తొలినాళ్లలోనే...తెలుసుకోండి!

దంపతులిద్దరూ ఇలా మెలగాలి, అలా ప్రవర్తించాలి అనే నియమాలు, పద్ధతులు కొన్ని ఈరోజుల్లో సరిపోకపోవచ్చు. జీవనశైలి, ఇంటా బయటా బాధ్యతల్లో మార్పులు రావడమే

Updated : 25 Nov 2021 05:54 IST


దంపతులిద్దరూ ఇలా మెలగాలి, అలా ప్రవర్తించాలి అనే నియమాలు, పద్ధతులు కొన్ని ఈరోజుల్లో సరిపోకపోవచ్చు. జీవనశైలి, ఇంటా బయటా బాధ్యతల్లో మార్పులు రావడమే అందుకు కారణం. అలాగని మానవ సంబంధాలు మారకూడదంటున్నారు మానసిక నిపుణులు. సంసారం సవ్యంగా సాగాలంటే దాంపత్యంలో మొదటి నుంచీ పాటించాల్సిన కొన్ని అంశాలను సూచిస్తున్నారిలా..

పెళ్లైన తొలి నాళ్లలోనే ఇద్దరూ తమ గురించి ఎదుటి వారికి స్పష్టంగా చెప్పాలి. అప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకునే వీలుంటుంది.
నచ్చే, నచ్చని అంశాలు, ఆలోచనలు, లక్ష్యాలు, ఆశయాలు, మనస్తత్వం వంటివన్నీ ముందుగానే పంచుకుంటే జీవన ప్రయాణాన్ని సులువుగా మొదలుపెట్టొచ్చు. ఎదుటివారి బలం, బలహీనతలు తెలుసుకొని అసూయపడటం లేదా చులకనగా చూడటం వంటివి వద్దు. ఒకరి పట్ల మరొకరు చూపించుకునే గౌరవ మర్యాదలు, ప్రేమే వారి బంధాన్ని కలకాలం కాపాడుతుంది.
బాధ్యత.. కుటుంబ అవసరాలను తమ సంపాదనతో తీరుస్తున్నామని, అక్కడితో తమ బాధ్యత అయిపోయిందనే ఆలోచన దంపతుల్లో ఏ ఒక్కరికీ రాకూడదు. ఒకరు సంపాదించినా మరొకరు ఇంటి బాధ్యతలను పూర్తి చేస్తున్నారని గ్రహించాలి. అవసరమైతే వారికి చేయూతగా ఉండటానికి ప్రయత్నించాలి. గృహిణి అనే చులకనభావంతో భార్యను చూడకూడదు. ఇంటిల్లిపాది అవసరాలనూ తీర్చే భాగస్వామి కష్టాన్ని గుర్తించాలి. ఇంటి బాధ్యతలను సమన్వయం చేయడం కూడా క్లిష్టమైనదే. వీలైతే అందులోనూ వారికి చేదోడువాదోడుగా ఉంటే మంచిది. ఇలా భర్త తనపై శ్రద్ధ చూపిస్తున్నాడనే ఆలోచనే ఆ ఇల్లాలి మనసులో కొండంత ప్రేమను పెంచుతుంది.
 మాట్లాడాలి.. దంపతుల మధ్య నిత్యం సంభాషణలు, చర్చలుండాలి. వీటి ద్వారా సమస్యలు, సంతోషాలను ఒకరికొకరు పంచుకోగలుగుతారు. కాబట్టి, ఆ అవకాశం, సమయాన్ని ఇద్దరూ కల్పించుకోవాలి. పెళ్లై చాలా కాలమైంది, రోజూ ఏం మాట్లాడతాం అనుకోవద్దు. ఈ ధోరణి ఇద్దరి మధ్యా దూరం పెంచుతుంది. పిల్లలు పుట్టాక చాలామంది భార్యాభర్తలు తమ గురించి ఆలోచించడం మానేస్తారు. అలాకాకుండా ఇద్దరూ తమ మధ్య ప్రేమబంధాన్ని తాజాగా ఉంచుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. అప్పుడే బంధం శాశ్వతమవుతుంది.  

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్