కల నెరవేరుతుందన్న విషయం గ్రహించా. నిజానికి నేను చాలా అదృష్టవంతురాలిని.. ఎందుకంటే మన దేశంలో పెళ్లి కాకపోయినా చిన్నారిని దత్తత తీసుకునే అనుమతి ఉంది. ఇదే విషయమై ఇదివరకే దత్తత తీసుకున్న కొందరు తల్లిదండ్రుల్ని, ఆ పిల్లల్ని కలిశాను. వాళ్లెంతో సంతోషంగా ఉన్నారు. ఇలా అన్ని కోణాల్లో పరిశోధించి ఓ నిర్ణయానికొచ్చాకే మా అమ్మానాన్నలతో ఈ విషయం చెప్పా. వాళ్లూ అందుకు ఒప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన అధికారిక లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. అయితే ఇందుకు కొంత సమయం పట్టేలా ఉంది.. ఏదేమైనా అమ్మనయ్యేందుకు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా..’ అంటోంది స్వరా.

 

మందిరా బేడీ

బాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ మందిరా బేడీ కూడా గతేడాది తార అనే నాలుగేళ్ల పాపను దత్తత తీసుకుంది. 1999లో రాజ్‌కౌశల్‌తో పెళ్లిపీటలెక్కిన ఆమెకు అప్పటికే విర్‌ అనే కొడుకున్నాడు. అయితే తారతో తన కుటుంబం పరిపూర్ణమైందంటూ మురిసిపోతుందీ అందాల అమ్మ.

‘దేవుడు అందించిన వరంలా తార మా దగ్గరకు వచ్చింది. పేరుకు తగ్గట్టే నక్షత్రాల్లాంటి మెరిసే కళ్లున్న తను ‘విర్‌’కి చెల్లిగా ఇంట్లోకి అడుగుపెట్టింది. 2020 జులై 28 నుంచి తను కూడా మా కుటుంబంలో భాగస్వామిగా మారిపోయింది.. దీంతో ఎప్పట్నుంచో విర్‌కు ఓ తోబుట్టువును అందించాలన్న మా కల నెరవేరింది..’ అంటూ తన దత్త పుత్రికను అప్పట్లో అందరికీ పరిచయం చేసింది మందిర. ఇక ఈ ఏడాది జూన్‌లో రాజ్‌ కౌశల్‌ మరణం తర్వాత సింగిల్‌ మదర్‌గా తన ఇద్దరు పిల్లల్ని సాకుతోందీ ఫిట్టెస్ట్‌ మామ్.

 

సుస్మితా సేన్

బాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో పిల్లల దత్తత విషయమంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు సుస్మితా సేన్‌. తనకు పాతికేళ్ల వయసున్నప్పుడే.. అది కూడా పెళ్లి కాకుండానే ‘రెనీ’ అనే చిన్నారిని దత్తత తీసుకుందీ ముద్దుగుమ్మ. ఆపై మరో పదేళ్లకు ‘అలీషా’ను దత్తత తీసుకుంది. బాలికను దత్తత తీసుకున్నాక బాలుడిని మాత్రమే దత్తత తీసుకోవాలన్న చట్ట నిబంధనలపై పోరాడేందుకు ఆమెకు పదేళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం సింగిల్ మదర్‌గానే తన ఇద్దరు పిల్లల ఆలనా పాలనను చూసుకుంటోందీ బాలీవుడ్‌ మామ్‌. సుస్మిత పెద్ద కూతురు 20 ఏళ్ల రెనీ ఇటీవలే Suttabaazi అనే వెబ్‌సిరీస్‌లో నటించింది.

‘సొంత తల్లికి, బిడ్డకు పేగు బంధం ఉంటుంది. దత్తత తీసుకున్న బిడ్డకు, తల్లికి తెంచుకోలేని అనుబంధం ఉంటుంది. సొంత తల్లి తన కడుపులోంచి బిడ్డను కంటుంది. దత్తత తల్లి తన హృదయంలోంచి బిడ్డకు జన్మనిస్తుంది’ అని పిల్లల దత్తత గురించి ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ అందాల తార.

 

రవీనా టాండన్

‘బంగారు బుల్లోడు’, ‘ఆకాశవీధిలో’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రవీనా టాండన్‌ తన 20 ఏళ్ల వయసులోనే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుంది. అప్పటికింకా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న ఆమె.. ఛాయ, పూజ అనే ఇద్దరు అనాథలను అక్కున చేర్చుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 2004లో అనిత్‌ తడానీ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని రవా, రణ్‌బీర్‌ వర్ధన్‌ అనే ఇద్దరు పిల్లలకు తల్లయింది. అయినా తన దత్త పుత్రికల బాధ్యతలను విస్మరించలేదీ అందాల తార. ఇరువురికీ ఘనంగా పెళ్లిళ్లు చేసి ఆదర్శంగా నిలిచింది. ఇప్పటికే ఛాయ ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అమ్మమ్మ హోదాను కూడా అందుకుందీ అందాల తార.

 

సన్నీ లియోన్

అందంతో పాటు అంతకుమించి అందమైన మనసున్న ముద్దుగుమ్మ సన్నీ లియోన్. 2011లో న్యూయార్క్‌కు చెందిన డేనియల్‌ వెబర్‌ను వివాహమాడిన ఈ అందాల తార 2017లో మహారాష్ట్రలోని లాథూర్ అనాథాశ్రమం నుంచి ఓ మూడేళ్ల పాపను దత్తత తీసుకుంది. తనకు ముద్దుగా ‘నిషా కౌర్‌ వెబర్‌’ అనే పేరు కూడా పెట్టుకున్నారీ లవ్లీ కపుల్‌. 2018లో సరోగసీ విధానం ద్వారా ‘ఆషర్‌’, ‘నోహా’ అనే మరో ఇద్దరు కవల అబ్బాయిలకు జన్మనిచ్చారు సన్నీ దంపతులు. ప్రస్తుతం తన ముగ్గురు పిల్లల ఆలనాపాలనలో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోందీ ముద్దుగుమ్మ.

 

మహీవిజ్

‘చిన్నారి పెళ్లి కూతురు’ (బాలికా వధు)లో ఆనంది కూతురు నందినిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది మహీవిజ్‌. మలయాళం, హిందీ సినిమాల్లోనూ నటించిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్‌ బుల్లితెరపైనా తనదైన ముద్ర వేసింది. సీరియల్స్, డ్యాన్స్ రియాల్టీ షోలలో సత్తా చాటుతూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న ఆమె 2011లో సహనటుడు జై భానుశాలిని వివాహం చేసుకుంది.

ఈ క్రమంలో 2017లో తన పని మనిషి పిల్లలు రాజ్‌వీర్‌, ఖుషీలను దత్తత తీసుకుంది. పిల్లలు కన్నతల్లి సమక్షంలోనే పెరుగుతున్నప్పటికీ వారిద్దరికీ సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటోంది. ఇక పెళ్లైన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత 2019 ఆగస్టులో ‘తార’ అనే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది మహి. ప్రస్తుతం ముగ్గురు పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోందీ ముద్దుగుమ్మ.

 

వీళ్లు కూడా!

* బాలీవుడ్‌ బుల్లితెరకు సంబంధించి సెలబ్రిటీ కపుల్‌గా గుర్తింపు పొందిన డెబినా బెనర్జీ-గుర్మీత్‌ చౌదరి దంపతులు పూజ, లలిత అనే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఈ ఇద్దరు అనాథలను అక్కున చేర్చుకుని పెద్ద మనసు చాటుకున్నారీ లవ్లీ కపుల్.

* సీనియర్‌ హీరోయిన్‌, ప్రముఖ నృత్య కళాకారిణి శోభన 2017 ఆగస్టులో ఓ ఆరు నెలల చిన్నారిని దత్తత తీసుకుంది. కేరళలోని గురువాయూర్‌ శ్రీకృష్ణ టెంపుల్‌లో ఆ పాపకు అన్నప్రాసన ఘనంగా జరిపించి ‘అనంత నారాయణి’ అని పేరు పెట్టుకుంది.

* రిషికేష్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్న 34 మంది పిల్లలను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా దత్తత తీసుకుంది ప్రీతీజింటా. వీలు చిక్కినప్పుడల్లా ఆ పాఠశాలను సందర్శిస్తూ వారికి కావాల్సిన చదువు, తిండి, వసతి సదుపాయాలను సమకూరుస్తోంది. ఇక ఇటీవలే సరోగసీ పద్ధతిలో జై, జియా అనే ఇద్దరు కవల చిన్నారులకు అమ్మయింది ప్రీతి.

* తమిళంతో పాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తోన్న యాపిల్ బ్యూటీ హన్సిక 25 మంది చిన్నారులను దత్తత తీసుకుంది. సామాజిక స్ఫూర్తితో వారికి సంబంధించిన అన్ని వ్యవహారాలను దగ్గరుండి మరీ చూసుకుంటోంది.

అమ్మ కావాలన్న ఆరాటంతో, సామాజిక స్పృహతో ఈ ముద్దుగుమ్మలు చేసిన పని ఎంతోమందికి ఆదర్శప్రాయం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్