కడుపు ఉబ్బరానికి... మండూకీ ముద్ర

ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా వయసుతో నిమిత్తం లేకుండా ఈమధ్య కాలంలో చాలా మంది కడుపుబ్బరంతో బాధపడుతున్నారు. దీన్నుంచి బయటపడటానికి మండూకీ ముద్ర ప్రయత్నించండి.

Published : 05 Aug 2023 00:15 IST

ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా వయసుతో నిమిత్తం లేకుండా ఈమధ్య కాలంలో చాలా మంది కడుపుబ్బరంతో బాధపడుతున్నారు. దీన్నుంచి బయటపడటానికి మండూకీ ముద్ర ప్రయత్నించండి..

రెండు కాళ్లూ ముందుకు మడిచి వజ్రాసనంలో నిటారుగా కూర్చోవాలి. రెండు చేతులూ పిడికిలి బిగించి ఫొటోలో చూపిన విధంగా పొత్తికడుపు వద్ద ఆనించాలి. నెమ్మదిగా శ్వాస వదులుతూ మెల్లగా ముందుకు వంగి నుదురు కింద ఆనేలా చూడాలి. ఒకవేళ మొదట్లో తల కింద ఆనించడం కష్టంగా అనిపిస్తే దిండు లాంటిది పెట్టి, దాని మీద నుదురు ఉంచాలి. అంత కూడా వంగలేదంటే సాధ్యమైనంత వరకూ వంగి మెల్లగా శ్వాస తీసుకుంటూ యథా స్థితికి రావాలి. ఇలా మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి. పొట్ట ఎక్కువగా ఉన్నవాళ్లు పొత్తి కడుపు మీద పిడికిలి తాకించడం ఇబ్బందిగా అనిపిస్తే అరచేతులు రెండూ ఆనించి కొన్ని రోజులు ప్రాక్టీస్‌ చేస్తే, తర్వాత శరీరం తేలిగ్గా వంగుతుంది. పిడికిలి ఆనించడం తేలికవుతుంది.

ప్రయోజనాలు... మండూకీ ముద్రతో జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలన్నిటినీ నివారించినట్లవుతుంది. పొత్తి కడుపు కండరాలు దృఢంగా అవుతాయి. (పాంక్రియాటిక్‌), కాలేయం, చిన్న, పెద్ద పేగులు.. ఇలా పొట్ట భాగం అంతా బలోపేతమవుతుంది. ఇన్సులిన్‌ స్థాయి తగ్గుతుంది. అక్కడ చేరిన గ్యాస్‌ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆకలి పెరుగుతుంది. నోరు పొడిబారడం తగ్గుతుంది. నాలుక పని తీరు మెరుగవుతుంది. శారీరకంగా, మానసికంగా శక్తి ఇనుమడిస్తుంది. ముఖంలో కాంతి వస్తుంది. శరీరం ముడతలు పడదు. జుట్టు త్వరగా తెల్లబడదు. గొంతు సమస్యలు నయమవుతాయి. మధుమేహం ఉన్నవాళ్లు మండూకీ ముద్రతో పాటు వక్రాసనం, అర్ధమత్స్యేంద్రాసనం కూడా చేస్తే సత్వర ప్రయోజనం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని