Updated : 22/12/2021 04:58 IST

గారాబం.. అతి కావట్లేదు కదా!

పిల్లలన్నాక ముద్దుచేస్తాం. గారాలు పోతుంటే మురిపెంగా చూస్తాం. కానీ మితిమీరితే అదొక మానసిక జబ్బుగా పరిణమిస్తుందనీ.. అది పిల్లలకీ, పెద్దలకీ కూడా చేటేనంటున్నారు మనోవిశ్లేషకులు.

ద్యోగినులైన తల్లులు పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నామనే అపరాధ భావంతో వాళ్లేమడిగినా కొనిస్తుంటారు. దాంతో చిన్నారుల ఆశలకు రెక్కలు రావడం సహజం. వాళ్ల కోరికలు నెరవేర్చనప్పుడు కోపావేశాలతో ఎదిరించడం పరిపాటి అవుతుంది.

పిల్లలను అక్కున చేర్చుకోవాలి, అచ్చటా ముచ్చటా తీర్చాలి. కానీ ప్రేమ వేరు, గారాబం వేరు. మంచి మార్కులు తెచ్చుకుంటే లేదా తోటి పిల్లలకు సాయం చేస్తే మెచ్చుకోండి, ప్రేమ కురిపించండి. కానీ ఎవరినైనా గేలి చేసినా, కటువుగా మాట్లాడినా అది తెగువ, ధైర్యం కాదు. చిన్నతనంలో సరిచేయకుంటే ఆ లక్షణాలు బలపడిపోతాయి.

స్కూలుకు వెళ్లనంటే ఫరవాలేదనడం, హోంవర్క్‌ చేయలేనంటే మీరే చేసివ్వడం లాంటివి ప్రేమకు సంకేతం కాదు, చేతులారా చెడగొట్టడం. క్రమశిక్షణ విషయంలో అలసత్వం చూపితే ఆనక మూల్యం చెల్లించాలి. జీవితంలో అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోలేరు.

పిల్లల కోరికలన్నీ తీర్చలేనంత మాత్రాన ప్రేమ లేనట్లు కాదని అర్థమయ్యేలా చెప్పండి. వాస్తవికతను పరిచయం చేయండి. కుటుంబ పరిస్థితి, మీ మానసిక స్థితిని వివరించండి.

దేనికీ కాదనక, కోరిందల్లా ఇవ్వడం అలవాటు చేస్తే, ఇక ప్రతిదానికీ మంకుపట్టు పడతారు. అబద్ధాలు చెప్పడం, కోపతాపాలు ప్రదర్శించడం, రుబాబు చేయడం, దొంగిలించడం, దుర్భాషలాడటం లాంటి అవలక్షణాలు ఏర్పడే ప్రమాదముంది. భవిష్యత్తులో ఎవ్వరి మాటా వినరు. బాధ్యతారాహిత్యం, విసుగు, చిరాకు, మొండితనం అలవడతాయి.

అమిత గారాబంగా పెరిగిన పిల్లలు తామే అధికులమనుకుంటారు. తాము చెప్పిందే వినాలనుకుంటారు. ఇతరులను లక్ష్యపెట్టకపోగా చులకన చేస్తారు. ఏదైనా ఇచ్చే ముందే దాన్నోసారి ఆలోచించుకోండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని