Published : 01/01/2022 02:01 IST

ఇంటి పని అందరిదీ!

త రెండేళ్లుగా కరోనాతో ప్రపంచమంతా నానా అగచాట్లూ పడింది. ఆ ప్రభావం  మహిళల మీద  మరీ ఎక్కువగా పడింది.  మొదట్లో అది ఏమవుతుంది, ఎటు దారితీస్తుంది, దాన్నుంచి ఎలా రక్షించుకోవాలి అనేది శాస్త్రవేత్తలకి కూడా అంతుపట్టక  భయం గుప్పిట్లో బతికాం. అలాంటి స్థితిలో అందరూ అయోమయంలో పడ్డారు. ఇక స్త్రీల సంగతి మరీ దారుణంగా తయారైంది. ఉద్యోగాలు పోవడం లేదా రాబడి తగ్గడంతో అభద్రతా భావం పెరిగింది. లాక్‌డౌన్లు, లేఆఫ్‌లు లేదా అసలే కొలువులు పోవడాలతో ఆందోళన, ఒత్తిడి పెరిగాయి. ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ సభ్యులు రోజంతా ఇంట్లోనే ఉండటంతో పనిభారం ఎక్కువైంది. పిల్లలకు స్కూళ్లు, కాలేజీలూ లేకపోవడంతో వాళ్ల అల్లరీ అధికమైంది. తోటి పిల్లలతో ఆడుకునే అవకాశం లేక దారి తప్పడం, ఎదురు చెప్పడం లాంటివి కూడా ఆందోళన పెంచాయి. కరోనా భయం అనేది అందరిదీ అయినా అది ఎక్కువగా ప్రభావం చూపింది మాత్రం స్త్రీల మీదే. ఇందుకు ప్రధాన కారణం అవగాహనా లోపం, పరిధి పెంచుకోకపోవడం. అన్నీ తామే చేసుకుంటూపోతే అది శారీరకంగా మానసికంగా భారమనిపిస్తుంది. వంటావార్పూ తక్కిన పనులూ అన్నీ మీరొక్కరే చేస్తూ పోతే ఇక తక్కినవాళ్లకి అదే అలవాటై పోతుంది. ఎవరూ పనుల్లో జోక్యం చేసుకోరు. అలా కాకుండా మొదటి నుంచీ భర్తా, పిల్లలకు పనులు పంచాలి. అప్పుడు మితిమీరిన అలసట కలగదు. అందరికీ బరువు బాధ్యతలు తెలిసొస్తాయి. పనుల్లో ఉండే కష్టనష్టాలన్నీ అర్థమైనప్పుడు సానుభూతి, సహకారం అందుతాయి. మొత్తానికి ఈ మహమ్మారి మనందరికీ పెద్ద పాఠమే నేర్పింది. ఈ అనుభవంతో భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చాలానే నేర్చుకున్నాం.. జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా తట్టుకునే శక్తి మనకు ఉంటుంది. ఎలాంటి నిరాశా నిస్పృహా లేకుండా ఆశావహ దృక్పథంతో కొత్త ఉత్సాహంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని