నచ్చిన వ్యక్తికి ఇలా దగ్గరవ్వండి..!

మనలో చాలామంది ఒక వ్యక్తిని ప్రేమించడం కంటే.. ప్రేమిస్తోన్న విషయాన్ని ఆ వ్యక్తికి తెలియజేయడమే చాలా కష్టమైన పనిగా భావిస్తుంటారు. దీనికి కారణం ఎదుటి వ్యక్తి మన ప్రేమను అంగీకరిస్తే సరే.. లేదంటే అప్పటివరకు తమ మధ్య ఉన్న పరిచయం, స్నేహం ఎక్కడ పాడవుతాయో అని భయంతో చెప్పకుండా ఆగిపోతుంటారు.

Published : 17 Oct 2021 14:28 IST

మనలో చాలామంది ఒక వ్యక్తిని ప్రేమించడం కంటే.. ప్రేమిస్తోన్న విషయాన్ని ఆ వ్యక్తికి తెలియజేయడమే చాలా కష్టమైన పనిగా భావిస్తుంటారు. దీనికి కారణం ఎదుటి వ్యక్తి మన ప్రేమను అంగీకరిస్తే సరే.. లేదంటే అప్పటివరకు తమ మధ్య ఉన్న పరిచయం, స్నేహం ఎక్కడ పాడవుతాయో అని భయంతో చెప్పకుండా ఆగిపోతుంటారు. ఈ క్రమంలో తమ మనసులో మాటను వాళ్లతో ఎలా పంచుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. ఈ పరిస్థితిని చాలామంది అనుభవించే ఉంటారు. ఈ క్రమంలో మీ మనసుకు నచ్చిన వ్యక్తికి మీ ప్రేమ గురించి తెలిపే ముందు ఇవి పాటించండి..!

తెలుసుకోండి..!

మీరు ఇష్టపడుతోన్న వ్యక్తి ఆలోచనలు, అలవాట్లు, అభిరుచులు.. మొదలైన వాటి గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోడానికి ప్రయత్నించండి. ఇందుకోసం వాళ్లతో తరచూ మాట్లాడడానికి ప్రయత్నించండి. వాళ్లు వ్యక్తిగతంగా లేదా వృత్తిగతంగా ఏదైనా సహాయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు.. మీరు చేయగలిగే సహాయాన్ని వారికి అందించండి. ఈ క్రమంలో మీపై వారికి గౌరవం పెరగడమే కాకుండా.. ఒకరి గురించి ఒకరు ఎక్కువగా తెలుసుకునే అవకాశముంటుంది.

ఆటాడుకుందాం రా..!

ఒక వ్యక్తికి తక్కువ సమయంలో దగ్గర కావాలనుకుంటే వాళ్లతో కలిసి క్రీడల్లో పాల్గొనడం ఒక సులువైన మార్గం. ఈ క్రమంలో మీ మనసుకు నచ్చిన వ్యక్తికి ఏ ఆటలపై ఆసక్తి ఉందో తెలుసుకోండి. వాటిలో మీకు కూడా ప్రావీణ్యం ఉన్న ఓ ఆటను ఎంచుకొని... అది ఆడేందుకు అతడు/ఆమెని ఆహ్వానించండి. దీనివల్ల మీ మధ్య ఉండే స్నేహబంధం మరింత బలపడుతుంది.

నిజాయతీగా ఉండండి..!

ఏ బంధంలోనైనా నిజాయతీతో ఉండడం చాలా ముఖ్యం. అది లేనప్పుడు ఎంత గొప్ప బంధమైనా ఎక్కువకాలం నిలబడదు. ఈ క్రమంలో మీ మనసుకు నచ్చిన వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎప్పుడూ నిజాలే మాట్లాడండి, నిజాయతీగా ఉండండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లకు మీరేదైనా అబద్ధం చెప్పి ఉంటే.. తగిన సమయం చూసి అసలు నిజాన్ని చెప్పండి. దీనివల్ల అవతలి వ్యక్తికి మీపై ఉండే నమ్మకం, గౌరవం పెరుగుతాయి.

నవ్వు.. నవ్వించు..!

ఎదుటి వ్యక్తిని తొందరగా ఆకట్టుకోవాలంటే హాస్య చతురతతో మాట్లాడడం ఒక సులువైన పద్ధతి. నవ్వుతూ.. నవ్విస్తోన్న వ్యక్తిని ఎవ్వరూ దూరం చేసుకోరు. అలా అని మాట్లాడే ప్రతి విషయంలో ఎదుటివారిని నవ్వించాలని కాకుండా.. సందర్భానికి తగ్గట్లు హాస్యాన్ని పండించగలిగితే చాలు.. అవతలి వ్యక్తికి మీతో మాట్లాడాలని ఆసక్తి కలుగుతుంది.

సర్‌ప్రైజ్ ఇవ్వండి..!

మీరు ప్రేమిస్తోన్న వ్యక్తి పుట్టిన తేదీని కనిపెట్టడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఈ క్రమంలో వాళ్ల బర్త్‌డే రోజున వాళ్ల అభిరుచికి తగ్గట్లుగా గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయండి. మీరిచ్చే కానుక ఖరీదైనదే ఉండాలనేమీ లేదు. ఒక చాక్లెట్, ఫ్లవర్ బొకే, గ్రీటింగ్ కార్డ్.. ఇలా ఏదైనా సరే.. అందులో మీ ప్రేమ వ్యక్తమైతే చాలు..!

ప్రశంసించడం మానకండి..!

ఎవరైనా ఏదైనా మంచి పని చేసినప్పుడు.. ఆ వ్యక్తిని నలుగురిలో ప్రశంసించగలగడం ఒక గొప్ప గుణం. ఇలా చేయడం వల్ల మీ మాటలు ఆ వ్యక్తికి ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా.. మీపై ఇష్టం, గౌరవాన్ని పెంచుతాయి. ఈ క్రమంలో మీరు ప్రేమిస్తోన్న వ్యక్తి ఏదైనా మంచి పని చేసినప్పుడు లేదా ఏదైనా పనిలో విజయం సాధించినప్పుడు.. వారిని తప్పక ప్రశంసించండి. దీనివల్ల వాళ్ల శ్రమను మీరు గమనిస్తున్నారనే విషయం అవతలి వ్యక్తికి అర్ధమవుతుంది.

స్నేహమే ముందు..!

చరిత్రలో ఎంత గొప్ప ప్రేమికులైనా ముందు స్నేహితులుగా తమ ప్రయాణాన్ని మొదలు పెట్టినవారే..! అందుకే మీరు ఇష్టపడుతోన్న వ్యక్తితో ముందు స్నేహం చేయండి. వాళ్లతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. ఈ క్రమంలో ఒకరి మనస్తత్వం గురించి ఒకరికి అర్ధమవుతుంది. అంతే కాకుండా స్నేహం వల్ల ఇద్దరి మధ్య సాధారణంగా ఉండే మొహమాటం, బిడియం, సిగ్గు... లాంటివి తొలగిపోయి మనసులోని భావాలను ధైర్యంగా చెప్పగలిగే అవకాశముంటుంది.

అభిరుచులను పంచుకోండి..!

రెండు మనసులు కలవాలంటే.. ముందు వాళ్ల అభిరుచులు కలవాలి. అందుకే మీరు ఇష్టపడుతోన్న వ్యక్తితో మీ అభిరుచులు, ఇష్టాయిష్టాల గురించి తరచూ పంచుకోండి. మీరు తరచూ వెళ్లే ప్రదేశాలకు వారిని కూడా తీసుకెళ్లడానికి ప్రయత్నించండి. ఇది కాకుండా మీ కెరీర్ ప్లాన్స్, మీకు నచ్చే పుస్తకాలు, వంటకాలు, సినిమాలు.. మొదలైన విషయాల గురించి వాళ్లతో పంచుకోండి. ఒకవేళ అవతలి వ్యక్తికి కూడా మీకున్న ఆలోచనలే ఉంటే.. మీ బంధం బలపడడం ఖాయం..!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్