Published : 07/09/2021 00:39 IST

అతి క్రమశిక్షణ వద్దు

రమణికి తన పిల్లల ప్రవర్తన చూస్తుంటే వేదనగా ఉంది. ఎంత క్రమశిక్షణలో ఉంచుదామంటే వారి అల్లరి అంతగా పెరిగి పోవడం, మాట వినకపోవడం జరుగుతున్నాయి. ఇవన్నీ ఆమెను ఆందోళనకు గురి చేస్తున్నాయి. క్రమశిక్షణగా ఉంచాలనుకోవడంలో తప్పులేదు కానీ, అతి మంచిది కాదంటున్నారు మానసిక నిపుణులు. దాని వల్ల పిల్లల్లో పెంకితనం, కోపం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇలా జరగకుండా ఏం చేయాలో సూచిస్తున్నారు...

* తప్పు చేస్తే... చిన్నారులు ఆడుకునేటప్పుడు విలువైన వస్తువులు విరిగిపోతాయి. పుస్తకాల పట్ల అశ్రద్ధగా ఉంటూ చింపేస్తారు. ఏవైనా సామాన్లను తీసుకువస్తూ అనాసక్తిగానో చేజారో పడేస్తారు. ఇలాంటప్పుడు అరిచి, కోప్పడకూడదు. అలా చేయడం తప్పని, ఆ వస్తువు లేదా పుస్తకం విలువను అర్థమయ్యేలా మృదువుగా చెప్పాలి. అలా జరగకుండా జాగ్రత్తపడాలని వివరించాలి.

* నియమాలు.. నిద్ర, చదువు, ఆహారం తీసుకోవడం వంటి వాటికి ప్రత్యేక సమయాలుంటాయి. వాటిని చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. నియమాలను కఠినంగా నేర్పడం కాకుండా, ఏ సమయంలో ఏ పనులు చేస్తే ఎలాంటి సత్ఫలితాలుంటాయో కథల రూపంలో చెప్పగలిగితే, చక్కగా మాట వింటారు. క్రమేపీ ఆయా సమయాలకు అలవాటుపడతారు.

* వారి గదిని... ఆడుకున్న తర్వాత, లేదా హోంవర్క్‌ పూర్తయ్యాక వారి వస్తువులను వారే సర్దుకోవాలని చెప్పాలి. ఇది అలవాటు అవ్వాలంటే ఆ గదిని అల్మారా, బాక్సులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దితే చాలు. అలమరలో పుస్తకాలు సర్దడం, బాక్సుల్లో బొమ్మలను వేయడం ఒకటి రెండు సార్లు చేసి చూపించాలి. వారితో ఆ పని చేయించి, గదంతా ఎంత అందంగా మారిందో అని ప్రశంసించాలి. ఇది నెమ్మదిగా అలవాటుగా మారుతుంది.       

* వినాలి... బంధువులు వచ్చినప్పుడు లేదా వారి స్నేహితులున్నప్పుడు పిల్లల ప్రవర్తనలో తేడా ఉంటే వచ్చిన వారెదుట చిన్నారులను కించపరచకూడదు. అలా ఎందుకు ప్రవర్తించారో తర్వాత ప్రశాంతంగా అడగాలి. వారు చెప్పేది పూర్తిగా వినాలి. అప్పుడే పెద్దవాళ్లు ఏం చెప్పినా పిల్లలు వినడానికి సిద్ధంగా ఉంటారు. వారి మనసును తెలుసుకోవాలి. అప్పుడు క్రమంగా వారి ప్రవర్తన మారుతుంది.

* పోలిక వద్దు ఇతరులతో పోల్చి, క్రమశిక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారని, మంచి మార్కులు రావడం లేదని కోప్పడకూడదు. అందరు చిన్నారుల మనస్తత్వం ఒకేలా ఉండదు. జ్ఞాపకశక్తి, ఆరోగ్యం, ఏకాగ్రత, అలవాట్లు వంటివన్నీ వారి చదువుపై ఉంటాయి. వాటిని గుర్తించి, మెరుగుపడేలా తల్లిదండ్రులు చేయూతనందిస్తే చాలు. అందరూ రేపటి భావిపౌరులుగా ఎదుగుతారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని