Published : 14/02/2022 00:21 IST

బంధం... ఇలా దృఢం!

ఒకప్పుడు ఒకరు లేనిదే మరొకరు జీవించలేమంటారు. జీవితకాలం కలిసుండాలని ప్రమాణాలు చేసుకుంటారు. తీరా పెళ్లయ్యాక కొన్ని జంటల్లో ప్రేమ ఇంకిపోతోంది. ‘నువ్వు లేక నేను లేను’ అన్నవాళ్లే ‘నీ నీడను కూడా భరించలేను’ అనే స్థితికి ఎలా వస్తున్నారు? ఐద్వా తరఫున వందలాది జంటలకు కౌన్సెలింగ్‌ ఇచ్చిన ఇందిర దండ్యాల ఏమంటున్నారంటే..

పెళ్లయిన కొత్తలో ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆకర్షణ, సానుభూతి ఉంటాయి. పరస్పరం అర్థంచేసుకుని సహకరించుకుంటారు. కొన్నాళ్లు గడిచేసరికి ప్రేమ లోపించి పెళ్లి మాత్రమే మిగులుతోంది. ప్రేమ లోపించాక ఒకరి ఉనికి మరొకరికి వెగటుగా తోస్తుంది. ఇక చెప్పాల్సిందేముంది... ఇద్దరి మధ్యా గొడవలూ గలాటాలూ. ప్రేమ లోపించడానికి.. పరస్పరం నమ్మకం లేకపోవడం, బాధ్యతారాహిత్యం, మద్యం లాంటి వ్యసనాలు, అక్రమ సంబంధాలు, ఒత్తిడి, ఇద్దరి మధ్యా తగినంత అనుబంధం లేకపోవడం లాంటి కారణాలెన్నో . చాలా జంటలు విడిపోవడానికి అహంభావమే ముఖ్య కారణమంటే అతిశయోక్తీ కాదు. సర్దుకుపోయే తత్వం బొత్తిగా లోపిస్తోంది.

* వాస్తవికతకు దగ్గరగా... జీవితం సినిమాలా ఉండదు. వాస్తవంలో జీవించాలి. ప్రతిదాన్నీ డబ్బుతో ముడిపెట్టి చూస్తే కష్టం. అలాగే వ్యక్తిగత జీవితాన్ని వృత్తి జీవితాన్ని వేర్వేరుగా చూడాలి.

* పెద్దల ప్రభావం... కుటుంబ నేపథ్యం, పెరిగిన వాతావరణం, పెద్దల మాటతీరు, ప్రవర్తన, వాళ్ల జీవనశైలి, పిల్లలను పెంచే తీరు కూడా పెళ్లిపై ప్రభావం చూపుతాయి. పిల్లలకు బాధ్యతతో కూడిన స్వేచ్ఛ ఇస్తూనే గమనించుకోవాలి. వాళ్లు త్వరపడి తప్పు నిర్ణయం తీసుకుంటే పెద్దలు మార్గనిర్దేశం చేయాలి. జీవితం పట్ల అవగాహన ఉన్నప్పుడే తగిన నిర్ణయాలు తీసుకుంటారు.

* సిసలైన ప్రేమ... చాలా జంటల్లో ఒకరంటే ఒకరికి గౌరవం ఉండటంలేదు. తాము నమ్మడంలేదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలేదు. ప్రేమంటే కేవలం కబుర్లూ కానుకలూ కాదు. నిజమైన ప్రేమంటే గౌరవం, నమ్మకం, బాధ్యత. ఈ మూడు గుణాలుంటే చాలు.. విడిపోడమనే ప్రసక్తే ఉండదు. ఒకరి కోసం ఒకరుగా జీవనపర్యంతం ప్రేమలో ఓలలాడొచ్చు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని