దాంపత్యంలో స్నేహం...

స్నేహితులు ప్రేమికులుగా మారతారు. ఆ ప్రేమ జీవితభాగస్వాములను చేస్తుంది. అయితే చాలా జంటల్లో పెళ్లయ్యాక స్నేహం మాయమవుతుంది. దాంపత్యంలో ఎదురయ్యే సమస్యలను పంచుకోలేక సతమతమవుతుంటారు. ఏ బంధాల మధ్యనైనా...

Updated : 28 Oct 2021 06:18 IST

స్నేహితులు ప్రేమికులుగా మారతారు. ఆ ప్రేమ జీవితభాగస్వాములను చేస్తుంది. అయితే చాలా జంటల్లో పెళ్లయ్యాక స్నేహం మాయమవుతుంది. దాంపత్యంలో ఎదురయ్యే సమస్యలను పంచుకోలేక సతమతమవుతుంటారు. ఏ బంధాల మధ్యనైనా... స్నేహం ఉంటేనే పదిలంగా ఉంటుందంటున్నారు మానసిక నిపుణులు. దంపతుల మధ్య ముఖ్యంగా ఉండాల్సింది స్నేహబంధమే అని సూచిస్తున్నారు. దాన్ని నిలుపుకోవడం ఎలానో చెబుతున్నారు.

నిర్లక్ష్యం వద్దు... వివాహమైన తర్వాత ఆ వ్యక్తి ఇక తన జీవితంలోనే ఉన్నారనే ధీమా ఎదుటి వారికి నిర్లక్ష్యంగా కనిపించే ప్రమాదం ఉంది. పనిలో బిజీగా ఉంటే, తమను దూరం చేస్తున్నారనే భావన కలిగే అవకాశం ఉంది. ప్రేమ పదిలంగా ఉండాలంటే స్నేహాన్ని వీడకూడదు. భాగస్వామిలో స్నేహితుడు లేదా స్నేహితురాలిని చూడాలి. ప్రతి విషయాన్నీ పంచుకోవాలి. ఉద్యోగంలో లేదా ఇంట్లో తమ బాధ్యతల గురించి ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పాలి. కుటుంబపరంగా లేదా బయట ఏదైనా సమస్యలెదురైనప్పుడు ఇరువురూ కలిసి ఆలోచించి త్వరగా పరిష్కరించుకోవడం అలవరుచుకోవాలి. అప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా దూదిపింజలా ఎగిరిపోతుంది.

గుర్తిస్తే... స్నేహితులుగా ఉన్నప్పడు ఎదుటి వారి ఆహారపుటలవాట్లు, ఇంటి పనులు పూర్తిగా తెలియక పోవచ్చు. పెళ్లైన తర్వాత అవి తెలిశాక కొన్ని మీకు ఇబ్బంది కలిగించవచ్చు. అయినా వాటిని అర్థం చేసుకోవాలి. ఇరువురికీ సమస్య లేనంత వరకు వాటి విషయంలో ఒకరినొకరు విమర్శించకోకూడదు. వీలైతే నేర్పడానికి, నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తే చాలు. దానికి కొంత సమయం పట్టొచ్చు. సహనాన్ని పాటించడమే కాదు, ఒకరికోసం ఒకరుగా అలవాట్లను మార్చుకోవడంలోనూ ఆనందం ఉంటుంది. దాన్ని అనుభవించడం తెలిస్తే ఆ దాంపత్యం నిత్యనూతనమవుతుంది.

సమయం... స్నేహితులుగా ఒకరికోసం మరొకరు ఎక్కువ సమయాన్ని కేటాయించుకుని ఉంటారు. పెళ్లైన తర్వాత ఎవరి పనుల్లో వారు మునిగిపోతుండటంతో మాటలే కరువవుతాయి. అలాకాకుండా ఎంత బిజీగా ఉన్నా ఎదుటివారి కోసం సమయాన్ని వెచ్చించాలి. మనసుకిష్టమైన విషయాలను చర్చించుకోవడం, సరదాగా బయటకు వెళ్లడం వంటివి సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. అంతేకాదు, ఉదయం అరగంటసేపు చేసే వ్యాయామం, ఇష్టమైన వంటకాన్ని తయారు చేయడం, తోట పెంపకం వంటి వాటిని ఇద్దరూ కలిసి చేస్తే చాలు. ఆ రోజంతా ఉత్సాహంగా మారుతుంది. బంధమూ పటిష్టంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్