సాన్నిహిత్యం.. మీ చేతుల్లో.. చేతల్లో!

ఆలుమగలు అన్యోన్యంగా ఉంటేనే చూడముచ్చటగా ఉంటుంది. జంట సాన్నిహిత్యంతోనే సంసారం సాఫీగా సాగుతుంది. అలా దగ్గర కావడానికి కొన్ని దారులు ఇవిగోండి.

Published : 04 Feb 2022 00:48 IST

ఆలుమగలు అన్యోన్యంగా ఉంటేనే చూడముచ్చటగా ఉంటుంది. జంట సాన్నిహిత్యంతోనే సంసారం సాఫీగా సాగుతుంది. అలా దగ్గర కావడానికి కొన్ని దారులు ఇవిగోండి.

* వినోదం: కలిసి గేమ్స్‌ ఆడటం.. జంటగా సినిమాలు చూడటం.. ఒకరికి నచ్చిన యాక్టివిటీ మరొకరు ఇష్టపడటం.. వీటితో సంతోషాల్లో తేలిపోవడమే కాదు.. జంటల మధ్య దగ్గరితనం పెరుగుతుంది.

* విజ్ఞానం: రాజకీయాలు, వ్యాపారం, పుస్తకాలు, సినిమాలు.. వీటిపై చర్చలు ఆసక్తికరంగా ఉంటాయి. టీవీ డిబేట్‌లా వాదించుకోకుండా శాంతంగా చర్చించుకుంటూ ఉంటే.. మేధోమథనం జరుగుతుంది. సందేహాలూ పటాపంచలు అవుతాయి. ఇంక సాన్నిహిత్యం పెరగకుండా ఉంటుందా?

* కలిసిమెలిసి: ఇంటి, వంటపనుల్లో భర్త ఓ చేయి వేసి చూస్తే.. ‘మా శ్రీవారు మగానుభావులు’ అని మెచ్చుకొని తీరుతుంది శ్రీమతి. ఆమెకి పనిలో సాయం చేస్తూనే మనసు గెలుచుకోవడం బోనస్‌.

* చేతల్లో: ఐలవ్యూ అని రోజుకి పదిసార్లు చెప్పడం కన్నా.. ఏడాదికోసారి వచ్చే పుట్టినరోజో, మరో ప్రత్యేక సందర్భమో గుర్తుంచుకొని మనసుకి నచ్చిన బహుమతి ఇచ్చారనుకోండి.. భాగస్వామి ముఖం వెయ్యివాట్ల బల్బులా వెలిగిపోదూ! వాహనం, ఇల్లు కొనడాలు.. నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లడం... ఇవన్నీ బాధ్యతాయుత బంధంతో సన్నిహితమయ్యే మార్గాలే.

* భావోద్వేగం: కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్చడం.. కొత్త పని చేస్తుంటే వెన్నుతట్టి ప్రోత్సహించడం.. విజయం సాధిస్తే మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం.. ఈ చిన్నచిన్న పనులే ఇద్దర్ని మానసికంగా మరింత దగ్గర చేస్తాయి.

* రొమాన్స్‌: ఆలుమగల మధ్య సాన్నిహిత్యం రెట్టింపు కావడంలో ఇదీ కీలకమే. కలయిక ఎప్పుడూ ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. మొరటుగా కాకుండా అవతలివారి మనసెరిగి ప్రవర్తిస్తే.. తనువులే కాదు.. మనసులూ దగ్గరవుతాయి.

* ఆధ్యాత్మికం: భక్తి భగవంతుడికి దగ్గర చేస్తే.. ఆధ్యాత్మిక భావనలతో భార్యాభర్తలూ దగ్గరవుతారు. భర్త ఆయురారోగ్యాల కోసం శ్రీమతి చేసే పూజలు.. సతి మేలు కోరుతూ పతి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం మానసికంగా దగ్గరవడానికి దారులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్