వీటిని ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించద్దు!

ఏ పదార్థాలనైనా త్వరగా, సులభంగా ఉడికించడానికి మనం ఎంచుకునేది ప్రెషర్‌ కుక్కర్‌/ఎలక్ట్రిక్‌ ప్రెషర్‌ కుక్కర్‌. అయితే కొన్ని పదార్థాలను మాత్రం దీనిలో ఉడికించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిలోని పోషకాలు నశించిపోవడంతో పాటు ఈ పద్ధతి ఆరోగ్యానికీ మంచిది కాదని చెబుతున్నారు.

Updated : 10 Aug 2022 17:20 IST

ఏ పదార్థాలనైనా త్వరగా, సులభంగా ఉడికించడానికి మనం ఎంచుకునేది ప్రెషర్‌ కుక్కర్‌/ఎలక్ట్రిక్‌ ప్రెషర్‌ కుక్కర్‌. అయితే కొన్ని పదార్థాలను మాత్రం దీనిలో ఉడికించకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిలోని పోషకాలు నశించిపోవడంతో పాటు ఈ పద్ధతి ఆరోగ్యానికీ మంచిది కాదని చెబుతున్నారు. ఇంతకీ ఏయే పదార్థాలకు ప్రెషర్‌ కుక్కర్‌ వాడకూడదో తెలుసుకుందాం రండి..

స్టార్చ్‌ ఫుడ్స్‌

అన్నం వండుకోవడానికి ఇప్పుడందరూ ఎలక్ట్రిక్‌ రైస్‌ కుక్కర్‌/ఎలక్ట్రిక్‌ ప్రెషర్‌ కుక్కర్‌ని వాడుతున్నారు. నిజానికి ఇది సులభమైన పద్ధతే అయినా.. బియ్యం, బంగాళాదుంపలు, పాస్తా.. వంటి స్టార్చ్‌ ఫుడ్స్‌ని అధిక ఉష్ణోగ్రతల వద్ద తయారుచేసే క్రమంలో అక్రిలమైడ్‌ అనే రసాయనం విడుదలవుతుందట! ఇది నరాల్ని డ్యామేజ్‌ చేయడంతో పాటు కండరాల బలహీనతకు, సంతానలేమికి దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ రసాయనం క్యాన్సర్‌ వంటి మహమ్మారుల బారిన పడేలా చేసే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు.

కాయగూరలు

కొంతమంది కాయగూరల్ని ముందు ప్రెషర్‌ కుక్కర్‌లో ఉడికించి మరీ ఆ తర్వాత కూర తయారుచేసుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల అధిక వేడికి వాటిలోని పోషకాలన్నీ నశించిపోతాయంటున్నారు నిపుణులు. తద్వారా అవి శరీరానికి అందకపోగా.. ఇదిలాగే కొనసాగిస్తే కొన్నాళ్లకు పోషకాల లోపం తలెత్తే ప్రమాదమూ ఉందంటున్నారు. అందుకే వాటిని సాధారణంగా ఉడికించి.. ఆ నీటిని కూరలో వాడుకోవడం లేదంటే దాంతో సూప్స్‌ తయారుచేసుకోవడం మంచిది.

పాలు

కొంతమంది పాలను మిల్క్‌ బాయిలర్‌లో మరిగిస్తుంటారు. నిజానికి ఇదీ అధిక ఉష్ణోగ్రత కిందకే వస్తుంది. తద్వారా పాలలోని పోషకాలు నశించిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి పాలను బాయిలర్‌లో కాకుండా సాధారణ గిన్నెలో ఒకటి లేదా రెండు పొంగులు వచ్చే వరకు స్పూన్‌తో కలుపుతూ మరిగించుకోవాలి. అలాగే ఒకసారి మరిగించిన పాలను పదే పదే వేడి చేయడం కూడా సరికాదంటున్నారు.

ఇవి గుర్తుపెట్టుకోండి!

* త్వరగా వంట పూర్తి కావాలని కొంతమంది.. సాధారణంగా వచ్చే విజిల్‌ కంటే ముందుగానే అందులోని ప్రెజర్‌ని పోగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడం వల్ల పదార్థం సరిగ్గా ఉడక్కపోగా.. ఇది చాలా ప్రమాదకరం కూడా!

* ప్రెజర్‌ కుక్కర్‌లో సరైన మోతాదులో నీళ్లు పోయడం తప్పనిసరి! అయితే కొంతమంది కూర చిక్కదనం కోసం ముందుగానే కార్న్‌స్టార్చ్‌.. వంటివి కలుపుతుంటారు. తద్వారా ఆ పదార్థం మరింత చిక్కబడి కుక్కర్‌లోని ప్రెజర్‌ పూర్తిగా బయటికి పోదు. ఇలాగే మూత తీస్తే ప్రమాదకరం.. కాబట్టి చిక్కదనం కోసం ఏవైనా పదార్థాలు కలపాలనుకుంటే.. అవి ఉడికిన తర్వాత కలుపుకొని మరోసారి సాధారణంగా ఉడికించుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్