చిరునవ్వులే చిరునామాలు!

ఆలుమగల మధ్య అరమరికల్లేకుండా, హాయిగా, ఆనందంగా సాగే సంసారానికి చిరునవ్వులే చిరుమానాలు. దంపతుల మధ్య శారీరక, మానసిక ఉత్సాహానికి దోహదపడే సంతోషాలు విరిజల్లుల్లా కురియాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. అవేంటో తెలుసుకుంటే ఆనంద.......

Published : 12 Apr 2022 20:40 IST

ఆలుమగల మధ్య అరమరికల్లేకుండా, హాయిగా, ఆనందంగా సాగే సంసారానికి చిరునవ్వులే చిరుమానాలు. దంపతుల మధ్య శారీరక, మానసిక ఉత్సాహానికి దోహదపడే సంతోషాలు విరిజల్లుల్లా కురియాలంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. అవేంటో తెలుసుకుంటే ఆనంద దాంపత్యానికి మార్గం దొరికినట్టేగా మరి!

సుప్రియ, సురేష్‌లకు 6 నెలల క్రితం వివాహమైంది. మొదటి మూడు నెలలు హ్యాపీగానే గడిపేశారు. నాలుగో నెలలో అడుగు పెట్టారో లేదో చిరాకు పరాకులు మొదలయ్యాయి. మొగుడు-పెళ్లాల మధ్య చిన్న చిన్న విషయాలకు మనస్పర్థలు రావడం.. వాదనలు చోటుచేసుకోవడమనేది ప్రతి కాపురంలోనూ సాధారణమైన విషయమే. కానీ, సమస్య మరీ తీవ్రస్థాయికి చేరుకుంటున్నప్పుడు మాత్రం దానిని గమనించి విభేదాల ద్వారా ఆలుమగల సంతోషాలు చేజారిపోకుండా జాగ్రత్తపడాలి. అప్పుడే దాంపత్యం గాఢత పెరిగి, ప్రేమబంధం మరింత పటిష్టమవుతుంది. చిన్నపాటి వాదనలు చోటుచేసుకొన్నప్పుడు వెంటనే నువ్వెంత అంటే నువ్వెంత అనుకోకుండా పెళ్త్లెన కొత్తల్లో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న మధురమైన జ్ఞాపకాలను ఒక్కసారి తలచుకుని చూడండి.. మీ ఇద్దరి మధ్య ఉన్న కలతలన్నీ పరార్ కావాల్సిందే!

నవ్వుతూ... నవ్విస్తూ...

భార్యాభర్తల మధ్య చిన్నపాటి వాదనలు తలెత్తినప్పుడు వీలైనంత వరకు ఇరువురూ వాటిని తేలిగ్గా తీసుకుని, నవ్వుతూ.. నవ్విస్తూ.. ముందుకు సాగిపోవాలి. ప్రతి విషయాన్నీ నవ్వుతూ తేలిగ్గా తీసుకోవడమే కాదు.. ఎదుటివారిని నవ్వించడం కూడా తెలిసుండాలి. అయితే భాగస్వామి కదా అని.. అన్ని వేళలా నవ్వించేందుకు చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించకపోవచ్చు. ఎదుటివారు నొచ్చుకోవచ్చు కూడా. కొన్ని సందర్భాల్లో మీరు అవమానకర ధోరణిలో మాట్లాడుతున్నారనే అభిప్రాయం ఎదుటివారికి కలగవచ్చు. అదే జరిగితే మీ బంధం చిక్కుల్లో పడినట్లే. అందుకే ఎదుటివారు నొచ్చుకుంటున్నట్లు ఏ మాత్రం సంకేతం అందినా.. తక్షణం మౌనం వహించడం మేలు. మాటలు విసురుకోవడం వల్ల మనసులు గాయపడతాయని గ్రహిస్తే తగవులు సర్దుకోవడమే కాదు.. అనుబంధాలు కూడా వెల్లివిరుస్తాయి.

గమనించి మాట్లాడాలి..

కొందరు బాధలోనైనా సరే.. ఉద్వేగాలను పెద్దగా పట్టించుకోకుండా సరదాగా మాట్లాడేస్తుంటారు. కానీ ఎదుటివారి బాధను కూడా గమనించి మాట్లాడాలి. బాధ కలిగే సందర్భాన్ని అంతే నెమ్మదిగా చెప్పాలి తప్ప.. సరదాగా తీసుకోకూడదు. ఇలా జాగ్రత్తగా మసలుకుంటూ, ప్రతి చిన్న విషయానికీ రాద్ధాంతం చేయని మీ తీరు భాగస్వామిలో మీపై భరోసాని, కాపురంపై నమ్మకాన్ని పెంచుతాయి. ఫలితంగా కలతలేవీ మీ కాపురం దరికి అంత తొందరగా చేరవు. కాబట్టి మీ దాంపత్యం ప్రశాంతతకు చిరునామాగా నిలుస్తుంది. అంతేకాదు, ఇరువురూ అనవసరపు చర్చలతో వాదులాడుకోవడానికి తర్వాత్తర్వాత ఆలోచిస్తారు కూడా. ఒక్కోసారి అనవసరంగా జరిగిన అలాంటి సంఘటనలు గుర్తుకొస్తే మీలో మీరే నవ్వుకుంటారు. అలాగని, వాటిని అంత తేలికగా తీసిపారేయకండి. అవి మీ మధ్య అగాథాల్ని పెంచే అవకాశాలూ లేకపోలేదు. అందుకే వీలైనంత వరకు గొడవలు, వాదనలు రాకుండా జాగ్రత్తగా ఉండటం మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్