Updated : 01/02/2022 04:10 IST

లక్ష్యాలు పెట్టొద్దు...

పిల్లల గురించి తల్లులు చేసే ఫిర్యాదుల్లో చదవడం లేదనేది ముఖ్యమైంది. నిజానికి ఇదేమంత పెద్ద సమస్య కాదంటున్నారు మనోవిజ్ఞానవేత్తలు. ఎందరో మేధావులు  పాఠశాలకు వెళ్లడానికి మొండికేసిన వాళ్లమేనని చెబుతారు. మీ చిన్నారికి కూడా చదువుపట్ల ఆసక్తి లేదంటే దాని గురించి కంగారుపడాల్సిందేమీ లేదు. ఈచిన్న సూత్రాలు పాటిస్తే సరిపోతుంది..

* ఆటల్లా చదువు వినోదంగా ఉండదు. కాబట్టి పిల్లలు వీలైతే దాన్ని తప్పించుకోవాలని చూస్తారు. అందుకే చిన్నతనంలో ఆడుతూపాడుతూ బోధించే విధానం ఉత్తమం అంటారు. మీ చిన్నారిని అలాంటి స్కూల్లో చేర్చండి. చదువు పట్ల బొత్తిగా ఆసక్తి లేకపోవడానికి టీచర్లు మందలించడం లేదా తోటి పిల్లలెవరైనా హేళన చేయడం లాంటి కారణాలున్నాయేమో పరిశీలించుకుని వాతావరణం అనుకూలంగా ఉండేట్లు చూడండి.

* పాఠాలు చదవననో, హోంవర్క్‌ చేయననో పేచీపెడుతున్న చిన్నారిని కొట్టడం కోప్పడటం చేయొద్దు. బలవంతంగా పుస్తకాల ముందు కూర్చోబెట్టగలరే కానీ ఆ అయిష్టాన్ని మాత్రం పోగొట్టలేరు. కనుక ముందు తనకి ఎందులో ఆసక్తి ఉందో తెలుసుకోండి. ఆడుకుంటానంటే లేదా డ్యాన్స్‌ చేస్తానంటే ఇష్టంగా ఆ పని చేయనివ్వండి. మీరు కూడా చిన్నారి స్థాయికి తగ్గి అందులో పాలుపంచుకోండి. అలా కొంతసేపు తనకి ఇష్టమైన వ్యాపకంతో సంతోషించాక చదువు ఎంత అవసరమో, ఇప్పటి పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే కనీస చదువు తప్పదని నెమ్మదిగా చెప్పండి. బొత్తిగా చదువు లేకుంటే ఏ ఉద్యోగమూ రాదని, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోవడం కష్టమని ఉదాహరణలతో చెప్పండి.

* పిల్లల అయిష్టాన్ని అర్థం చేసుకుని నిందోక్తులు లేకుండా చెబితే తప్పకుండా అర్థం చేసుకుంటారు. మీ చిన్నారిని ఎక్కువ మార్కులు వచ్చేవారితో పోల్చి తక్కువ చేయొద్దు. అందరి ఐక్యూ ఒకలా ఉండదు. ఎవరి నేర్పు వారికుంటుంది. టీచర్లకు కూడా వేరొకరితో పోల్చి తూలనాడొద్దని చెప్పండి. మీ చిన్నారికి మరో అంశంలో అభిరుచి ఉంటుంది. కనీస చదువు అవసరమే కానీ వెనకబడిన పిల్లలకు పెద్ద టార్గెట్లు పెట్టి భయపెడితే చదువుపట్ల మరింత అయిష్టత పెరగడమే గాక వ్యక్తిత్వ లోపాలూ చోటుచేసుకుంటాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని