ఈ అయిదూ ప్రేమభాషలే...

ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ భాష ఇతరులకు అర్థంకాదు. అలాగే దంపతుల నడుమ అనుబంధం అందరికీ తెలీదు. అదొక ప్రత్యేకమైన భాష. ఇరువురి మధ్య బంధాన్ని పెనవేసుకునేలా చేసే ఈ భాషకు అక్షరాలుండవు. మనసులను అర్థం చేసుకుంటూ అడుగువేయడమే ముఖ్యం. మరి వీటి గురించి తెలుసుకుందామా.

Published : 15 Feb 2022 02:00 IST

ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ భాష ఇతరులకు అర్థంకాదు. అలాగే దంపతుల నడుమ అనుబంధం అందరికీ తెలీదు. అదొక ప్రత్యేకమైన భాష. ఇరువురి మధ్య బంధాన్ని పెనవేసుకునేలా చేసే ఈ భాషకు అక్షరాలుండవు. మనసులను అర్థం చేసుకుంటూ అడుగువేయడమే ముఖ్యం. మరి వీటి గురించి తెలుసుకుందామా.

అర్థం చేసుకోవాలి... ఎదుటివారిని అర్థం చేసుకోవడం నేర్చుకుంటే చాలు. బంధాలమధ్య సమస్యలు చోటు చేసుకోవు. అవతలివ్యక్తి చెప్పేది పూర్తిగా వినాలి. వారి అభిప్రాయానికి విలువనివ్వాలి. ఒక్కొక్కొరి ఆలోచనధోరణి ఒక్కో రకంగా ఉంటుంది. అలానే భాగస్వామి మనలాగే ఆలోచించాలనే నియమం లేదు. అలా అనుకుంటే చాలు. వారి కోణం నుంచి ఆలోచించడం మొదలుపెడతాం. అప్పుడు మీ ఆలోచన విధానం మారిపోతుంది. ఏదైనా సందర్భంలో కోపం వచ్చినప్పుడు పది నిమిషాలు మెదలకుండా ఉండి, ఆ తర్వాత ఆలోచిస్తే కోపం మటుమాయం అవుతుంది. లేదంటే ఇరువురి మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంది.

పంచుకోవాలి... కలిసి జీవించడమే కాదు, సంతోషాన్ని కూడా ఇరువురూ పంచుకోవాలి. నవ్వుతూ ఉండటంలో దొరికే శారీరక మానసిక ఆరోగ్యంపై ఇరువురూ అవగాహనతో ఉంటే చాలు. సమస్యనూ నవ్వుతూ పరిష్కరించుకునే శక్తి దానంతటదే వస్తుంది. అలా జీవితంలో ప్రతి నిమిషం ఆనందదాయకంగా మారుతుంది. అలాగే అవసరమైనప్పుడు తోడుగా ఉన్న భావన ఎదుటి వారిలో కలిగించాలి. వారేం చెబుతున్నారో శ్రద్ధగా విని, ఆ బాధను పంచుకోవడంలో స్నేహితులుగా మెలిగితే చాలు... అది మీ బంధాన్ని మరింత దృఢపరుస్తుంది.

సారీ చెప్పాలి.. భాగస్వామి చేతిలో చేయి వేసి నేనున్నాననే భరోసా కల్పించాలి. అది వారిని మీకు మరింత దగ్గర చేస్తుంది. రోజూ ఉదయం నవ్వుతూ పలకరింపు, దగ్గరకు తీసుకోవడం వంటివి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. అప్పుడప్పుడూ వారెదురుచూడని విధంగా ఆశ్చర్యం కలిగించే చిన్న చిన్న కానుకలివ్వాలి. మీ ప్రవర్తనలో తప్పు అనిపిస్తే ఆలస్యం చేయకుండా క్షమాపణ కోరితే ఆ సమస్య అక్కడితో ముగిసి పోతుంది. ఆలస్యం చేస్తే అపార్థాలకు తావిచ్చినట్లు అవుతుంది. పొందే ప్రతి సాయానికి కృతజ్ఞతలు చెప్పడమూ అలవరుచుకోవాలి.

ప్రశంసలు... భాగస్వామి ఏదైనా పని విజయవంతంగా పూర్తి చేసినప్పుడు ప్రశంసించాలి.  మన మనిషే కదా... పొగడటం ఎందుకులే అనుకోకూడదు. మీరిచ్చే ఆ చిన్న ప్రోత్సాహం, ఆ చిన్న ప్రశంస వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. చిన్నదైనా పెద్దదైనా పనిని పంచుకోవడంలో ఇరువురికీ దక్కే సంతోషం ప్రత్యేకమవుతుంది. 

గతంలోకి.... అప్పుడప్పుడు గతంలోకి తొంగి చూడాలి. అప్పటి మధుర జ్ఞాపకాలను ఇరువురూ నెమరు వేసుకోవడంలో మనసులు  ఆనందంతో నిండుతాయి. పరిచయమైన కొత్తలో తీయించుకున్న ఫొటోలు, రాసుకున్న ప్రేమలేఖలను ఓసారి ఇద్దరూ తిరగేస్తే చాలు. వీలైతే ఇద్దరూ కలసి తిరిగిన ప్రదేశాలకు మరో సారి వెళ్లిరండి. వీటన్నింటితో మీ మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. భవిష్యత్తులోనూ ఆ ప్రేమ బంధం నిలుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని