Second Child: ఈ భయాలు మీలోనూ ఉన్నాయా?!

బృందకు ఒక కొడుకున్నాడు. అయితే ఇప్పుడు మరో బిడ్డ కోసం ప్లాన్‌ చేసుకుంటోంది. కానీ రెండో బిడ్డకు అంత ప్రేమ పంచగలనా? వీడి ఆలనలో పడిపోయి మొదటి బిడ్డను నిర్లక్ష్యం చేస్తానేమోనని సంశయిస్తోంది.మృదుల ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే! అయినా రెండో బిడ్డను కనాలని పట్టుదలగా ఉందామె. కానీ దానివల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని వెనకా ముందూ అవుతోంది.రెండో బిడ్డను కనే విషయంలో నూటికి తొంభైమంది మహిళలు ఇలాంటి భయాందోళనల్లోనే ఉన్నారని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొంతమంది

Published : 18 Mar 2022 15:31 IST

బృందకు ఒక కొడుకున్నాడు. అయితే ఇప్పుడు మరో బిడ్డ కోసం ప్లాన్‌ చేసుకుంటోంది. కానీ రెండో బిడ్డకు అంత ప్రేమ పంచగలనా? వీడి ఆలనలో పడిపోయి మొదటి బిడ్డను నిర్లక్ష్యం చేస్తానేమోనని సంశయిస్తోంది.

మృదుల ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే! అయినా రెండో బిడ్డను కనాలని పట్టుదలగా ఉందామె. కానీ దానివల్ల ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని వెనకా ముందూ అవుతోంది.

రెండో బిడ్డను కనే విషయంలో నూటికి తొంభైమంది మహిళలు ఇలాంటి భయాందోళనల్లోనే ఉన్నారని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొంతమంది ఒక్కరితోనే సరిపెట్టుకుంటే.. మరికొందరు ఈ డోలాయమానంలోనే రెండో బిడ్డకు జన్మనిస్తున్నారు. అయితే ఏ విషయంలోనైనా సమతులం చేసుకోగలిగే నేర్పు ఉంటే ఇలాంటి భయాల్ని అధిగమించడం ఏమంత పెద్ద విషయం కాదంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..

సమానంగా ప్రేమ పంచగలనా?

ప్రతి జంటకు తొలి సంతానం ఓ ప్రత్యేకమైన అనుభూతి. ఈ క్రమంలో తమ బిడ్డపై ఎనలేని ప్రేమను కురిపిస్తుంటారు తల్లిదండ్రులు. బోలెడన్ని దుస్తులు, బొమ్మలు కొనిపెడుతుంటారు. అడగడమే ఆలస్యం.. ఏదంటే అది తెచ్చివ్వడానికి సిద్ధంగా ఉంటారు. అయితే రెండో బిడ్డ దగ్గరికొచ్చేసరికి మాత్రం ఈ ప్రేమ కాస్త తగ్గుతుందనే చెప్పాలి. బాధ్యతలు పెరగడం, ఒత్తిడి.. ఇలా కారణమేదైనా.. మొదటి బిడ్డకు ఇచ్చినంత ప్రాధాన్యం రెండో వారికి ఇవ్వలేమేమోనని భయపడుతుంటారు చాలామంది తల్లులు. పైగా రెండో బిడ్డ ఆలనా పాలనలో పడిపోయి తొలి సంతానాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తామోనన్న భయం కూడా మరికొందరిలో ఉంటుంది. అయితే ఇలా ఆలోచించేవారికి ఒక్క మాట చెబుతున్నారు నిపుణులు. తల్లి ప్రేమకు అవధులుండవు.. అది ఒక్కరికే పరిమితం కాదు.. తల్లిగా మీరు మరోసారి అందుకున్న ఆ బాధ్యతే ఇద్దరు బిడ్డలకు సమానంగా ప్రేమ పంచేలా చేస్తుందంటున్నారు. కాబట్టి ఇలాంటి అనవసర భయాందోళనల్ని వీడి ముందడుగు వేయమంటున్నారు.

ఒక్కరితోనే వేగలేకపోతున్నా.. ఇద్దరా?

ఈ కాలపు మహిళలు ఇంటికి, పిల్లల బాధ్యతకు ఎంత ప్రాధాన్యమిస్తున్నారో.. కెరీర్‌కూ అంతే ప్రాముఖ్యమిస్తున్నారు. ఇలాంటి బిజీ లైఫ్‌స్టైల్‌ని బ్యాలన్స్‌ చేసుకోవాలంటే ఒకే బిడ్డ చాలనుకునే వారు చాలామందే ఉంటున్నారు. అయితే రెండో బిడ్డ కోసం ప్లాన్‌ చేసుకునే వారు మాత్రం ఇంటిని-పనిని బ్యాలన్స్‌ చేసుకునే విషయంలో ‘రెండూ మా వల్ల అవుతాయా?’ అని సంశయిస్తున్నారనే చెప్పాలి. అయితే ఇటు ఇద్దరు పిల్లల్ని సాకుతూ.. మరోవైపు ఆఫీస్‌కి వెళ్లి రావడమంటే కష్టమే! కానీ పిల్లలు కాస్త పెద్దవాళ్లయ్యేంత వరకే ఈ ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత అలవాటైపోతుంది. కాబట్టి రెండో బిడ్డ కోసం ప్లాన్‌ చేసుకోవాలనుకునే వారు ఈ భయాల్ని పక్కన పెట్టి.. వీలైతే కెరీర్‌కి కాస్త విరామం ఇవ్వండి.. అదీ కుదరదనుకుంటే ఇంటి నుంచే పని చేసేందుకు మీ సంస్థ నుంచి అనుమతి తీసుకోండి.. కొన్నేళ్ల వరకు అత్తింటి వారు/పుట్టింటి వారి సహకారం తీసుకున్నారంటే అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి.

