ఫ్యాషన్‌తో ప్లాస్టిక్‌ జత కట్టింది..

కంటికింపైన రంగుల్లో, చూడముచ్చటైన డిజైన్లతో, ఈతరం మెచ్చే దుస్తులవి... ఆ పనితనం చూసినవారెవరూ.. వాటిని ప్లాస్టిక్‌ వ్యర్థాలతో చేశారని గుర్తించలేరు. లాక్మే ఫ్యాషన్‌ వేదికపై ప్రదర్శించిన ఈ వస్త్రశ్రేణి... 22 ఏళ్ల సారా లఖానీ సృష్టి.

Published : 10 Apr 2023 00:49 IST

కంటికింపైన రంగుల్లో, చూడముచ్చటైన డిజైన్లతో, ఈతరం మెచ్చే దుస్తులవి... ఆ పనితనం చూసినవారెవరూ.. వాటిని ప్లాస్టిక్‌ వ్యర్థాలతో చేశారని గుర్తించలేరు. లాక్మే ఫ్యాషన్‌ వేదికపై ప్రదర్శించిన ఈ వస్త్రశ్రేణి... 22 ఏళ్ల సారా లఖానీ సృష్టి. ప్లాస్టిక్‌ కవర్లనే దారపు పోగులుగా మార్చి కాంతావర్క్‌తో కొత్త అందాలు సృష్టించిన ఆమె ప్రయాణం గురించి మనమూ తెలుసుకుందామా!

పర్యావరణానికి ముప్పు తెచ్చే ప్లాస్టిక్‌ ఉత్పత్తినే కాదు, వాడకాన్నీ తగ్గించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంశానికే సారా ప్రాధాన్యతనిచ్చారు. ప్రకృతి సహజ అందాలూ, పచ్చదనంతో నిండిన గడ్చిరోలీ ఆమె స్వస్థలం. తండ్రి ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ యజమాని. బాల్యం నుంచి సారా ప్రకృతి ప్రేమికురాలు. అయితే, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగం వంటివి పాటించడానికి తగిన దారులు లేకపోవడంతో తండ్రి వాటిని తగలబెట్టేవారు. ఆ పొగ పర్యావరణానికి హాని చేస్తుందనే బాధతో సారా ఆయనకి చాలా సార్లు నచ్చచెప్పడానికీ ప్రయత్నించారట. కానీ, వాటి నిర్వహణకు తగిన వనరులేమో లేవు. అది మొదలు సారా ఆలోచనలన్నీ... ప్లాస్టిక్‌ పునర్వినియోగం మీదే. ఈమెకి ఫ్యాషన్‌ మీద మక్కువ. దీంతో డిజైనింగ్‌ కోర్సులో చేరారు. ఫ్యాషన్‌ విద్యార్థినిగా దుస్తుల తయారీలో ప్లాస్టిక్‌ను జత చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన సారాను కొత్త అద్భుతాలు సృష్టించే దిశగా నడిపించింది.

విఫలమైనా వెనుతిరగలేదు... డిజైనింగ్‌ చివరి ఏడాదిలో ఫ్యాషన్‌ వేదికపై తన ఆలోచనలకు రూపం ఇచ్చే అవకాశాన్ని అందుకున్నారు. అయితే, అవి ప్రదర్శనలకోసమే కాదు.. ధరించడానికీ సౌకర్యంగా ఉండాలని భావించారామె. ఇందుకోసం ఎన్నో పరిశోధనలు చేశారు. ప్రయోగాలూ చేపట్టారు. ముందుగా ప్లాస్టిక్‌ కవర్లను సేకరించే ఎన్‌జీవోల సాయంతో రంగు రంగుల కవర్లను తీసుకున్నారు. ఈ వస్త్రశ్రేణిని సిద్ధం చేయడానికి ఉపయోగించిన దుస్తులూ అప్‌సైక్లింగ్‌ కోసం సేకరించినవే ఎంచుకున్నారు.

అంతా వింతగా చూసినా... ఏ పనైనా చెప్పడం సులువే...దాన్ని అమలులో పెట్టడమే కష్టం. ముందుగా ప్లాస్టిక్‌ దారాలతో ఎంబ్రాయిడరీ చేయడానికి ఏ తరహా వస్త్రం అనువైనదో చూడాలి. ఇందుకోసం రాత్రీ పగలూ తేడాలేకుండా స్వయంగా వేర్వేరు ఫ్యాబ్రిక్‌లపై ఈ పోగులతో కుట్టి పరిశీలించేవారు. కొన్ని అనుకున్నట్లుగా వచ్చేవి కావు. మరికొన్ని ప్రాథమిక దశలోనే ఫెయిల్‌ అయ్యేవి. అయినా, సరే పట్టు వదలకుండా చేస్తూనే ఉండేవారు సారా. మొదట్లో... ప్లాస్టిక్‌తో ఎంబ్రాయిడరీ చేయాలని చెబితే వర్కర్లంతా సారాని వింతగా చూశారట. చివరికి ఆమె ప్రయత్నం అర్థమయ్యాక బాంద్రాకు చెందిన ఓ కళాకారుడు ముందుకు వచ్చాడు.

అలసిపోలేదు... దుస్తుల మీద ఎంబ్రాయిడరీ కోసం సుమారు 200 పాలిథీన్‌ బ్యాగులను దారాలుగా మార్చారు. వీటితో సంప్రదాయ బెంగాలీ పనితనం కాంతా వర్క్‌ చేశారు. ఆకులూ, పక్షులు, కమలం వంటి ప్రకృతి సోయగాలతో ఆ దుస్తుల్ని తీర్చిదిద్దారు. ‘పలు ప్రయోగాల తర్వాత రెండు వారాలకు మొదటి అవుట్‌ఫిట్‌ను రూపొందించగలిగా. ప్లాస్టిక్‌ను దారంగా మార్చడం, ఆ తర్వాత దాంతో ఎంబ్రాయిడరీ చేయడం వంటివి చాలా సున్నితమైనవి. అయినా సరే, ఈ ప్రయోగాలు నాకు అలసటనివ్వలేదు. ‘ట్రాష్‌ ఆర్‌ ట్రెజర్‌’ కలెక్షన్‌గా వీటిని తీర్చిదిద్ది లాక్మే ఫ్యాషన్‌ వీక్‌లో ప్రదర్శించాం. వేదికపై ప్రముఖుల ప్రశంసలు మరింత ఉత్సాహానిచ్చాయి. ఆ ప్రదర్శన తర్వాత కూడా ఈ తరహా దుస్తులను తయారు చేస్తున్నా. టాపులూ, స్కర్టులూ, గౌనులు, జాకెట్‌లు... వంటి ఎన్నో రకాల దుస్తుల్ని రూపొందించా. వాటిని ఇన్‌స్టాగ్రాం ద్వారా విక్రయిస్తున్నా’ అంటున్నారు సారా. ఆమె ప్రస్తుతం ‘ముఫ్తీ’ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. త్వరలో సొంతంగా అవుట్‌లెట్‌ ప్రారంభించడానికి సిద్ధపడుతున్నారామె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్