ఆర్థిక ఇబ్బందులొస్తాయేమో?!

రెండో బిడ్డ కోసం ప్లాన్‌ చేసుకునే చాలామంది దంపతుల్లో ఈ సంశయం/భయం ఉందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా తొలుచూరు ఆడపిల్లను కన్న వారు.. రెండోసారీ ఆడపిల్ల పుడితే.. ఆర్థికంగా నిలదొక్కుకోగలమా.. అని ఆలోచిస్తున్నారట! నిజానికి ఈ రోజుల్లో ఆడపిల్లైనా, మగపిల్లాడైనా.. కాస్త అటో ఇటో ఖర్చులు సరిసమానంగానే ఉంటున్నాయంటున్నారు నిపుణులు. అందుకే ఒకవేళ రెండో బిడ్డను కనాలి, ఆర్థిక ఇబ్బందులు రాకూడదంటే.. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి.. వీలున్న చోట పొదుపు మంత్రం పాటించాలి.. మొదటి బిడ్డ లాగే.. రెండో చిన్నారి కోసం కూడా ముందు నుంచే కొంత సొమ్మును పొదుపు చేస్తే.. వాళ్లు పెరిగి పెద్దయ్యే కొద్దీ భారంగా అనిపించదు కూడా! అలాగే తల్లిదండ్రులు కూడా మరింత ఎక్కువగా ఆదాయం ఆర్జించే మార్గం వెతుక్కుంటే ఇద్దరినీ ఎలాంటి లోటూ లేకుండా పెంచచ్చు.. వాళ్లకు చక్కటి కెరీర్‌నూ అందించచ్చు.

ఈ వయసులో సాధ్యమేనా?

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు పెద్దలు. పిల్లల్ని కనే విషయంలోనూ ఇది వర్తిస్తుంది. ఎందుకంటే వయసు మీరుతున్న కొద్దీ మహిళల్లో అండాల నిల్వ తగ్గుతుంటుంది. తద్వారా సంతానం కలిగే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతుంటాయి. ఒకవేళ లేటు వయసులో గర్భం దాల్చినా.. అలాంటి పిల్లల్లో అవకరాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే కెరీర్‌, ఇతర ఒత్తిళ్ల రీత్యా రెండో బిడ్డ కోసం కాస్త గ్యాప్‌ ఇచ్చిన దంపతులు.. తమ వయసు విషయంలో ఇలాంటి భయాందోళనల్ని వ్యక్తం చేస్తుంటారు. అలాంటప్పుడు రెండో బిడ్డ కోసం ప్లాన్‌ చేసుకునే ముందు డాక్టర్‌ వద్ద తమ ఆరోగ్య పరిస్థితుల్ని ఓసారి చెక్‌ చేయించుకోవడం.. రిస్క్‌ ఎందుకు అనుకునే వారు సామాజిక స్పృహతో ఒకరిని దత్తత తీసుకోవడం.. వంటివి చేయచ్చు. ఒకవేళ పలు కారణాల రీత్యా ఆలస్యంగా పిల్లల్ని కనాలనుకునే వారి కోసం ప్రస్తుతం ఎగ్‌ ఫ్రీజింగ్‌ (అండాల్ని నిల్వ చేసుకోవడం).. వంటి ఆధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇన్ని ఆప్షన్లున్నప్పుడు రెండో బిడ్డ విషయంలో సంశయించాల్సిన పని లేదన్నది స్పష్టమవుతోంది.

వాళ్ల అనుబంధం ఎలా ఉంటుందో?

కొంతమంది తల్లులు తమకు ఒక్క బిడ్డే చాలనుకుంటే.. మరికొందరు తమ మొదటి బిడ్డకు కచ్చితంగా ఓ తమ్ముడో/చెల్లో ఉండాలని ఆరాటపడుతుంటారు. అయితే ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య అనుబంధం ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందే వారూ లేకపోలేదు. నిజానికి ఇది తల్లిదండ్రుల ప్రవర్తన పైనే ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. మొదటి బిడ్డ అని ప్రేమ కురిపించడం, చిన్నవాడని అతి గారాబం చేయడం, ఒకరితో ఒకరిని పోల్చడం, వస్తువులు-దుస్తులు కొనే విషయంలో వ్యత్యాసం చూపించడం.. ఇలాంటివి చేస్తే ఇద్దరి మధ్య మీరే చిచ్చు పెట్టిన వారవుతారు. తద్వారా ‘నీకు వాడంటేనే ఇష్టం..’ అన్న భావన మరో చిన్నారిలో ఏర్పడచ్చు. కాబట్టి ఈ తారతమ్యాలు లేకుండా.. ఇద్దరికీ సమానంగా ప్రేమ పంచగలనన్న స్వీయ నమ్మకం ఉంటే వెనకడుగు వేయాల్సిన పని లేదంటున్నారు నిపుణులు.

మరి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవడంతో పాటు మీ ఇద్దరి ఆరోగ్యం, ఇతర విషయాల్లో ఏవైనా సందేహాలు/సమస్యలుంటే.. నిపుణుల వద్ద నివృత్తి చేసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్